కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు.”—యాకోబు 4:8

దేవుడు మన ప్రార్థనల్ని వింటాడా?

దేవుడు మన ప్రార్థనల్ని వింటాడా?

మీరు చేస్తున్న ప్రార్థనల్ని దేవుడు వింటున్నాడా అనే సందేహం మీకు ఎప్పుడైన వచ్చిందా? చాలామందికి ఆ సందేహం వచ్చింది. కొన్ని సమస్యలు తీర్చమని ఎంతోమంది దేవునికి ప్రార్థించారు, అయినా వాళ్ల సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. దానర్థం, దేవుడు మన ప్రార్థనల్ని పట్టించుకోవట్లేదనా? కానేకాదు! మనం సరైన విధంగా ప్రార్థిస్తే దేవుడు వింటాడని బైబిలు చెప్తుంది. ఇప్పుడు మనం బైబిలు చెప్తున్న కొన్ని విషయాల్ని పరిశీలిద్దాం.

దేవుడు వింటున్నాడు.

“ప్రార్థనలు వినే దేవా, అన్నిరకాల ప్రజలు నీ దగ్గరికి వస్తారు.”—కీర్తన 65:2.

తాము చేసే ప్రార్థనల్ని దేవుడు వినట్లేదని కొంతమంది అనుకున్నా వాళ్లు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే, ప్రార్థించినప్పుడు వాళ్లకు మనశ్శాంతిగా ఉంటుందని అంటారు. కానీ, ప్రార్థన అనేది కేవలం సమస్యల్లో ఉన్నప్పుడు ప్రశాంతత కోసం చేసేది కాదు. నిజానికి బైబిలు ఇలా చెప్తుంది, ‘తనకు మొరపెట్టే వాళ్లందరికీ, నిజాయితీతో తనకు మొరపెట్టే వాళ్లందరికీ యెహోవా a దగ్గరగా ఉన్నాడు. వాళ్లు పెట్టే మొరలు వింటాడు.’—కీర్తన 145:18, 19.

దీన్నిబట్టి, తనమీద నమ్మకముంచి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని మనం చెప్పవచ్చు. అందుకే ఆయన ఎంతో ప్రేమగా ఇలా చెప్తున్నాడు, “మీరు నాకు మొరపెడతారు, వచ్చి నాకు ప్రార్థిస్తారు, నేను మీ ప్రార్థన వింటాను.”—యిర్మీయా 29:12.

మీరు తనకు ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు.

“పట్టుదలగా ప్రార్థిస్తూ ఉండండి.”—రోమీయులు 12:12.

“ప్రార్థన చేస్తూ ఉండమని” అలాగే ‘ప్రతి సందర్భంలో ప్రార్థిస్తూ ఉండమని’ బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. అవును, మనం ఆయనకు ప్రార్థించాలని యెహోవా దేవుడు కోరుకుంటున్నాడు.—మత్తయి 26:41; ఎఫెసీయులు 6:18.

మనం ఆయనకు ప్రార్థించాలని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు? ఉదాహరణకు, పిల్లలు తండ్రి దగ్గరకు వెళ్లి సహాయం చేయమని అడిగితే, అప్పుడు ఆయనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజమే, పిల్లలు అడగకముందే వాళ్ల అవసరాలేంటో, భావాలేంటో తండ్రికి తెలుసుండవచ్చు. కానీ సహాయం చేయమని అడిగిన మాటల్ని తండ్రి విన్నప్పుడు, తన పిల్లలు తనను ఎంత నమ్ముతున్నారో, తనకు ఎంత దగ్గరవ్వాలని కోరుకుంటున్నారో చూపిస్తారు. అదే విధంగా, మనం యెహోవాకు ప్రార్థించినప్పుడు కూడా ఆయన్ని ఎంత నమ్ముతున్నామో, ఆయనకు ఎంత దగ్గరవ్వాలని కోరుకుంటున్నామో చూపిస్తాం.—సామెతలు 15:8; యాకోబు 4:8.

దేవునికి మీ పట్ల నిజంగా శ్రద్ధ ఉంది.

“ఆయనకు మీ మీద శ్రద్ధ ఉంది కాబట్టి మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి.”—1 పేతురు 5:7.

