ఆఫ్రికాలోని చూపులేనివాళ్లకు సహాయం
కొన్నిదేశాల్లో చూపులేనివాళ్లకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అన్ని అవకాశాలు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు సమాజం వాళ్లను దూరంగా ఉంచుతుంది. దానివల్ల వాళ్లకు కావాల్సిన సహాయం దొరకడం లేదు. ఉదాహరణకు, బజారుకు వెళ్లి ఆహారం కొనుక్కోవడం, బస్సు ఎక్కడం, డబ్బులు ఇవ్వడం-తీసుకోవడం వంటివి మామూలు వాళ్లకు అంత కష్టంగా అనిపించవు. కానీ అలాంటి పనులు చూపులేనివాళ్లకు చాలా కష్టంగా ఉంటాయి. చదవడం కూడా వాళ్లకు ఇబ్బందిగా ఉండవచ్చు. వాళ్లలో అందరూ బ్రెయిలీని చదవలేరు. ఒకవేళ చదివినా, అలాంటి పుస్తకాలు తమ భాషలో దొరకకపోవచ్చు.
100 ఏళ్లకు పైగా యెహోవాసాక్షులు చూపులేనివాళ్ల కోసం బైబిలు పుస్తకాలను తయారుచేస్తున్నారు. మలావీలో చిచెవా భాష మాట్లాడతారు. ఆ భాష బ్రెయిలీ పుస్తకాలు తయారుచేయడానికి కావాల్సిన ముద్రించే, బైండింగ్ చేసే యంత్రాలను సాక్షులు ఈ మధ్యే నెదర్లాండ్స్ నుండి మలావీకి తీసుకొచ్చారు.
బ్రెయిలీ పుస్తకాలను తయారుచేయడంలో అనుభవమున్న లియో అనే ఆయన, యెహోవాసాక్షుల బ్రెజిల్ బ్రాంచి కార్యాలయం నుండి మలావీకి వెళ్లాడు. ఆ యంత్రాల పనితీరును, సాక్షులు తయారుచేసిన బ్రెయిలీ ట్రాన్‌స్క్రిప్షన్ కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను నేర్చుకోవడానికి ఆయన ఐదుమంది ఉన్న ఒక గుంపుకు సహాయం చేశాడు. ఈ ప్రోగ్రామ్ సమాచారాన్ని చిచెవా బ్రెయిలీలోకి మారుస్తుంది. అందుకోసం వాళ్లు ముందుగా చిచెవా అక్షరాలు, బ్రెయిలీ అక్షరాలు ఉన్న ఒక కన్వర్షన్ టేబుల్ని తయారుచేయాలి. అప్పుడు ఈ ప్రోగ్రామ్, సమాచారాన్ని బ్రెయిలీలోకి మారుస్తుంది. అలాగే చూపులేనివాళ్లు సులభంగా చదవగలిగేలా పుస్తకాన్ని ఫార్మాట్ చేస్తుంది. తమ భాషలోని బ్రెయిలీ పుస్తకాల గురించి మలావీలో నివసించే కొందరు ఏమన్నారో పరిశీలించండి.
మున్యారాద్‌జీ అనే చూపులేని యువతి తనే ఒక రేడియో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అది ఆమెకు పార్ట్‌టైమ్ ఉద్యోగం. ఇతరులకు బైబిలు గురించి నేర్పించడానికి కూడా ఆమె ప్రతీనెల 70 గంటలు వెచ్చిస్తుంది. ఆమె ఇలా చెబుతుంది: “గతంలో నాకు ఇంగ్లీషు బ్రెయిలీ పుస్తకాలు వచ్చేవి. కానీ ఇప్పుడు వాటిని నా మాతృభాషలో చదువుతుంటే వాటిలోని విషయాలు నా హృదయాన్ని తాకుతున్నాయి. మా భాషలో బ్రెయిలీ పుస్తకాలను తయారుచేయడానికి తోటి సాక్షులు ఎంతో కష్టపడ్డారు, ఎంతో డబ్బు వెచ్చించారు. అందుకు వాళ్లకు కృతజ్ఞతలు. వాళ్లు మా గురించి ఆలోచిస్తున్నారని, మమ్మల్ని ప్రాముఖ్యమైనవాళ్లుగా చూస్తున్నారని నాకు అర్థమైంది.”
ఫ్రాన్సిస్ అనే సాక్షి ఉత్తర మలావీలో ఉంటాడు. ఆయనకు చూపులేదు కాబట్టి చదివి వినిపించమని ఇతరులను అడిగేవాడు. అయితే, చిచెవాలో బ్రెయిలీ పుస్తకాన్ని మొదటిసారి పొందినప్పుడు ఆయన ఇలా అన్నాడు: “ఇది కలా, నిజమా? చాలా అద్భుతంగా ఉంది!”
లోయిస్‌కి కూడా చూపులేదు. ఆమె పుర్తికాల సేవచేస్తుంది. మార్పులు చేసుకొని మెరుగైన జీవితాన్ని సాగించేలా 52 మందికి సహాయం చేసింది. ఎలా? తన విద్యార్థులు, మామూలు పుస్తకాలను ఉపయోగిస్తుంటే ఆమె బ్రెయిలీ పుస్తకాలను ఉపయోగించి బోధించేది. అవన్నీ యెహోవాసాక్షులు తయారుచేసినవే.
ముందుచూసిన లియో ఇలా అన్నాడు: “ప్రజలకు బ్రెయిలీ పుస్తకాలను అందించి, అవి తమ భాషలోనే ఉన్నాయని అర్థంచేసుకున్నప్పుడు వాళ్ల ముఖాల్లో కనిపించే ఆనందం నాకు ఎంతో తృప్తినిస్తుంది. వాళ్లలో చాలామంది, యెహోవాకు తాము ఎంత కృతజ్ఞులై ఉన్నారో, క్రైస్తవ కూటాలకూ పరిచర్యకూ సొంతగా సిద్ధపడగలుగుతున్నందుకు ఎంత సంతోషంగా ఉన్నారో తెలిపారు. చదివి వినిపించమని ఇక వాళ్లు ఎవ్వరినీ అడగనక్కరలేదు. ఇప్పుడు వాళ్లే సొంతగా అధ్యయనం చేసుకోగలరు. ఆధ్యాత్మికంగా ఎదిగేలా తమ కుటుంబాలకు చక్కగా సహాయం చేయగలరు. యెహోవాకు మరింత దగ్గరయ్యేలా ఈ పుస్తకాలు వాళ్లకు సహాయం చేస్తాయి.”