కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రకృతి ఏమి బోధిస్తోంది?

ప్రకృతి ఏమి బోధిస్తోంది?

ప్రకృతి ఏమి బోధిస్తోంది?

“మృగములను విచారించుము అవి నీకు బోధించును. ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును. భూమినిగూర్చి ధ్యానించినయెడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలును నీకు దాని వివరించును.”​—యోబు 12:7, 8.

ఇటీవలి సంవత్సరాల్లో శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు మొక్కలు, జంతువుల నుండి అక్షరార్థంగా ఎంతో నేర్చుకున్నారు. వారు వివిధ ప్రాణుల రూపకల్పనను పరిశోధించి, వాటిని అనుకరిస్తూ కొత్త వస్తువులను తయారుచేయడానికి, ఉన్న యంత్రాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ రంగాన్ని బయోమిమెటిక్స్‌ అంటారు. మీరు ఈ క్రింది ఉదాహరణలను పరిశీలిస్తుండగా మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ‘ఈ రూపకల్పనలకు ఘనత నిజానికి ఎవరికి చెందాలి?’

తిమింగలాల రెక్కలనుండి నేర్చుకోవడం

విమానాలను తయారుచేసేవారు గూను తిమింగలం (హంప్‌బాక్‌ వేల్‌) నుండి ఏమి నేర్చుకోవచ్చు? చాలా ఎక్కువే అన్నట్లుగా ఉంది. ప్రౌఢ దశలో ఉన్న ఒక గూను తిమింగలం పూర్తి లోడుతోవున్న లారీ ఉన్నంత బరువుతో అంటే దాదాపు 30 టన్నుల బరువుతో ఉండడమే కాక, అది దృఢమైన శరీరంతో ఉంటుంది, దానికి పెద్ద తెడ్లలాంటి రెక్కలు ఉంటాయి. పన్నెండు మీటర్ల పొడవుండే ఆ తిమింగిలం నీటిలో అసాధారణ వేగంతో ఈదుతుంది. పీతలు రొయ్యలు లేదా చేపల్లాంటి ఎరను పట్టుకోవాలనుకున్నప్పుడు, అది వాటి క్రింద నీటిలో సుడులుగా తిరుగుతూ వరుసగా నీటి బుడగలను వదులుతుంది. ఆ బుడగలన్నీ 1.5 మీటర్లంత చిన్న వృత్తాకార వలగా మారి, అది తినాలనుకున్న ఎరను ఆ వలలో చిక్కుకునేలా చేస్తాయి. అప్పుడు, ఆ తిమింగలం ఒక్క ఉదుటున పైకి ఎగిరి వాటిన్నింటినీ మ్రింగేస్తుంది.

అంత దృఢమైన శరీరం ఉన్న ఈ తిమింగలం అంత చిన్న వృత్తాకార వల ఏర్పడేలా ఎలా సుడులుగా తిరుగుతుందనేది పరిశోధకుల్లో ప్రత్యేకంగా ఆసక్తి రేకెత్తించింది. ఈ తిమింగలపు రెక్కల్లోనే అసలు రహస్యం దాగుందని వారు కనిపెట్టారు. విమానాల రెక్కల్లా వాటి రెక్కల చివర్లు నున్నగా ఉండవు, వాటి రెక్కలు గరుకుగావుండి, వాటి పొడవునా ట్యూబర్కల్స్‌ అనబడే బొడిపెలుంటాయి.

తిమింగలం నీటిలో దూసుకువెళ్తున్నప్పుడు ఆ ట్యూబర్కల్స్‌ ఊర్థ్వపీడనాన్ని పెంచి, నీటి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఎలా? తిమింగలం ఈదుతున్నప్పుడు, నిటారుగా లేదా పైకి కిందకు ఈదుతున్నప్పుడు కూడా రెక్కలపైనుండి నీరు సుడులుగా తిరుగుతూ వేగంగా వెనక్కి వెళ్లిపోయేలా ఆ ట్యూబర్కల్స్‌ తోడ్పడతాయి. ఆ రెక్కల చివర్లు ఒకవేళ నున్నగా ఉంటే, తిమింగలం అంత చిన్నని వృత్తాకార వలయాలు ఏర్పడేలా అంత వేగంగా తిరగలేదు, ఎందుకంటే దాని రెక్కలవెనక నీరు సుడులు తిరుగుతూ దానిని క్రిందికి లాగుతుంది.

