వాళ్లలా విశ్వాసం చూపించండి | యోనాతాను
యెహోవాకు ఏదీ అడ్డు రాదు
ఎక్కడో దూరంగా ఉన్న ఒక సైనిక స్థావరాన్ని ఊహించుకోండి, అది ఎండిపోయిన రాళ్లు, గుట్టలు ఉన్న ప్రాంతానికి కాపలాగా ఉంది. పెద్ద ఆసక్తికరమైన విషయాలేమీ లేని ఈ ప్రాంతంలో ఫిలిష్తీయుల సైనికులకు ఒక ఆసక్తికరమైన విషయం కనపడింది. కొండల మధ్య ఉన్న లోయలో ఇద్దరు ఇశ్రాయేలీయులు ఎదురుగా నిలబడి ఉన్నారు. అది ఆ సైనికులకు నవ్వులాటగా అనిపించి ఉంటుంది. అక్కడ వాళ్లకు ఏ ప్రమాదం కనపడడం లేదు. ఫిలిష్తీయులు చాలా కాలం నుండి ఇశ్రాయేలీయుల మీద అజమాయిషీ చేస్తున్నారు. శత్రువులైన ఫిలిష్తీయుల దగ్గరకు సహాయం కోసం వెళ్లకుండా ఇశ్రాయేలీయులు, పొలాల్లో వాడే ఇనుప వస్తువులను కూడా పదును పెట్టించుకోలేరు. అందుకే ఇశ్రాయేలు సైనికులకు చాలా తక్కువ ఆయుధాలు ఉన్నాయి. పైగా వీళ్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఒకవేళ వాళ్ల దగ్గర ఆయుధాలు ఉన్నా వాళ్లు ఏ హాని చేయగలరు? వెక్కిరిస్తూ ఆ ఫిలిష్తీయులు ఇలా అరుస్తారు: పైకి ఎక్కి మా దగ్గరికి రండి, మేము మీకు ఒక గుణపాఠం చెప్తాము.—1 సమూయేలు 13:19-23; 14:11, 12.
నిజంగానే గుణపాఠం ఉంది, కానీ ఫిలిష్తీయులు ఆ గుణపాఠం చెప్పరు, వాళ్లకే అది గుణపాఠం అవుతుంది. ఆ ఇశ్రాయేలీయులిద్దరు లోయ గుండా పరిగెడుతూ, దాన్ని దాటుకుని పక్కన ఉన్న కొండ ఎక్కడం మొదలుపెడతారు. ఆ కొండ ఎంత నిటారుగా ఉందంటే వాళ్లు వాళ్ల కాళ్లను చేతులను ఉపయోగించి ఎక్కాలి. అయినా వాళ్లు ముందుకు వెళ్తూ ఎగుడు దిగుడుగా ఉన్న రాళ్లపై పాకుతూ, నేరుగా ఆ సైనిక స్థావరం వైపుకు వస్తున్నారు. (1 సమూయేలు 14:13) ముందు వస్తున్న అతను ఆయుధాలు ధరించి ఉన్నాడని ఫిలిష్తీయులు ఇప్పుడు గమనించారు. అతని ఆయుధములు మోసేవాడు వెనుక వస్తున్నాడు. ఏంటీ? ఆ ఫిలిష్తీయుల దండు అంతటిపైకి ఆ ఇద్దరు మనుషులు దాడి చేసేలా అతనేమైనా సిద్ధం పడుతున్నాడా? అతను పిచ్చివాడా?
అతను పిచ్చివాడు కాదు. గొప్ప విశ్వాసం ఉన్నతను. అతని పేరు యోనాతాను, నేటి నిజక్రైస్తవులకు అతని కథ ఎన్నో పాఠాలతో ఇప్పటికీ సజీవంగా ఉంది. నేడు మనం యుద్ధాలు చేయడం లేదు, కానీ నిజమైన విశ్వాసం పెంచుకోవడానికి మనకు ధైర్యం, విశ్వసనీయత, మనకన్నా ఎక్కువగా వేరేవాళ్ల గురించి ఆలోచించే గుణం అవసరం. వీటన్నిటి గురించి మనం యోనాతానులో ఎంతో నేర్చుకోవచ్చు.—యెషయా 2:4; మత్తయి 26:51, 52.
