దేవుని అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ ఉండండి
దేవుడు మనుషులకు ఒక ప్రత్యేకమైన వరాన్ని ఇచ్చాడు. ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడగలగడం, మనసులోని భావాల్ని ఆయనకు చెప్పగలగడమే ఆ వరం. ప్రవక్త అయిన దావీదు ఇలా ప్రార్థించాడు: “ప్రార్థనలు వినే దేవా, అన్నిరకాల ప్రజలు నీ దగ్గరికి వస్తారు.” (కీర్తన 65:2) మరి, మనం ఎలా ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనలు వింటాడు, మనల్ని దీవిస్తాడు?
మనసులో ఉన్నదంతా వినయంగా చెప్పండి
మీరు దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన ముందు మీ హృదయాల్ని కుమ్మరించవచ్చు, అంటే మీ మనసులోని భావాలన్నీ ఆయనకు చెప్పవచ్చు. (కీర్తన 62:8) మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనలంటే సర్వశక్తిమంతునికి ఎంతో ఇష్టం.
దేవుని పేరు ఉపయోగించండి
దేవునికి చాలా బిరుదులు ఉన్నాయి, కానీ పేరు మాత్రం ఒక్కటే ఉంది. “నేను యెహోవాను. ఇదే నా పేరు.” (యెషయా 42:8) పవిత్ర లేఖనాల్లో యెహోవా అనే పేరు దాదాపు 7,000 సార్లు కనిపిస్తుంది. చాలామంది ప్రవక్తలు కూడా దేవుని పేరు ఉపయోగించి ప్రార్థించారు. ఉదాహరణకు, అబ్రాహాము ఇలా అన్నాడు: “యెహోవా, దయచేసి . . . నన్ను [నీతో] మాట్లాడనివ్వు.” (ఆదికాండం 18:30) మనం కూడా ప్రార్థిస్తున్నప్పుడు యెహోవా అనే పేరును ఉపయోగించాలి.
మీ సొంత భాషలో ప్రార్థించండి
మనం ఏ భాషలో ప్రార్థించినా దేవునికి మన ఆలోచనలు, భావాలు అర్థమౌతాయి. ‘దేవునికి పక్షపాతం లేదు. ప్రతీ జనంలో, తనకు భయపడి సరైనది చేసేవాళ్లను ఆయన అంగీకరిస్తాడు’ అని దేవుని వాక్యం హామీ ఇస్తోంది.—అపొస్తలుల కార్యాలు 10:34, 35.
అయితే, దేవుడిచ్చే దీవెనలు పొందాలంటే ప్రార్థన మాత్రమే సరిపోదు. మనం ఇంకా ఏం చేయాలో తర్వాతి ఆర్టికల్స్‌లో తెలుసుకుంటాం.