కంటెంట్‌కు వెళ్లు

నాకు చనిపోవాలని ఉంది—ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినప్పుడు బైబిలు నాకు సహాయం చేయగలదా?

నాకు చనిపోవాలని ఉంది—ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినప్పుడు బైబిలు నాకు సహాయం చేయగలదా?

బైబిలు ఇచ్చే జవాబు

 అవును! “కృంగిపోయిన వాళ్లకు ఊరటనిచ్చే దేవుడు” బైబిల్ని రాయించాడు. (2 కొరింథీయులు 7:6) బైబిలు మానసిక ఆరోగ్యం గురించిన పాఠ్య పుస్తకం కాకపోయినా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న చాలామందికి అది సహాయం చేసింది. అందులో ఉన్న మంచి సలహాలు మీకూ సహాయం చేస్తాయి.

 బైబిల్లో ఎలాంటి మంచి సలహాలు ఉన్నాయి?

  • మీకు ఎలా అనిపిస్తుందో వేరేవాళ్లకు చెప్పండి.

     బైబిలు ఏం చెప్తుందంటే: “నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, కష్టకాలంలో అతను సహోదరుడిలా ఉంటాడు.”—సామెతలు 17:17, NW.

     దానర్థం: మనసు బాధగా ఉన్నప్పుడు మనకు ఇతరుల సహాయం అవసరం.

     మీకు ఎలా అనిపిస్తుందో ఎవ్వరికీ చెప్పకుండా ఉంటే అది ఒక భరించలేని భారంలా తయారౌతుంది. మీ మనసులో ఉన్నది ఎవరికైనా చెప్తే మీ బాధ తగ్గవచ్చు, మీరు మరింత సానుకూలంగా ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది.

     ఇలా చేసి చూడండి: మీ కుటుంబ సభ్యులతో గానీ, నమ్మకస్థుడైన ఒక ఫ్రెండ్‌తో గానీ ఈరోజే మాట్లాడండి. a అంతేకాదు, మీకెలా అనిపిస్తుందో ఒక చోట రాసుకోవచ్చు.

  • డాక్టరు దగ్గరికి వెళ్లండి.

     బైబిలు ఏం చెప్తుందంటే: “ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు వైద్యుడు అవసరంలేదు, రోగులకే అవసరం.”—మత్తయి 9:12.

     దానర్థం: మనకు ఒంట్లో బాలేనప్పుడు డాక్టరు దగ్గరికి వెళ్లాలి.

     సాధారణంగా మానసిక లేదా భావోద్వేగ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయి. అది కూడా ఒక అనారోగ్యం లాంటిదే, కాబట్టి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మానసిక, భావోద్వేగ సమస్యలకు చికిత్స ఉంది.

     ఇలా చేసి చూడండి: వీలైనంత త్వరగా మంచి డాక్టరును కలవండి.

  • దేవుడు పట్టించుకుంటాడని గుర్తుంచుకోండి.

     బైబిలు ఏం చెప్తుందంటే: “తక్కువ విలువగల రెండు నాణేలకు ఐదు పిచ్చుకలు వస్తాయి కదా? అయితే వాటిలో ఒక్కదాన్ని కూడా దేవుడు మర్చిపోడు. ... భయపడకండి, మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైనవాళ్లు.”—లూకా 12:6, 7.

     దానర్థం: దేవుని దృష్టిలో మీరు చాలా విలువైనవాళ్లు.

     మీకు ఎవ్వరూ లేరని అనిపించవచ్చు, కానీ దేవుడు మీరు అనుభవించే బాధల్ని అర్థం చేసుకుంటాడు. మీకు బ్రతకాలని అస్సలు అనిపించకపోయినా ఆయన మిమ్మల్ని పట్టించుకుంటాడు. “దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు” అని కీర్తన 51:17 చెప్తుంది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరు బ్రతకాలనే ఆయన కోరుకుంటున్నాడు.