విశ్వసనీయంగా ఉన్న కొడుకు, దైర్యంగల సైనికుడు
యోనాతాను ఆ సైనిక దండు వైపు ఎందుకు వెళ్లాడో తెలుసుకోవడానికి మనం అతని గురించి తెలుసుకోవాలి. యోనాతాను, ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు పెద్ద కొడుకు. సౌలు రాజుగా అభిషేకించబడినప్పుడు, యోనాతాను బహుశా 20 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయుసున్నవాడే. యోనాతాను తన తండ్రితో దగ్గరి బంధాన్ని పెంచుకున్నాడు, సౌలు తరచూ తన కొడుకు మీద ఆధారపడేవాడు. ఆ తొలి రోజుల్లో, తన తండ్రి చాలా ఎత్తుగా, అందంగా, ధైర్యంగా ఉండే యోధుడనే కాదు అంతకన్నా ముఖ్యమైన విశ్వాసం, వినయం లాంటి లక్షణాలు ఉన్నవాడని యోనాతానుకు తెలుసు. యెహోవా సౌలును ఎందుకు రాజుగా ఎన్నుకున్నాడో కూడా యోనాతాను చూడగలిగాడు. ప్రవక్తయైన సమూయేలు కూడా సౌలు లాంటివాళ్లు దేశంలో ఎవ్వరూ లేరని చెప్పాడు!—1 సమూయేలు 9:1, 2, 21; 10:20-24; 20:2.
యోనాతాను తన తండ్రి ఆజ్ఞ మేరకు యెహోవా ప్రజల శత్రువులతో పోరాడడాన్ని ఎంతో గౌరవంగా భావించి ఉంటాడు. ఆ యుద్ధాలు నేడు జాతీయత వల్ల వచ్చే గొడవలు లాంటివి కావు. ఆ సమయంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని తనకు ప్రాతినిధ్యం వహించడానికి ఎన్నుకున్నాడు. ఆ దేశం అబద్ధ దేవుళ్లను ఆరాధించే దేశాల వల్ల ఎప్పుడూ దాడులకు లోనౌతూ ఉండేది. దాగోను లాంటి దేవుళ్ల ఆరాధన వల్ల కలుషితమైన ఫిలిష్తీయులు తరచూ యెహోవా ఎన్నుకున్న ప్రజలను అణచివేయడానికి, లేదా నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవాళ్లు.
కాబట్టి యోనాతాను లాంటివాళ్లకు, యుద్ధం చేయడం అంటే యెహోవా దేవునికి నమ్మకమైన సేవ చేయడానికి సంబంధించింది. అందుకే యెహోవా యోనాతాను ప్రయత్నాలను దీవించాడు. సౌలు రాజైన వెంటనే, ఆయన తన కొడుకును 1,000 సైనికులపైన అధిపతిగా నియమించాడు. యోనాతాను వాళ్లను గెబాలో ఉన్న ఫిలిష్తీయుల దండు మీద దాడికి తీసుకెళ్లాడు. అతని మనుషుల దగ్గర తక్కువ ఆయుధాలు ఉన్నా యెహోవా సహాయంతో ఆ రోజు యోనాతాను గెలిచాడు. దానికి జవాబుగా ఫిలిష్తీయులు గొప్ప సైన్యాన్ని పోగు చేసుకున్నారు. సౌలు సైనికులు చాలామంది భయపడిపోయారు. కొంతమంది పారిపోయి దాక్కున్నారు, కొంతమంది ఫిలిష్తీయుల వైపు చేరిపోయారు. కానీ యోనాతాను ధైర్యం అస్సలు తగ్గలేదు.—1 సమూయేలు 13:2-7; 14:21.
ప్రారంభంలో చూసినట్లు ఆ రోజున యోనాతాను, ఆయుధాలు మోసేవానిని పక్కన పెట్టుకుని మెల్లగా వాళ్లపైకి వెళ్దాం అనుకున్నాడు. వాళ్లు మిక్మషులో ఉన్న ఫిలిష్తీయుల స్థావరానికి దగ్గర అవుతుండగా యోనాతాను ఏమి చేయాలనుకుంటున్నాడో తన ఆయుధాలు మోసేవానితో చెప్పాడు. వాళ్లు అక్కడ కొండపైన ఉన్న ఫిలిష్తీయులకు తమను స్పష్టంగా కనపడేలా చేసుకుంటారు. ఆ ఫిలిష్తీయులు గనుక వాళ్లిద్దరినీ పైకి వాళ్ల మీదికి రమ్మని చెప్తే, యెహోవా తన సేవకులకు సహాయం చేస్తాడు అనడానికి అదే గుర్తు అవుతుంది. ఆయుధాలు మోసే అతను బహుశా, యోనాతాను పలికిన ఈ శక్తివంతమైన మాటలకు కదిలిపోయి వెంటనే ఒప్పుకుని ఉంటాడు: “అనేకులచేతనైనను కొద్దిమందిచేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా.” (1 సమూయేలు 14:6-10) అతని ఉద్దేశం ఏంటి?