అది కనిపెట్టడంవల్ల ఎలాంటి ప్రయోగాత్మక ఉపయోగాలున్నాయి? తిమింగలపు రెక్కల రూపకల్పన ఆధారంగానే విమానాల రెక్కలను చేశారు, అందువల్ల వీస్తున్న గాలిని మళ్ళించడానికి వాటికి ఫ్లాపులు లేదా ఇతర యాంత్రిక ఉపకరణాలు ఎక్కువగా అవసరం ఉండదు. అలాంటి రెక్కలు సురక్షితమైనవి, వాటి నిర్వహణ కూడా సులభం. బయోమెకానిక్‌ నిపుణుడైన జాన్‌ లాంగ్‌, “గూను తిమింగలపు రెక్కలపై ఉన్న ట్యూబర్కల్స్‌ను ప్రతీ విమానపు రెక్కలపై చూసే రోజు ఎంతో దూరంలో లేదు” అని నమ్ముతున్నాడు.

సముద్రపు పక్షి రెక్కలను అనుకరించడం

విమానం రెక్కల రూపకల్పన ఇప్పటికే పక్షిరెక్కలను అనుకరించి చేయబడ్డాయన్నది నిజమే. అయితే, ఇటీవల శాస్త్రజ్ఞులు ప్రకృతిలోని ప్రాణులను అనుకరించడంలో కొత్త శిఖరాలకు చేరుకుంటున్నారు. “ఫ్లోరిడాలోని విశ్వవిద్యాలయంలో పరిశోధకులు, సముద్రపు పక్షిలా ఒకే చోట పల్టీలు కొడుతూ, వేగంగా కిందికి దూసుకువచ్చే లేదా పైకి దూసుకుపోయే విధంగా ఉండి, రిమోట్‌చేత నియంత్రించబడే ఒక నమూనా విమానాన్ని తయారుచేశారని” న్యూ సైంటిస్ట్‌ అనే పత్రిక నివేదించింది.

సముద్రపు పక్షులు తమ రెక్కలను మధ్యలో, గూడల దగ్గర మడవడం ద్వారా గాలిలో విన్యాసాలు చేయగల్గుతాయి. ఆ రెక్కల అనువైన రూపకల్పనను ఉపయోగించి, “60 సెంటీమీటర్ల పొడవున్న విమానపు నమూనాలో, రెక్కలను ఆడించే వివిధ లోహపు కడ్డీలను క్రమపద్ధతిలో కదిపేలా ఒక చిన్న మోటారు అమర్చబడింది” అని ఆ పత్రిక చెప్పింది. నైపుణ్యవంతంగా రూపొందించబడిన ఈ రెక్కలు ఆ చిన్న విమానం గిరికీలు కొట్టడానికి ఎత్తైన భవనాల మధ్యనుండి వేగంగా దూసుకుపోవడానికి తోడ్పడతాయి. పెద్ద నగరాల్లో రసాయన లేదా జీవరసాయన ఆయుధాల జాడను కనిపెట్టడం కోసం అలా నియంత్రించడానికి ఎంతో సులువైన విమానాలను తయారుచేయడానికి అమెరికా వాయుసేన ఎంతో ఉత్సుకతతో ఉంది.

బల్లి కాళ్ళను అనుకరించి చేసినది

భూమిపై జీవించే జంతువులు మనకెంతో నేర్పిస్తాయి. ఉదాహరణకు, గెక్కో అని పిలువబడే చిన్న బల్లికి గోడలను ఎక్కగలిగే, తలక్రిందులుగా పైకప్పును అంటిపెట్టుకుని ఉండగలిగే సామర్థ్యం ఉంది. గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేసే ఈ సామర్థ్యం వెనకున్న రహస్యమేమిటి?

గాజులాంటి ఉపరితలాలను కూడా అంటిపెట్టుకుని ఉండగలిగే బల్లికి, దాని కాళ్ళపై ఉండే నూగులాంటి వెంట్రుకలవల్ల ఆ సామర్థ్యం లభిస్తుంది. వాటి కాళ్లలోనుండి జిగురువంటి పదార్థమేదీ బయటకు రాదు. బదులుగా అవి పరమాణు శక్తిని ఉపయోగించుకుంటాయి. వాన్‌ డర్‌ వాల్స్‌ ఫోర్సెస్‌ అనబడే బలహీన ఆకర్షణ బలాల కారణంగా రెండు ఉపరితలాల మీదున్న అంటే బల్లి కాళ్లమీదున్న పరమాణువులు, గోడమీదున్న పరమాణువులు ఒకదానికొకటి గట్టిగా అతుక్కుంటాయి. సాధారణంగా, గురుత్వాకర్షణ ఈ పరమాణు శక్తిని సులువుగా అధిగమిస్తుంది, అందుకే ఏ మానవుడూ కేవలం చేతులను గట్టిగా గోడమీద ఆన్చి పైకి ఎక్కలేడు. అయితే, బల్లి కాళ్ళపై ఉన్న సన్నని వెంట్రుకలవల్ల అది గోడ ఉపరితలంపై ఎక్కువభాగాన్ని ఆక్రమించుకోగలుగుతుంది. అలా వాన్‌ డర్‌ వాల్స్‌ ఆకర్షణ బలాలు బల్లి కాళ్ళమీదున్న నూగులాంటి వెంట్రుకలతో కలవడంవల్ల ఉత్పత్తైన ఆకర్షణ మూలంగా ఆ చిన్న బల్లి పడిపోకుండా ఉంటుంది.

