ఒక ప్రాచీన గ్రంథపు చుట్టలో ఏముందో తెలిసింది
1970లో ఏన్గెదీలో దొరికిన ఒక గ్రంథపు చుట్ట, చదవడానికి వీల్లేనంతగా కాలిపోయి ఉంది. దొరికిన భాగంలో, దేవుని పేరు కలిగిన లేవీయకాండములోని కొన్ని వచనాలు ఉన్నాయని 3-D స్కానింగ్‌లో తేలింది
1970లో, మృత సముద్రపు పశ్చిమ తీరం దగ్గరున్న ఇజ్రాయిల్‌లోని ఏన్గెదీలో, పురావస్తు శాస్త్రజ్ఞులకు బాగా కాలిపోయిన గ్రంథపు చుట్ట ఒకటి కనిపించింది. అది వాళ్లకు, ఒక సభామందిరాన్ని తవ్వుతున్నప్పుడు దొరికింది. బహుశా సా.శ. ఆరో శతాబ్దంలో ఆ గ్రామం నాశనం అయినప్పుడే సభామందిరం కూడా కాలిపోయి ఉంటుంది. అయితే, వాళ్లకు దొరికిన గ్రంథపు చుట్ట చదవడానికి వీల్లేనంతగా కాలిపోయింది; ఒకవేళ తెరవడానికి ప్రయత్నిస్తే ముక్కలుముక్కలు అయిపోతుంది. కానీ 3-D స్కానింగ్ వల్ల ఆ గ్రంథపు చుట్ట లోపల ఏముందో చూడగలిగారు. అంతేకాదు కొత్త డిజిటల్ స్కానింగ్ సాఫ్ట్‌వేర్ సహాయంతో అందులో ఏం రాసుందో చదవగలిగారు.
ఇంతకీ ఆ గ్రంథపు చుట్టలో ఏముంది? అది బైబిలుకు సంబంధించిన గ్రంథపు చుట్టు. దొరికిన భాగంలో లేవీయకాండములోని మొదటి కొన్ని వచనాలు ఉన్నాయి. ఆ వచనాల్లో నాలుగు హీబ్రూ హల్లులతో రాసే దేవుని పేరు అంటే టెట్రగ్రామటన్ కనిపించింది. ఆ గ్రంథపు చుట్ట సా.శ. 50-400 మధ్యకాలం నాటిదని తెలుస్తోంది. కాబట్టి మృత సముద్ర గ్రంథపు చుట్టల (కుమ్రాన్) తర్వాత ఇదే అతి పురాతనమైనది. ద జెరూసలేం పోస్ట్‌లో గిల్ జోహార్ ఇలా రాశాడు, “లేవీయకాండానికి సంబంధించిన ఏన్గెదీ గ్రంథపు చుట్టలో ఏముందో తెలిసే వరకు, అన్నిటికన్నా పురాతనమైన రాతప్రతులు మృత సముద్ర గ్రంథపు చుట్టలే (దాదాపు సా.శ.పూ. 100 నాటివి). ఆ తర్వాత అతి పురాతనమైనది అలెప్పో కోడెక్స్ (దాదాపు సా.శ. 930 నాటివి). వాటిమధ్య సుమారు 1000 సంవత్సరాల వ్యవధి ఉంది.” నిపుణులు టెక్నాలజీ సహాయంతో ఈ గ్రంథపు చుట్టను చదివిన తర్వాత, ఎన్నో ఏళ్లు గడిచినా తోరహ్‌లోని విషయాలు ఖచ్చితంగానే ఉన్నాయనీ, నకలు చేసేవాళ్ల పొరపాట్లు దాని సారాంశాన్ని మార్చలేదనీ చెప్తున్నారు.