యోనాతానుకు తన దేవుని గురించి బాగా తెలుసు. గతంలో యెహోవా తన ప్రజలు వాళ్లకన్నా ఎంతో ఎక్కువ సంఖ్యలో ఉన్న శత్రువులను ఓడించడానికి సహాయం చేశాడని యోనాతానుకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. కొన్నిసార్లు ఆయన కేవలం ఒక్కరిని ఉపయోగించుకుని కూడా వాళ్లకు విజయం తెప్పించాడు. (న్యాయాధిపతులు 3:31; 4:1-23; 16:23-30) కాబట్టి దేవుని సేవకులు ఎంతమంది ఉన్నారు, ఎంత బలం ఉంది, ఎన్ని ఆయుధాలు ఉన్నాయి అనేది కాదు ముఖ్యం, వాళ్ల విశ్వాసం ముఖ్యం అనేది యోనాతానుకు తెలుసు. విశ్వాసంతో యోనాతాను, తనూ తన ఆయుధాలు మోసే అతనూ ఆ సైనిక స్థావరం మీద దాడి చేయాలా వద్దా అనేది యెహోవాయే నిర్ణయించాలని అనుకున్నాడు. యెహోవా తన అంగీకారాన్ని చూపించేలా యోనాతాను ఒక గుర్తును పెట్టుకున్నాడు. యెహోవా అంగీకారాన్ని పొందాక యోనాతాను ధైర్యంగా ముందుకెళ్లాడు.
యోనాతాను విశ్వాసంలో ఉన్న రెండు కోణాలను చూడండి. మొదటిది, ఆయనకు తన దేవుడైన యెహోవా అంటే అపారమైన భయభక్తులు ఉన్నాయి. సర్వశక్తిమంతుడైన దేవుడు తన సంకల్పాలను నెరవేర్చుకోవడానికి మనుషుల బలం మీద ఆధారపడడు. కానీ ఆయనను సేవించే నమ్మకమైన సేవకులను ఆశీర్వదించడం ఆయనకు ఇష్టం. (2 దినవృత్తాంతములు 16:9) రెండవది, యోనాతాను చర్య తీసుకోబోయే ముందు యెహోవా అంగీకారం కోసం రుజువు వెదికాడు. ఈ రోజుల్లో దేవుడు మనం చేసే పనులను అంగీకరిస్తాడా లేదా అని తెలుసుకోవడానికి దేవుని నుండి మనం మానవాతీతమైన గుర్తుల్ని అడగం. దేవుడు ప్రేరేపించిన వాక్యం పూర్తిగా మన చేతుల్లో ఉంది కాబట్టి ఆయన ఇష్టం తెలుసుకోవడానికి కావాల్సినదంతా మన దగ్గర ఉంది. (2 తిమోతి 3:16, 17) మనం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు బైబిల్ని జాగ్రత్తగా వెతుకుతామా? అలా అయితే యెనాతానులా మనం మన ఇష్టం కన్నా దేవుని ఇష్టమే ఎక్కువ ముఖ్యమని చూపిస్తాము.
అలా ఆ ఇద్దరు మనుషులు, అంటే ఒక యోధుడు, అతని ఆయుధాలు మోసే అతను, నిటారుగా ఉన్న కొండవాలు పైకి ఎక్కుతూ సైనిక స్థావరం వైపు వెళ్తున్నారు. వాళ్ల మీద దాడి జరగబోతుందని చివరికి ఫిలిష్తీయులకు అర్థమైంది, వాళ్లు ఆ దండెత్తి వచ్చే వాళ్లతో పోరాడడానికి మనుషుల్ని పంపిస్తారు. ఫిలిష్తీయులు చాలా ఎక్కువమంది ఉన్నారు, అంతేకాదు వాళ్లు ఎత్తులో ఉండడం కూడా వాళ్లకు అనుకూలంగా ఉంది, కాబట్టి వాళ్లు దాడి చేసే ఆ ఇద్దర్ని దెబ్బకి ఓడించి చంపేసేవాళ్లే. కానీ యోనాతాను ఒకరి తర్వాత ఒకరు సైనికుల మీద దాడి చేస్తూ ఉన్నాడు. అతని వెనుక అతని ఆయుధాలు మోసే అతను వాళ్లను చంపుతూ ఉన్నాడు. కొద్ది ప్రాంతంలోనే ఆ ఇద్దరు మనుషులు 20 మంది శత్రు సైనికుల్ని హతం చేశారు. యెహోవా కూడా ఒకటి చేశాడు: “దండులోను పొలములోను జనులందరిలోను మహా భయకంపము కలిగెను. దండు కావలివారును దోపుడు గాండ్రును భీతినొందిరి; నేలయదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి.”—1 సమూయేలు 14:15.