అది కనిపెట్టడంవల్ల ప్రయోజనమేమిటి? బల్లి కాళ్ళను అనుకరించి చేయబడిన సింథటిక్‌ పదార్థాలను వెల్క్రోకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. * వెల్క్రో ప్రకృతినుండి అనుకరించినవాటికి మరో ఉదాహరణ. ఒక పరిశోధకుడు చెప్పినదాన్ని ది ఎకానమిస్ట్‌ అనే పత్రిక ఇలా ఉల్లేఖిస్తోంది, శరీరంపై రసాయనాలతో చేసిన బాండేజీని ఉపయోగించలేనప్పుడు, బల్లి కాళ్ళపై ఉండే వెంట్రుకల్ని అనుకరిస్తూ చేసిన బాండేజీని అంటే “గెక్కో టేపును” ప్రత్యేకంగా “వైద్య సంబంధిత అవసరాలకు ఉపయోగించవచ్చు.”

ఘనత ఎవరికి చెందాలి?

నేషనల్‌ ఎరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ ఎడ్మినిస్ట్రేషన్‌ సంస్థ తేలులా నడిచే 8 కాళ్ళుండే మరమనిషిని తయారు చేస్తోంది. ఒక పెద్ద పురుగు అవరోధాలను దాటి వెళ్లగలిగినట్లే వెళ్లగల ఆరు కాళ్ళ ట్రాక్టరును ఫిన్‌లాండ్‌లోని ఇంజనీర్లు ఇప్పటికే రూపొందించారు. ఒక రకం ముళ్ళ చెట్టు ఫలాలు తెరుచుకుని, మూసుకునే విధాన్ని పోలిన చిన్న రంధ్రాలున్న బట్టను పరిశోధకులు రూపొందించారు. ఆశ్చర్యకరమైన రీతిలో, వెనక్కిలాగే శక్తికి వ్యతిరేకంగా వేగంతో ముందుకు దూసుకుపోగల బాక్స్‌ఫిష్‌ (చేప)ను పోలిన కారును ఒక కారు తయారీ సంస్థ రూపొందిస్తోంది. ఇతర పరిశోధకులు, శరీరాన్ని కాపాడేందుకు మరింత తేలికైన, బలమైన కవచాన్ని తయారుచేసే ఉద్దేశంతో ఆబలోన్‌ నత్తలకు ఉండే షాక్‌ అబ్సార్బర్‌ లాంటి గుణాలను పరిశోధిస్తున్నారు.

ప్రకృతినుండి ఎన్ని మంచి ఉపాయాలు దొరికాయంటే, వారు ఇప్పటికే సేకరించిన అలాంటి వివిధ ప్రాణుల సమాచారాన్ని భద్రపరిచేందుకు పరిశోధకులు ఒక డేటాబేస్‌ను స్థాపించారు. శాస్త్రజ్ఞులు తాము తయారుచేసే వస్తువుల రూపకల్పనలో సమస్యలు తలెత్తినప్పుడు ఆ డేటాబేస్‌లో వెదికి “ప్రకృతి సహజమైన పరిష్కారాన్ని కనుగొనవచ్చు” అని ది ఎకానమిస్ట్‌ పత్రిక చెబుతోంది. ఆ డేటాబేస్‌లో భద్రపర్చబడిన ప్రకృతిలోని ప్రాణులు “ప్రాకృతిక పేటెంట్‌ హక్కుదారులు” అని పిలువబడతాయి. సాధారణంగా, పేటెంటు హక్కు ఉన్న వ్యక్తి లేదా సంస్థ తాము కనిపెట్టిన కొత్త విషయాన్ని లేదా యంత్రాన్ని విక్రయించేందుకు చట్టబద్ధంగా రిజిస్టర్‌ చేసుకుంటారు. ఈ ప్రాకృతిక పేటెంట్‌ హక్కు ఉన్న డేటాబేస్‌ గురించి చర్చిస్తూ ది ఎకానమిస్ట్‌ పత్రిక ఇలా అంటోంది: “ప్రకృతిని అనుకరిస్తూ చేసిన వాటిని ‘ప్రాకృతిక పేటెంట్‌ హక్కుదారులు’ అని పిలవడం ద్వారా ప్రకృతికే ఆ పేటెంట్‌ హక్కు ఉందని పరిశోధకులు నొక్కిచెబుతున్నారు.”

