కంటెంట్‌కు వెళ్లు

ఆత్మ అంటే ఏమిటి?

ఆత్మ అంటే ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

 హీబ్రూలో నెఫెష్‌ అనే పదాన్ని, గ్రీకులో సైఖే అనే పదాన్ని బైబిల్లో కొన్నిచోట్ల “ఆత్మ” అని అనువదించారు. ఆ హీబ్రూ పదానికి “శ్వాసించే ప్రాణి” అని, గ్రీకు పదానికి “జీవి” అని అర్థం. a దీన్నిబట్టి, ఆత్మ అంటే ప్రాణి, అంతేగానీ ఆ ప్రాణి లోపలే ఉంటూ, దాని శరీరం చనిపోయిన తర్వాత కూడా బ్రతికి ఉండేది కాదు. మానవ ఆత్మ అంటే పూర్తి వ్యక్తి అని బైబిలు ఎలా చూపిస్తుందో పరిశీలించండి:

దేవుడు ఆదాముకు ఆత్మను ఇవ్వలేదు​—అతను జీవించే ఆత్మ అయ్యాడు.

  •   యెహోవా దేవుడు మొదటి మనిషైన ఆదామును సృష్టించినప్పుడు, “నరుడు జీవాత్మ ఆయెను” అని బైబిలు చెప్తోంది. (ఆదికాండము 2:7) దేవుడు ఆదాముకు ఒక ఆత్మను ఇవ్వలేదు గానీ, ఆదాము జీవించే ఆత్మ లేదా వ్యక్తి అయ్యాడు.

  •   కొన్నిచోట్ల ఆత్మ అని అనువదింపబడిన నెఫెష్‌ లేదా సైఖే అనే పదాలను బైబిలు ఎలా ఉపయోగించిందో చూడండి: అది పని చేస్తుందని, దానికి ఆకలి వేస్తుందని, అది తింటుందని, నియమాలు పాటిస్తుందని, శవాన్ని ముట్టుకుంటుందని బైబిలు చెప్తుంది. (లేవీయకాండము 5:2; 7:20; 23:30, ద్వితీయోపదేశకాండము 12:20, రోమీయులు 13:1, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ [ఇంగ్లీషు]) అవన్నీ మనిషి చేసే పనులు.

ఆత్మకు చావు లేదా?

 ఉంది, ఆత్మ చనిపోతుంది. బైబిల్లోని చాలా లేఖనాలు ఆత్మకు చావు ఉన్నట్లు చూపిస్తున్నాయి. కొన్ని ఉదాహరణలు చూడండి:

  •   “పాపముచేయువాడెవడో వాడే [“పాపము చేయు ఆత్మ,” కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ (ఇంగ్లీషు)] మరణము నొందును.”—యెహెజ్కేలు 18:4, 20.

  •   ప్రాచీన ఇశ్రాయేలులో, పెద్దపెద్ద తప్పులకు శిక్ష ఏమిటంటే ఆ తప్పు చేసిన “ఆత్మను సంహరించాలి.” (నిర్గమకాండము 12:15, 19; లేవీయకాండము 7:20, 21, 27; 19:8, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ [ఇంగ్లీషు]) ఆ వ్యక్తిని “చంపేయాలి.”—నిర్గమకాండము 31:14, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ (ఇంగ్లీషు).

  •   కొన్ని బైబిలు వచనాల్లో, మనిషి శవాన్ని సూచించడానికి “చనిపోయిన ఆత్మ” అనే పదాన్ని ఉపయోగించారు. (లేవీయకాండము 21:11, NW, అధస్సూచి; సంఖ్యాకాండము 6:6, NW, అధస్సూచి) చాలా బైబిలు అనువాదాలు ఆ వచనాల్లో “మృత దేహం,” ‘చనిపోయిన వ్యక్తి’ అనే పదాలు వాడినా, ప్రాచీన హీబ్రూ భాషలో నెఫెష్‌, అంటే “ఆత్మ” అనే పదాన్ని వాడారు.