దూరం నుండి, సౌలు అతని మనుషులు ఫిలిష్తీయుల్లో గందరగోళం, భయాందోళన చెలరేగడం చూస్తూ ఉన్నారు, వాళ్లు ఒకరి మీద ఒకరు తిరగబడి చంపుకోవడం కూడా మొదలుపెట్టారు! (1 సమూయేలు 14:16, 20) ఇశ్రాయేలీయులు ధైర్యం తెచ్చుకుని బహుశా చనిపోయిన ఫిలిష్తీయుల నుండి ఆయుధాలు తీసుకుంటూ దాడి చేశారు. యెహోవా ఆ రోజు తన ప్రజలకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆయన అప్పటి ఉత్తేజకరమైన సమయాల నుండి ఇప్పటి వరకు మారలేదు. ఆయన మీద నేడు మనం యోనాతానులాగా, పేరు కూడా నమోదు కాని అతని ఆయుధాలు మోసే అతనిలాగా విశ్వాసం చూపిస్తే, మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి పశ్చాత్తాప పడే పరిస్థితి రాదు.—మలాకీ 3:6; రోమీయులు 10:11.
“దేవుని సహాయముచేత ఈ దినమున . . . జయము నొందించెను”
యోనాతానుకు మేలు చేసిన విధంగా సౌలుకు ఆ విజయం మేలు చేయలేదు. సౌలు కొన్ని పెద్ద తప్పులు చేశాడు. ఆయన యెహోవా నియమించిన ప్రవక్త, లేవీయుడు అయిన సమూయేలు అర్పించాల్సిన బలిని తను అర్పించడం ద్వారా ఆ ప్రవక్తకు అవిధేయత చూపించాడు. సమూయేలు వచ్చాక సౌలుతో, అలాంటి అవిధేయత వల్ల సౌలు రాజ్యం నిలవదని చెప్పాడు. తర్వాత సౌలు తన మనుషుల్ని యుద్ధంలోకి పంపినప్పుడు, మొదట ఆయన వాళ్లతో అర్థం లేని ఒక ఒట్టు వేయిస్తాడు: “నేను నా శత్రువులమీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రము కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును.”—1 సమూయేలు 13:10-14; 14:24.
సౌలు మాటలు అతనిలో వచ్చిన చెడు మార్పును చూపిస్తున్నాయి. వినయంగా, ఆధ్యాత్మికంగా ఉన్న అతను అధికార దాహంతో ఉన్న అహంకారిగా మారిపోతున్నాడు? ఎంతో ధైర్యంగా కష్టపడుతున్న ఆ సైనికులపైన అలాంటి సమంజసం కాని ఆంక్ష పెట్టమని యెహోవా అస్సలు నిర్దేశించలేదు. మరి సౌలు అన్నట్లు “నేను నా శత్రువులమీద పగ తీర్చుకొనక మునుపు” అనే మాటల సంగతేంటి? సౌలు ఈ యుద్ధం తన కోసం చేస్తున్నాడని అనుకుంటున్నాడా? యెహోవా న్యాయం అన్నిటికన్నా ముఖ్యం కాని పగ తీర్చుకోవాలని, కీర్తి తెచ్చుకోవాలని లేదా విజయం పొందాలని సౌలుకున్న వాంఛ కాదు అనే విషయాన్ని అతను మర్చిపోతున్నాడా?