ప్రకృతికి ఇంత చక్కని ఉపాయాలు ఎలా వచ్చాయి? ప్రకృతిలో కనిపించే జ్ఞానవంతమైన రూపకల్పన లక్షలాది సంవత్సరాల కాలంలో పరిణామ ప్రక్రియల ప్రయోగాల కారణంగా వచ్చాయని చాలామంది పరిశోధకులు అనుకుంటున్నారు. కానీ, ఇతర పరిశోధకులు వేరే నిర్ధారణకు వచ్చారు. సూక్ష్మజీవుల శాస్త్రవేత్త అయిన మైఖెల్‌ బిహి 2005లో ద న్యూయార్క్‌ టైమ్స్‌ అనే పత్రికలో ఇలా వ్రాశారు: “[ప్రకృతిలో] రూపకల్పన ఉందని చూపించే బలమైన ఆధారాలు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి: ఒక ప్రాణి బాతులా కనబడుతూ, నడుస్తూ, అరుస్తున్నప్పుడు, అది వేరే పక్షి అని నిరూపించడానికి ఆధారాలు లేనప్పుడు మనం అది బాతు అనే నిర్ధారణకు వచ్చేందుకు తగిన ఆధారాలు ఉన్నాయి.” చివరికాయన ఏమి తేల్చి చెబుతున్నాడు? “రూపకల్పన అంత స్పష్టంగా ఉన్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.”

విమానం కోసం మరింత సురక్షితమైన, మెరుగైన రెక్కలను రూపొందించిన ఇంజనీరు ఘనతకు అర్హుడు. అదేవిధంగా, బహుళార్థ బాండేజీని, మరింత సౌకర్యంగా ఉండే బట్టను లేదా మరింత సమర్థవంతంగా పని చేసే కారును కనిపెట్టిన వ్యక్తి కూడా ఘనతకు అర్హుడు. అలాగని వేరే వ్యక్తి రూపకల్పన చేసినదాన్ని అనుకరించి, ఆ రూపకర్తకు ఘనతను ఆపాదించడానికి నిరాకరించే ఉత్పత్తిదారుడు నిజానికి నేరస్థుడౌతాడు.

కానీ, ఇంజనీరింగులో తమకెదురయ్యే కష్టమైన సమస్యలను పరిష్కరించడం కోసం అంత ఉన్నత శిక్షణ పొందిన పరిశోధకులే ప్రకృతిలోనివాటిని తన స్థాయిలో అనుకరిస్తూ, అంత అద్భుతమైన రూపకల్పనను జ్ఞానంతో సంబంధంలేని పరిణామ సిద్ధాంతానికి ఆపాదించడం మీకు సహేతుకంగా అనిపిస్తుందా? అనుకరించి చేసినదానికే ఒక జ్ఞానవంతుడైన రూపకర్త అవసరమైతే, మరి అసలైనదాన్ని చేయడానికి రూపకర్త అవసరం లేదా? నిజానికి, ఎవరికి ఘనత చెందాలి, దాన్ని సృష్టించిన నైపుణ్యవంతుడైన కళాకారునికా లేక ఆయన పద్ధతిని అనుకరించిన విద్యార్థికా?

తర్కబద్ధమైన ముగింపు

ప్రకృతిలోని రూపకల్పనకు ఆధారాల్ని చూసిన తర్వాత, అనేకమంది కీర్తనకర్త మనోభావాలతో ఏకీభవిస్తారు, ఆయనిలా వ్రాశాడు: “యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.” (కీర్తన 104:​24) బైబిలు రచయితైన పౌలు కూడా అదే నిర్ధారణకు చేరుకున్నాడు. ఆయనిలా వ్రాశాడు: “ఆయన [దేవుని] అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి.”​—రోమీయులు 1:​19, 20.