“ఆత్మ” అనే పదానికి ఒక్కోసారి “ప్రాణం” అనే అర్థం కూడా ఉండవచ్చు

 బైబిలు “ఆత్మ” అనే పదాన్ని “ప్రాణం” అనే పదానికి సమానపదంగా కూడా వాడుతుంది. ఉదాహరణకు, యోబు 33:22 లో హీబ్రూ భాషలో “ఆత్మ” అనే పదం (నెఫెష్‌) ఉంది, ఆ వచనంలో దాన్ని “ప్రాణం” అనే పదానికి సమానపదంగా వాడారు. అలాగే, ఒక వ్యక్తి ఆత్మ లేదా ప్రాణం ప్రమాదానికి గురౌతుందని లేదా పోతుందని బైబిలు చెప్తోంది.—నిర్గమకాండము 4:19; న్యాయాధిపతులు 9:16; ఫిలిప్పీయులు 2:29, 30.

 “ఆత్మ” అనే పదాన్ని ఎలా వాడుతున్నారో తెలుసుకోవడం వల్ల, అది “బయటికి పోతుంది,” “వెళ్లిపోతుంది” అని చెప్పే వచనాలను మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం. (ఆదికాండము 35:18, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ [ఇంగ్లీషు]) ఆ అలంకారిక పదాలకు, ఊపిరి ఆగిపోతుందని అర్థం. కొన్ని అనువాదాలు ఆదికాండము 35:18లోని ఆ మాటను, ఆమె తన ‘చివరి ఊపిరి విడిచింది’ అని అనువదించాయి.—పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము.

ఆత్మకు చావులేదనే నమ్మకం ఎక్కడ నుండి వచ్చింది?

 ఆత్మకు చావు లేదని నమ్మే క్రైస్తవ మత సంస్థలు ఈ బోధను బైబిలు నుండి పొందలేదు గానీ, ప్రాచీన గ్రీకు తత్వజ్ఞానం నుండి పొందాయి. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా చెప్తుంది: “బైబిల్లోని ఆత్మ గురించిన వచనాలన్నీ ఊపిరి అనే అంశంతో ముడిపడివున్నాయి. కనిపించని ఆత్మ, కనిపించే శరీరం అనే తేడాలను అవి సృష్టించడం లేదు. క్రైస్తవులు నమ్మే ‘శరీరం వేరు, ఆత్మ వేరు’ అనే బోధ ప్రాచీన గ్రీకు ప్రజల దగ్గర పుట్టింది.”

 దేవుని బోధల్ని, మనుషుల తత్వబోధలతో కలిపితే ఆయన సహించడు. ఆత్మకు చావు ఉండదనే నమ్మకం అలాంటిదే కదా. నిజానికి, బైబిలు ఇలా హెచ్చరిస్తోంది: “మనుష్యుల పారంపర్యాచారమును, ... అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.”—కొలొస్సయులు 2:8.

a ద న్యూ బ్రౌన్‌, డ్రైవర్‌, బ్రిగ్గ్స్‌ హీబ్రూ అండ్‌ ఇంగ్లీష్‌ లెక్సికాన్‌ ఆఫ్‌ ద ఓల్డ్‌ టెస్ట్మెంట్‌లో 659వ పేజీ, లెక్సికాన్‌ ఇన్‌ వెటెరిస్‌ టెస్ట్మెంటి లిబ్రోస్‌లో 627వ పేజీ చూడండి. చాలా బైబిలు అనువాదాలు నెఫెష్‌, సైఖే అనే పదాలకు సందర్భాన్ని బట్టి వేర్వేరు పదాలను అంటే “ఆత్మ,” “జీవం,” “వ్యక్తి,” “ప్రాణి,” “శరీరం” వంటి పదాలను ఉపయోగించాయి.