దేవునికి మనమంటే ప్రేమ, శ్రద్ధ ఉన్నాయి కాబట్టి, మనం ఆయనకు ప్రార్థించాలని కోరుకుంటున్నాడు. మన సమస్యలు, ఆందోళనలు ఆయనకు బాగా తెలుసు. అంతేకాదు, ఆయన మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు.

దావీదు అనే ఒక రాజు, తాను జీవించినంత కాలం సహాయం చేయమని యెహోవా దేవునికి ప్రార్థిస్తూనే ఉన్నాడు. తన ఆలోచనల్ని, భావాల్ని కూడా దేవునితో పంచుకునేవాడు. (కీర్తన 23: 1-6) దేవుడు దావీదును ఎలా చూశాడు? అతన్ని చాలా ప్రేమించాడు, అతను చేసిన ప్రార్థనలు అన్నీ విన్నాడు. (అపొస్తలుల కార్యాలు 13:22) అదేవిధంగా, దేవుడు మన ప్రార్థనల్ని కూడా వింటాడు. ఎందుకంటే ఆయనకు మనమీద శ్రద్ధ ఉంది.

‘నేను యెహోవాను ప్రేమిస్తున్నాను ఎందుకంటే ఆయన నా స్వరాన్ని వింటాడు’

పై మాటల్ని ఒక బైబిలు రచయిత రాశాడు. దేవుడు తన ప్రార్థనల్ని వింటున్నాడని ఆయన నమ్మాడు; అది ఆయనకు ఎంతో సహాయం చేసింది, అలాగే దేవునికి దగ్గరైనట్టుగా కూడా ఆయనకు అనిపించింది. అంతేకాదు జీవితంలో కష్టాలు, కన్నీళ్లు వచ్చినప్పుడు వాటిని తట్టుకోవడానికి ఆయన బలాన్ని పొందాడు.—కీర్తన 116:1-9.

దేవుడు మన ప్రార్థనల్ని వింటున్నాడని నమ్మినప్పుడు ఆయనకు ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాం. ఉత్తర స్పెయిన్‌లో నివసిస్తున్న పాత్రో అనే ఒకతని అనుభవాన్ని గమనించండి. తన 19 ఏళ్ల అబ్బాయి యాక్సిడెంట్‌లో చనిపోయినప్పుడు పాత్రో తన బాధ అంతటినీ దేవునికి చెప్పుకున్నాడు. అంతేకాదు, తనకు సహాయాన్ని, మద్దతును ఇవ్వమని పదేపదే ప్రార్థించాడు. అప్పుడు ఏం జరిగింది? పాత్రో ఇలా చెప్తున్నాడు: “తోటి క్రైస్తవుల ద్వారా యెహోవా మా ప్రార్థనలకు జవాబిచ్చాడు. వాళ్లు మాకు సహాయాన్ని, ఊరటను అందించారు.”

తరచూ మనల్ని ప్రేమిస్తున్న స్నేహితులు ఇచ్చే మద్దతు ద్వారా, ఊరట ద్వారా మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది

పాత్రో చేసిన ప్రార్థనలు చనిపోయిన వాళ్ల అబ్బాయిని తిరిగి తీసుకురాలేదు కానీ ఆయనకు, ఆయన కుటుంబానికి వేరే విధాలుగా సహాయం చేశాయి. ఆయన భార్య మారియ కార్మెన్‌ ఇలా గుర్తుచేసుకుంటుంది: “నా బాధను తట్టుకోవడానికి ప్రార్థన నాకు సహాయం చేసింది. యెహోవా దేవుడు నన్ను అర్థం చేసుకున్నాడని నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆయనకు ప్రార్థించినప్పుడల్లా మనశ్శాంతిని పొందాను.”

బైబిలు చెప్తున్నదాన్ని బట్టి, అలాగే కొన్ని అనుభవాల్ని బట్టి దేవుడు ప్రార్థనల్ని వింటున్నాడని స్పష్టమౌతుంది. కానీ, దేవుడు అన్నీ ప్రార్థనలు వినడని కూడా చెప్పవచ్చు. అయితే, దేవుడు కొన్ని ప్రార్థనలకు జవాబిచ్చి, మరికొన్ని వాటికి ఎందుకు జవాబు ఇవ్వట్లేదు?

a దేవుని పేరు యెహోవా.—కీర్తన 83:18.