     ఇలా చేసి చూడండి: దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చూపించే రుజువులు బైబిల్లో ఉన్నాయి, వాటిని పరిశీలించండి. ఉదాహరణకు, జూన్‌ 2016 కావలికోటలోని 3-5 పేజీల్లో ఉన్న “యెహోవాకు మీపై శ్రద్ధ ఉంది” అనే ఆర్టికల్‌, యెహోవా దేవునికి సన్నిహితమవండి అనే పుస్తకంలో 24వ అధ్యాయం చూడండి.

  • దేవునికి ప్రార్థించండి.

     బైబిలు ఏం చెప్తుందంటే: “మీరంటే [దేవునికి] పట్టింపు ఉంది కాబట్టి మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి.”—1 పేతురు 5:7.

     దానర్థం: మీకు నిజంగా ఎలా అనిపిస్తుందో, దేని గురించి ఆందోళనపడుతున్నారో మీరు నిజాయితీగా మనసు విప్పి తనకు చెప్పాలని దేవుడు కోరుతున్నాడు.

     దేవుడు మీకు మనశ్శాంతిని, మీ పరిస్థితిని తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు. (ఫిలిప్పీయులు 4:6, 7, 13) అలా తనకు నిజాయితీగా ప్రార్థించేవాళ్లను ఆయన ఆదుకుంటాడు.—కీర్తన 55:22.

     ఇలా చేసి చూడండి: ఈరోజే దేవునికి ప్రార్థించండి. యెహోవా అనే ఆయన పేరును ఉపయోగించి, మీ మనసులో ఉన్న బాధనంతా చెప్పండి. (కీర్తన 83:18) పరిస్థితిని తట్టుకునే శక్తిని ఇవ్వమని ఆయనను వేడుకోండి.

  • రాబోయే మంచి రోజుల గురించి బైబిలు చెప్తున్నవాటి మీద మనసుపెట్టండి.

     బైబిలు ఏం చెప్తుందంటే: “నిశ్చయమైన, స్థిరమైన ఈ నిరీక్షణ మన ప్రాణాలకు లంగరులా ఉంది.”—హెబ్రీయులు 6:19.

     దానర్థం: తుఫానులో చిక్కుకుపోయిన ఓడ అలల తాకిడికి కిందకి పైకి ఎలాగైతే కదులుతుందో, అలాగే మీకు కొద్దిసేపు సంతోషంగా, అంతలోనే బాధగా అనిపిస్తుండవచ్చు. అయితే బైబిల్లో ఉన్న నిరీక్షణ అంటే భవిష్యత్తు గురించి బైబిల్లో ఉన్న వాగ్దానాల గురించి ఆలోచిస్తే మీ మనసు కుదుటపడుతుంది.

      బైబిల్లో ఉన్న ఆ వాగ్దానాలు కలలు కావు. ఎందుకంటే మనకు బాధ కలిగించే వాటిని తీసేస్తానని దేవుడు మాటిస్తున్నాడు.—ప్రకటన 21:4.

     ఇలా చేసి చూడండి: దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషుర్‌లో 5వ పాఠం చదివి, బైబిల్లో ఉన్న వాగ్దానాల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోండి.

  • మీకు ఇష్టమైనది ఏదైనా చేయండి.

     బైబిలు ఏం చెప్తుందంటే: “సంతోషం ఒక మంచి మందులాంటిది.”—సామెతలు 17:22, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

     దానర్థం: మనకు సంతోషాన్ని ఇచ్చేవాటిని చేసినప్పుడు మనం భావోద్వేగంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం.

     ఇలా చేసి చూడండి: మీరు మామూలుగా బాగా ఇష్టపడే పనుల్ని చేయండి. ఉదాహరణకు, ఉల్లాసపర్చే సంగీతాన్ని వినండి, మంచి పుస్తకాల్ని చదవండి, ఏదైనా కొత్త హాబీ మొదలుపెట్టండి. వేరేవాళ్లకు సహాయం చేయండి. అది చిన్న సహాయం అయినాసరే మీరు సంతోషంగా ఉంటారు.—అపొస్తలుల కార్యాలు 20:35.

  • మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

     బైబిలు ఏం చెప్తుందంటే: ‘శారీరక వ్యాయామం ప్రయోజనకరం.’—1 తిమోతి 4:8.

     దానర్థం: ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల, కంటి నిండా నిద్రపోవడం వల్ల, పౌష్టిక ఆహారం తినడం వల్ల మేలు జరుగుతుంది.

     ఇలా చేసి చూడండి: కనీసం 15 నిమిషాలైనా వేగంగా నడవండి.

  • ఇప్పుడు అనిపించినట్లు రేపు అనిపించకపోవచ్చని, మన పరిస్థితులూ మారవచ్చని గుర్తుంచుకోండి.

     బైబిలు ఏం చెప్తుందంటే: “రేపు మీకు ఏమౌతుందో మీకు తెలియదు.”—యాకోబు 4:14.

     దానర్థం: మీకు ఎంతో పెద్ద సమస్య ఉండవచ్చు, దానికి పరిష్కారమే కనిపించకపోవచ్చు. కానీ, అలాంటి సమస్యలు రేపు ఉండకపోవచ్చు.

     ఇప్పుడు మీ పరిస్థితి ఎంతో ఘోరంగా ఉన్నట్లు మీకు అనిపించినా రేపోమాపో అది మారవచ్చు. కాబట్టి మీ బాధను తట్టుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించండి. (2 కొరింథీయులు 4:8) కొన్ని రోజులు అయ్యాక, మీ పరిస్థితులు మారవచ్చు, కానీ ఒకసారి ఆత్మహత్య చేసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎప్పటికీ మార్చుకోలేరు.

     ఇలా చేసి చూడండి: బైబిల్లో కొంతమందికి ఎంత బాధేసిందంటే వాళ్లు చనిపోవాలనుకున్నారు. కానీ, ఊహించని విధంగా వాళ్ల పరిస్థితులు మారిపోయాయి. అలాంటివాళ్ల గురించి బైబిల్లో చదవండి. కొన్ని ఉదాహరణలు చూద్దాం.

 బైబిల్లో దేవుని సేవకులు ఎవరైనా చనిపోవాలనుకున్నారా?

 అవును. కొంతమంది చనిపోవాలి అనుకున్నట్లు బైబిలు చెప్తుంది. దేవుడు వాళ్లను తిట్టలేదుగానీ వాళ్లకు సహాయం చేశాడు. మీ విషయంలో కూడా ఆయన అలాగే చేస్తాడు.

ఏలీయా

  •  ఆయన ఎవరు? ఏలీయా ఎంతో ధైర్యంగల దేవుని సేవకుడు. కానీ ఆయన కూడా కొన్నిసార్లు బాగా కృంగిపోయాడు. “ఏలీయాకు కూడా మనలాంటి భావాలే ఉండేవి” అని యాకోబు 5:17 చెప్తుంది.

  •  ఆయన ఎందుకు చనిపోవాలి అనుకున్నాడు? ఒక సమయంలో ఏలీయా తను ఒక్కడినే ఉన్నానని, తను ఎందుకూ పనికిరానివాణ్ణని అనుకున్నాడు. ఆయనకు చాలా భయమేసింది. అందుకే ఆయన ‘యెహోవా, నా ప్రాణం తీసేయి’ అని దేవుణ్ణి వేడుకున్నాడు.—1 రాజులు 19:4.

  •  ఆయనకు ఏది సహాయం చేసింది? ఏలీయా తన మనసులో ఉన్నదంతా దేవునికి చెప్పేశాడు. అప్పుడు దేవుడు ఆయనను ఎలా ఓదార్చాడు? దేవుడు ఏలీయా మీద శ్రద్ధ చూపించాడు, అలాగే తన శక్తిని ఏలీయాకు చూపించాడు. ఏలీయా అవసరం ఇంకా ఉందని కూడా దేవుడు అభయాన్ని ఇచ్చాడు. అంతేకాదు ఆయన్ని బాగా చూసుకునే ఒక చక్కని సహాయకుణ్ణి ఇచ్చాడు.