యోనాతానుకు తన తండ్రి వేయించిన తెలివితక్కువ ఒట్టు గురించి ఏమీ తెలీదు. భీకరంగా జరిగిన ఆ యుద్ధంలో అలసిపోయి అతను తన చేతిలో ఉన్న కర్రను తేనెపట్టులో ముంచి కొంచెం తేనెను రుచి చూస్తాడు. వెంటనే అతనికి శక్తి తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది. అప్పుడు ఎవరూ ఏమీ తినకూడదని యోనాతాను తండ్రి పెట్టిన నిషేధం గురించి అతని మనుషుల్లో ఒకరు చెప్తాడు. దానికి యోనాతాను ఇలా అంటాడు: “నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయెను; నేను ఈ తేనె కొంచెము పుచ్చుకొన్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి. జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్లవలన బాగుగా భోజనము చేసినయెడల వారు ఫిలిష్తీయులను మరి అధికముగా హతము చేసియుందురనెను.” (1 సమూయేలు 14:25-30) అతను చెప్పింది నిజమే. యోనాతాను నమ్మకమైన కొడుకు, అతని నమ్మకత్వం గుడ్డిది కాదు. గుడ్డిగా ఏమీ ఆలోచించకుండా ఆయన తన తండ్రి చెప్పిన, చేసిన ప్రతీదాన్ని ఒప్పుకోలేదు. అలాంటి సరైన దృక్కోణం వల్లే అతను ఇతరుల గౌరవాన్ని సంపాదించుకున్నాడు.
తాను పెట్టిన నిషేధాన్ని యోనాతాను ఉల్లంఘించాడని సౌలుకు తెలిశాక, అప్పటికీ ఆయన, తను ఇచ్చిన ఆజ్ఞలో ఉన్న మూర్ఖత్వాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. తెలుసుకోకపోగా ఆయన ఇంకా తన కొడుకుకు మరణశిక్ష విధించాలనే పట్టుబట్టాడు. యోనాతాను ఏమీ వాదించలేదు, కరుణించమని వేడుకోలేదు. ఆయన ఇచ్చిన సమాధానం తిరుగులేనిది. ఆయన తన గురించి ఏమీ ఆలోచించుకోకుండా, ఇదిగో! నేను చనిపోవడానికి సిద్ధం అన్నాడు. కానీ అప్పుడు ఇశ్రాయేలీయులు మాట్లాడి: “ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికినికూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను; యెహోవా జీవముతోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని” అన్నారు. ఫలితం? సౌలు వాళ్ల మాట విన్నాడు. ఆ వృత్తాంతం ఇలా చెప్తుంది: “యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి.”—1 సమూయేలు 14:43-45.
అతని ధైర్యం, కష్టపడే గుణం, తన గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించే లక్షణం వల్ల యోనాతాను మంచి పేరు సంపాదించుకున్నాడు. అతను ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ మంచి పేరే అతనికి సహాయం చేసింది. మనం కూడా ప్రతీరోజు ఎలాంటి పేరు లేదా గౌరవం సంపాదించుకుంటున్నామో ఆలోచించుకోవాలి. బైబిలు మంచి పేరు చాలా విలువైనదని చెప్తుంది. (ప్రసంగి 7:1) మనం యోనాతానులా, యెహోవా యెదుట మంచి పేరు సంపాదించుకోవడానికి కృషి చేస్తే, మన మంచిపేరే మనకు పెద్ద ఆస్తి అవుతుంది.
కమ్ముతున్న చీకటి
సౌలు తప్పులు చేస్తున్నప్పటికీ, యోనాతాను సంవత్సరాలుగా తన తండ్రి వైపున ఉండి నమ్మకంగా పోరాడుతూనే ఉన్నాడు. అతని తండ్రి అవిధేయత, గర్వం చూపించే మనసును పెంచుకోవడం చూసి యోనాతాను ఎంత దిగులుపడి ఉంటాడో మనం కేవలం ఊహించగలం.
