మీకు తెలుసా?
బబులోనుకు చెందిన బెల్షస్సరు పాత్రను పురావస్తు శాస్త్రం ఎలా రూఢిపరుస్తుంది?
దానియేలు పుస్తకంలో ప్రస్తావించబడిన రాజైన బెల్షస్సరు అనే వ్యక్తి అసలు ఉనికిలోనే లేడని చాలా సంవత్సరాలుగా బైబిలు విమర్శకులు వాదించారు. (దాని. 5:1) ఆయన ఒకప్పుడు జీవించిన వ్యక్తి అని చెప్పడానికి ఎలాంటి పురావస్తుశాస్త్ర ఆధారాలు దొరకలేదు కాబట్టి వాళ్లు అలా గట్టిగా నమ్మారు. కానీ 1854లో వాళ్ల అభిప్రాయం మారింది. ఎందుకు?
ఆ సంవత్సరంలో, బ్రిటీష్ రాయబారి అయిన జె. జి. టేలర్, ప్రస్తుతం దక్షిణ ఇరాక్‌లో కొన్ని శిథిలాలను వెలికి తీశాడు. అది ఒకప్పుడు ప్రాచీన నగరమైన ఊరు. ఒక పెద్ద కోట దగ్గర ఆయన చాలా మట్టిదిమ్మలను త్రవ్వి తీశాడు. అవి ఒక్కోటి దాదాపు నాలుగు అంగులాల (10 సె.) పొడవు ఉన్నాయి. వాటిమీద కీల లిపిలో కొన్ని రాతలు చెక్కివున్నాయి. ఆయనకు దొరికిన ఒక మట్టిదిమ్మ మీద, బబులోను రాజైన నెబోనైడస్, అతని పెద్ద కొడుకైన బెల్షస్సరుల దీర్ఘాయువు కోసం చేసిన ఒక ప్రార్థన ఉంది. ఈ తవ్వకాల్లో బయటపడిన దాన్నిబట్టి, విమర్శకులు చివరికి బెల్షస్సరు అనే వ్యక్తి ఒకప్పుడు జీవించాడని ఒప్పుకోవాల్సి వచ్చింది.
అయితే, బెల్షస్సరు అనే వ్యక్తి జీవించాడనే కాదు ఆయన ఒక రాజు అనే విషయాన్ని కూడా బైబిలు చెప్తుంది. ఈ విషయంలో కూడా మళ్లీ విమర్శకులు సందేహాలు వ్యక్తం చేశారు. ఉదాహరణకు, 19వ శతాబ్దపు ఇంగ్లీష్ శాస్త్రవేత్త విలియమ్ టోల్బట్ ఏమని రాశాడంటే, ‘బెల్సర్వుసూర్ [బెల్షస్సరు] తండ్రి పరిపాలించే సమయంలోనే ఆయన కూడా పరిపాలించాడని కొంతమంది అంటారు. కానీ అది నిజమని నమ్మడానికి ఇసుమంత ఆధారం కూడా లేదు.’
అయితే, బెల్షస్సరు తండ్రియైన నెబోనైడస్ రాజు వరుసగా కొన్ని సంవత్సరాలపాటు బబులోను నగరంలో లేడని మరికొన్ని మట్టిదిమ్మలు తెలియజేయడంతో ఆ వివాదం సద్దుమణిగింది. మరి ఆయన లేనప్పుడు ఏం జరిగింది? ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఇలా చెప్తుంది: “నెబోనైడస్ దేశాంతరం వెళ్లినప్పుడు, సింహాసనాన్ని అలాగే సైన్యంలో ఎక్కువ భాగాన్ని బెల్షస్సరుకు అప్పగించాడు.” కాబట్టి ఆ సమయంలో బెల్షస్సరు బబులోనులో సహ-పరిపాలకునిగా ఉన్నాడు. అందుకే, “దానియేలు పుస్తకంలో బెల్షస్సరును ‘రాజు’ అని సంబోధించడం” సరైనదే అని పురావస్తు శాస్త్రజ్ఞుడూ భాషా పండితుడూ అయిన ఆలన్ మిల్లాడ్ పేర్కొన్నాడు.
నిజానికి దేవుని సేవకులకు, దానియేలు పుస్తకం నమ్మదగినది, దైవ ప్రేరేపితమైనది అని చెప్పడానికి ఆధారం బైబిల్లోనే ఉంది.—2 తిమో. 3:16.