యేసు చరిత్ర ఎప్పుడు రాశారు?
బైబిలు ఇచ్చే జవాబు
యేసుక్రీస్తు జీవితంలో జరిగిన సంఘటనల గురించి అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు: ‘ఇది చూసినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు; అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును.’—యోహాను 19:35.
మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే బైబిలు రచయితలు రాసిన వృత్తాంతాల్ని నమ్మడానికి ఒక కారణం ఏంటంటే, వాళ్లు రాసిన సంఘటనల్ని కళ్లారా చూసినవాళ్లు అవి రాసే సమయానికి బ్రతికే ఉన్నారు. మత్తయి సువార్తను దాదాపు సా.శ. 41లో అంటే యేసు చనిపోయిన ఎనిమిదేళ్లకే రాశారని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. చాలామంది విద్వాంసులు అవి కాస్త తర్వాతి కాలంలో రాయబడ్డాయని చెప్తారు. ఏదేమైనా, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని పుస్తకాలను సా.శ. మొదటి శతాబ్దంలోనే రాశారని చాలామంది ఒప్పుకుంటారు.
యేసు భూమ్మీద బ్రతికి ఉండడం, చనిపోవడం, తిరిగి లేవడం ప్రత్యక్షంగా చూసినవాళ్లు ఆ సువార్త వృత్తాంతాలను చదివినప్పుడు, ఒకవేళ వాటిలో ఏమైనా తప్పులుంటే వాళ్లు బట్టబయలు చేసేవాళ్లు. ప్రొఫెసర్ ఎఫ్. ఎఫ్. బ్రూస్ ఇలా చెబుతున్నాడు: “అపొస్తలులు ప్రకటిస్తున్నప్పుడు తమ శ్రోతలకు తెలిసిన విషయాలనే చెప్పేవారు. కాబట్టి వాళ్లు ధైర్యంగా మాట్లాడారు; వాళ్లు ‘వీటికి మేము సాక్షులము,’ అని మాత్రమే కాదు అవి ‘మీకు కూడా తెలుసు’ అని చెప్పేవారు (అపొస్తలుల కార్యములు 2:22).”