ఆ సమస్య హద్దులు దాటింది. యెహోవా సౌలును అమాలేకీయుల మీద యుద్ధం చేయమని చెప్పాడు. వాళ్లు ఎంత దుష్టులంటే యెహోవా ఆ పూర్తి జనాంగం నాశనం అవ్వడాన్ని మోషే కాలంలోనే ప్రవచించాడు. (నిర్గమకాండము 17:14) సౌలు వాళ్ల పశువులన్నిటినీ నాశనం చేయాలని, వాళ్ల రాజైన అగగుకు మరణశిక్ష విధించాలని ఆదేశించబడ్డాడు. సౌలు ఆ యుద్ధం గెలిచాడు, ఖచ్చితంగా యోనాతాను ఎప్పటిలానే తన తండ్రి ఆజ్ఞ మేరకు ధైర్యంగా పోరాడడం కూడా గెలవడానికి సహాయం చేసింది. కానీ సౌలు కావాలని, స్పష్టంగా యెహోవాకు అవిధేయత చూపించాడు. అగగుని బ్రతకనిచ్చాడు, దోపుడు సొమ్మును పశువులను ఏమీ కానివ్వలేదు. యెహోవా సౌలు మీద చేసిన చివరి తీర్పును ప్రవక్తయైన సమూయేలు ప్రకటించాడు: యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండ ఆయన నిన్ను విసర్జించెను.—1 సమూయేలు 15:2, 3, 9, 10, 23.
అలా జరిగిన కొంతకాలానికే యెహోవా తన పవిత్రశక్తిని సౌలు నుండి తీసేశాడు. యెహోవా ప్రేమపూర్వక సహాయం లేకపోవడం వల్ల, సౌలు మనసు స్థిరంగా ఉండకుండా ఉన్నట్టుండి మారిపోతూ ఉండేది, విపరీతమైన కోపం, భయాలు కలిగేవి. దేవుడు తన పవిత్రశక్తికి బదులు ఒక దుష్టశక్తిని వచ్చేలా చేసినట్లు అయింది. (1 సమూయేలు 16:14; 18:10-12) ఒకప్పుడు ఎంతో మంచివాడైన తన తండ్రి ఘోరంగా మారిపోవడం చూసి యోనాతానుకు ఎంత బాధ కలిగి ఉంటుందో. ఏదేమైనా యోనాతాను యెహోవాకు చేసే నమ్మకమైన సేవనుండి కొంచెం కూడా పక్కకు తొలగలేదు. ఆయన శాయశక్తులా తన తండ్రికి మద్దతుగా ఉన్నాడు, కొన్నిసార్లు ఆయనతో నిర్మొహమాటంగా మాట్లాడాడు కూడా, కానీ ఆయన తన దృష్టిని మార్పులేని దేవుడు, తండ్రియైన యెహోవా మీద ఉంచాడు.—1 సమూయేలు 19:4, 5.
మీరెప్పుడైనా మీరు ఎంతో ప్రేమించే వాళ్లు, బహుశా ఒక కుటుంబ సభ్యుడు చెడుగా మారిపోవడాన్ని చూశారా? అది ఎంతో బాధ కలిగించే అనుభవం. యోనాతాను ఉదాహరణ మనకు కీర్తనకర్త రాసిన ఈ మాటల్ని గుర్తు చేస్తుంది: “నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.” (కీర్తన 27:10) యెహోవా నమ్మకంగా ఉంటాడు. అపరిపూర్ణ మనుషులు మిమ్మల్ని నిరుత్సాహ పర్చడానికి లేదా మిమ్మల్ని కృంగదీయడానికి ఏమి చేసినా ఆయన మిమ్మల్ని దగ్గరికి తీసుకుని, ఊహించలేనంత మంచి తండ్రిగా ఉంటాడు.
రాజరికాన్ని సౌలు నుండి యెహోవా తీసేయాలని అనుకుంటున్న విషయాన్ని యోనాతాను తెలుసుకుని ఉంటాడు. యోనాతాను ఎలా స్పందించాడు? ఆయన ఎలాంటి పరిపాలకుడు అవుతాడో అని ఆలోచించి ఉంటాడా? తన తండ్రి చేసిన తప్పుల్ని సరిచేసి ఒక నమ్మకమైన, విధేయుడైన రాజుగా ఉండి చూపించాలనే ఆశలు పెట్టుకున్నాడా? అతని మనసులో ఉన్న ఆలోచనలు మనకు తెలీదు. కానీ అలాంటి ఆశలేమీ నెరవేరవని మాత్రం మనకు తెలుసు. అంటే ఆ నమ్మకస్థుడైన మనిషిని యెహోవా వదిలేశాడని దాని అర్థమా? లేదు, దానికి వేరుగా బైబిలు అంతటిలో నమ్మకమైన స్నేహానికి గొప్ప ఉదాహరణగా ఉండడానికి యోనాతానును ఉపయోగించుకున్నాడు! ఆ స్నేహం మనం యోనాతాను గురించి చూడబోయే తర్వాత ఆర్టికల్లో స్పష్టంగా వివరించబడుతుంది.