సృష్టిలో అద్భుతాలు
పండ్ల మీద వాలే చిన్న ఈగ గాలిలో చేసే విన్యాసాలు
ఈగలను కొట్టడానికి ఎవరైనా ప్రయత్నించి ఉంటే అది ఎంత కష్టమో వాళ్లకు తెలుసు. మెరుపు వేగంతో కదులుతూ ఈ కీటకాలు వాటిని పట్టుకోవడానికి చేసే ఎన్నో ప్రయత్నాలను తప్పించుకుంటాయి.
ఒక రకమైన ఈగ అంటే పండ్ల మీద వాలే చిన్న ఈగ (fruit fly), ఒక్క క్షణం కన్నా తక్కువ సమయంలోనే యుద్ధాలు చేసే జెట్ విమానంలా మలుపులు తీసుకోగలదని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. పుట్టుకతోనే, “అవి మంచి నేర్పరిలా ఎగరగలవు, అప్పుడే పుట్టిన ఒక శిశువుని యుద్ధ విమానంలో పైలట్ సీట్లో కూర్చోపెట్టినప్పుడు ఆ శిశువుకు ఏమి చేయాలో అన్ని తెలిసినట్లు అది ఉంటుంది” అని ప్రొఫెసర్ మైకెల్ డికిన్సన్ చెప్పారు.
పరిశోధకులు పండ్ల మీద వాలే చిన్న ఈగలు ఎగురుతున్నప్పుడు వీడియో తీసి, అవి వాటి రెక్కలను సెకనుకు 200 సార్లు ఆడిస్తాయని తెలుసుకున్నారు. కానీ, అవి ఒక్కసారి రెక్కలను ఆడిస్తే చాలు, ప్రమాదాన్ని తప్పించుకునేలా దిశను మార్చుకోగలవు.
అవి ప్రతిస్పందించే వేగం విషయం ఏంటి? మనుషులు కంటి రెప్పను ఆడించే దానికన్నా 50 రెట్లు ఎక్కువ వేగంతో అవి ప్రమాదానికి ప్రతిస్పందిస్తాయని పరిశోధకులు తెలుసుకున్నారు. “ఈ ఈగ చాలా సునిశితంగా అంచనాలు వేసుకుని, చాలా తక్కువ సమయంలో, ప్రమాదం ఎక్కడ నుండి వస్తుంది, తప్పించుకోవడానికి ఎటువైపు పారిపోవడం అవసరమో చూసుకుంటుంది” అని డికిన్సన్ వివరిస్తున్నారు.
పండ్ల మీద వాలే ఈ అతి చిన్న ఈగ మెదడు ఇలాంటి అద్భుతాలు చేయడం వెనుక ఉన్న రహస్యం ఏంటో పరిశోధకులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
మీరేమంటారు? పండ్ల మీద వాలే ఈ చిన్న ఈగకు ఎగిరే సామర్థ్యం దానికదే వచ్చిందా? లేదా ఎవరైనా దాన్ని అలా తయారు చేశారా?