1 | దేవునికి చెప్పుకోండి “మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి”
బైబిల్లో ఇలా ఉంది: “ఆయనకు [దేవునికి], మీ మీద శ్రద్ధ ఉంది కాబట్టి మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి.”—1 పేతురు 5:7.
అంటే . . .
మనసులో ఏ దిగులు ఉన్నా, గుండెల్లో ఏ భారం ఉన్నా అది తనకు చెప్పమని యెహోవా దేవుడు మనల్ని అడుగుతున్నాడు. (కీర్తన 55:22) సమస్య చిన్నదైనా పెద్దదైనా అది ఆయనకు చెప్పొచ్చు. ఏదైనా ఒక విషయం మనల్ని బాధ పెడుతుందంటే, ఆ విషయాన్ని యెహోవా ఖచ్చితంగా పట్టించుకుంటాడు. మనశ్శాంతి కావాలంటే మనసులో ఉన్నదంతా ఆయనకు చెప్పుకోవడం ముఖ్యం.—ఫిలిప్పీయులు 4:6, 7.
దానివల్ల ఉపయోగం
మానసిక సమస్యతో పోరాడుతున్నప్పుడు చాలా ఒంటరిగా అనిపించవచ్చు. మనకు ఎలా అనిపిస్తుందో మిగతావాళ్లకు అన్నిసార్లు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. (సామెతలు 14:10) కానీ మన ఫీలింగ్స్‌ని దేవునికి మనసువిప్పి చెప్పినప్పుడు ఆయన శ్రద్ధగా వింటాడు, అర్థం చేసుకుంటాడు. యెహోవా మనల్ని చూస్తున్నాడు, మనం అనుభవిస్తున్న బాధ, వేదన ఆయనకు తెలుసు. మనల్ని బాధపెట్టే విషయం ఏదైనా కావచ్చు, అది తనకు చెప్పమని ఆయన అడుగుతున్నాడు.—2 దినవృత్తాంతాలు 6:29, 30.
మన ఫీలింగ్స్‌ని యెహోవాకు చెప్పుకున్నప్పుడు ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడనే నమ్మకం ఇంకా పెరుగుతుంది. అలా చెప్పుకున్న ఒక వ్యక్తి, యెహోవా గురించి ఇలా అన్నాడు: “నువ్వు నా బాధల్ని చూశావు; నా తీవ్రమైన వేదన నీకు తెలుసు.” (కీర్తన 31:7) మన పరిస్థితిని యెహోవా చూస్తున్నాడనే విషయాన్ని గుర్తిస్తే, బాధను తట్టుకుని ముందుకు వెళ్లడం తేలికౌతుంది. అయితే, ఆయన కేవలం చూడడమే కాదు, అర్థం చేసుకుంటాడు. ఆయనకన్నా బాగా ఇంకెవ్వరూ మనల్ని అర్థం చేసుకోలేరు. అంతేకాదు, ఆయన బైబిలు ద్వారా మనకు మనశ్శాంతిని ఇస్తాడు, మనలో నిరుత్సాహాన్ని పోగొడతాడు.