  •  ఏలీయా గురించి తెలుసుకోండి: 1 రాజులు 19:2-18.

యోబు

  •  ఆయన ఎవరు? యోబు చాలా ధనవంతుడు, ఆయనకు ఒక పెద్ద కుటుంబం ఉంది. ఆయన ఎప్పుడూ నిజమైన దేవుణ్ణి ఆరాధించాడు.

  •  ఆయన ఎందుకు చనిపోవాలి అనుకున్నాడు? యోబు జీవితం ఉన్నట్టుండి చాలా ఘోరంగా తయారైంది. తన ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. ఒక దుర్ఘటనలో ఆయన పిల్లలందరూ చనిపోయారు. ఎంతో వేదన కలిగించే ఒక రోగం వచ్చింది. దానికి తోడు కొంతమంది ఆయన మీద ఏమాత్రం జాలి చూపించకుండా నిందించారు. తన సమస్యలంతటికి కారణం ఆయనే అని తప్పుగా మాట్లాడారు. అప్పుడు యోబు ఇలా అన్నాడు: “నా జీవితం మీద నాకు విరక్తి కలిగింది; ఇక బ్రతకాలని లేదు.”—యోబు 7:16, NW.

  •  ఆయనకు ఏది సహాయం చేసింది? యోబు దేవునికి ప్రార్థించాడు, ఇతరులతో మాట్లాడాడు. (యోబు 10:1-3) మంచి స్నేహితుడైన ఎలీహు యోబును ప్రోత్సహించాడు. తన పరిస్థితి గురించి సరైన విధంగా ఆలోచించడానికి యోబుకు సహాయం చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా యోబు దేవుడు ఇచ్చే సలహాలను, సహాయాన్ని తీసుకున్నాడు.

  •  యోబు గురించి తెలుసుకోండి: యోబు 1:1-3, 13-22; 2:7; 3:1-13; 36:1-7; 38:1-3; 42:1, 2, 10-13.

మోషే

  •  ఆయన ఎవరు? ప్రాచీన కాలంలోని ఇశ్రాయేలు దేశానికి మోషే నాయకుడు, ఆయన దేవుని నమ్మకమైన సేవకుడు.

  •   ఆయన ఎందుకు చనిపోవాలి అనుకున్నాడు? మోషే ఎన్నో పనులు చూసుకునేవాడు. ఆయనను చాలామంది తప్పుపడుతూ ఉండేవాళ్లు, వీటన్నిటి బట్టి ఆయన బాగా అలసిపోయాడు. అందుకే, ఆయన “నన్ను ఇప్పుడే చావనివ్వు” అని దేవుణ్ణి వేడుకున్నాడు.—సంఖ్యాకాండం 11:11, 15, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

  •   ఆయనకు ఏది సహాయం చేసింది? మోషే తన మనసులో ఉన్నదంతా దేవునికి చెప్పేశాడు. తన పని భారం తగ్గించుకోవడానికి దేవుడు మోషేకు సహాయం చేశాడు. ఆ విధంగా, ఆయనపై ఉన్న ఒత్తిడిని తగ్గించాడు.

  •  మోషే గురించి తెలుసుకోండి: సంఖ్యాకాండం 11:4-6, 10-17.

a ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు బాగా పెరిగిపోతున్న సమయంలో మీకు కావాల్సినవాళ్లు అందుబాటులో లేకపోతే మీ ప్రాంతంలోని ఏదైనా సూసైడ్‌ హెల్ప్‌లైన్‌ నంబరుకు లేదా ఎమర్జెన్సీ నంబరుకు ఫోన్‌ చేయండి.