మీకిది తెలుసా?
యెరూషలేము దేవాలయంలో జంతువుల వ్యాపారం చేస్తున్నవాళ్లను ‘దొంగలు’ అని యేసు పిలిచాడు. అలా పిలవడం సరైనదేనని ఎందుకు చెప్పవచ్చు?
మత్తయి సువార్తలో మనమిలా చదువుతాం, ‘యేసు ఆలయం లోపలికి వెళ్లి, ఆలయంలో అమ్మేవాళ్లను, కొనేవాళ్లను అందర్నీ బయటికి వెళ్లగొట్టాడు; డబ్బులు మార్చేవాళ్ల బల్లల్ని, పావురాలు అమ్మేవాళ్ల బల్లల్ని తలక్రిందులుగా పడేశాడు. ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “‘నా మందిరం ప్రార్థన మందిరమని పిలవబడుతుంది’ అని లేఖనాలు చెప్తున్నాయి. కానీ మీరు దాన్ని దొంగల గుహగా మారుస్తున్నారు.”’—మత్త. 21:12, 13.
యూదా చరిత్రను గమనిస్తే, ఆలయంలో వ్యాపారం చేసేవాళ్లు చాలా ఎక్కువ ధరకు జంతువుల్ని అమ్ముతూ ప్రజల్ని మోసం చేసేవాళ్లని తెలుస్తోంది. ఉదాహరణకు, గువ్వలు చాలా తక్కువ ధరకు దొరికేవి అందుకే పేదవాళ్లు వాటిని కొనుక్కొని బలి అర్పించేవాళ్లు. కానీ ప్రాచీన యూదా రాతల్ని బట్టి తేలిన విషయమేమిటంటే, మొదటి శతాబ్దంలో రెండు గువ్వల్ని కొనుక్కోవడానికి ఒక బంగారు దేనారం ఇవ్వాల్సి వచ్చేది. అప్పట్లో ఒక పనివాడు 25 రోజులు పనిచేస్తే ఒక బంగారు దేనారం సంపాదించగలిగేవాడు. అలా గువ్వల ధర, పేదవాడు కొనుక్కోలేనంతగా పెరిగిపోయింది. (లేవీ. 1:14; 5:7; 12:6-8) వ్యాపారం పేరుతో జరుగుతున్న మోసాన్ని చూసిన సీమోను బెన్ గమాలీయేల్ అనే రబ్బీకి చాలా కోపం వచ్చింది. దాంతో ధర్మశాస్త్రం ప్రకారం యూదులు ఖచ్చితంగా అర్పించాల్సిన బలుల్ని తగ్గించాడు. వెంటనే రెండు గువ్వల ధర ఒక బంగారు దేనారంలో వందో వంతుకు పడిపోయింది.
దీనిబట్టి ఆలయంలో వ్యాపారం చేస్తున్నవాళ్లు అత్యాశపరులని, ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకున్నారని అర్థమౌతోంది. అందుకే యేసు వాళ్లను ‘దొంగలు’ అని పిలవడం సరైనదే.