అయితే, బైబిలును గౌరవించే, దేవుణ్ణి నమ్మే ఎంతోమంది యథార్థవంతులు దేవుడు ప్రకృతిలోని అద్భుతాలను సృష్టించడానికి పరిణామక్రమాన్ని ఉపయోగించాడని వాదిస్తారు. కానీ, దీని గురించి బైబిలు ఏమి బోధిస్తోంది? (g 9/06)

[అధస్సూచి]

^ వెల్క్రో గుత్తిచెట్ల విత్తనాల్లో కనబడే రూపకల్పన ఆధారంగా అంటే ఒకదానితో ఒకటి అంటుకునేలా రూపొందించబడింది.

[5వ పేజీలోని బ్లర్బ్‌]

ప్రకృతికి ఇంత చక్కని ఉపాయాలు ఎలా వచ్చాయి?

[6వ పేజీలోని బ్లర్బ్‌]

ప్రకృతికి పేటెంట్‌ హక్కుదారుడు ఎవరు?

[7వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

అనుకరించి చేసినదానికే ఒక జ్ఞానవంతుడైన రూపకర్త అవసరమైతే, మరి అసలైనదాన్ని చేయడానికి రూపకర్త అవసరం లేదా?

ఎంతో చక్కగా నియంత్రించబడే ఈ విమానం నీటిపక్షి రెక్కలను అనుకరించి చేయబడింది

బల్లి కాళ్లకు మురికి అంటదు, గుర్తులు విడిచిపెట్టవు, టెఫ్లాన్‌ మీద లేదా ఎలాంటి ఉపరితలానికైనా అవి అంటిపెట్టుకుని ఉంటాయి, వాటి కాళ్ళు చాలా సులువుగా ఉపరితలాన్ని అతుక్కుంటాయి, విడుస్తాయి. పరిశోధకులు వాటిని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు

ఆశ్చర్యకరమైన రీతిలో, వెనక్కిలాగే శక్తికి వ్యతిరేకంగా వేగంతో ముందుకు దూసుకుపోగల ఈ బాక్స్‌ఫిష్‌ రూపకల్పన వాహనం రూపొందించడాన్ని ప్రేరేపించింది

[చిత్రసౌజన్యం]

విమానం: Kristen Bartlett/ University of Florida; బల్లి కాలు: Breck P. Kent; బాక్స్‌ఫిష్‌, కారు: Mercedes-Benz USA

[8వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

సహజ జ్ఞానంతో ప్రయాణించే ప్రాణులు

అనేక ప్రాణులు భూమ్మీద వాటి దారులను వాటంతటవే కనుక్కోవడంలో “మిక్కిలి జ్ఞానము [‘సహజ జ్ఞానం,’ NW]గలవి.” (సామెతలు 30:​24, 25) రెండు ఉదాహరణలను పరిశీలించండి.

చీమల ట్రాఫిక్‌ నియంత్రణ ఆహారం కోసం వెళ్ళిన చీమలు తిరిగి తమ పుట్టకు చేరుకోవడానికి దారిని ఎలా కనుక్కుంటాయి? తమ పుట్టకు సులువుగా దారి కనుక్కోవడానికి వీలుగా చీమలు ఆ దారి పొడవునా ఒక రకమైన పరిమళద్రవ్యాన్ని వదులుతాయి, అంతేకాక అవి కొన్నిసార్లు రేఖాశాస్త్రాన్ని కూడా ఉపయోగిస్తాయని బ్రిటన్‌లోని పరిశోధకులు కనిపెట్టారు. ఉదాహరణకు, ఫారో చీమల గురించి న్యూ సైంటిస్ట్‌ పత్రిక ఇలా చెబుతోంది, “అవి తమ పుట్టనుంచి 50 నుండి 60 డిగ్రీల కోణంలో ఉండే ఎన్నో చీలిక దారులు చేసుకుంటూ వెళ్తాయి.” ఆ విధంగా దారులు చేసుకోవడంలోని ప్రత్యేకత ఏమిటి? చీమలు పుట్టకు తిరిగి వస్తూ అలాంటి ఒక చీలిక దగ్గరికి చేరుకున్నప్పుడు, వాటికున్న సహజ జ్ఞానాన్ని ఉపయోగించి, తక్కువ కోణంలో ఉన్న చీలిక దారిని ఎన్నుకుంటాయి, ఆ దారి వాటిని ఖచ్చితంగా పుట్టకు నడిపిస్తుంది. ఆ పత్రిక ఇలా అంటోంది, “అలా రేఖాశాస్త్రాన్ని ఉపయోగించి కోణాల్లో ఉండేలా చీలిక దారుల చేసుకోవడంవల్ల వివిధ దారుల్లో ప్రయాణిస్తున్న చీమలు, ప్రత్యేకంగా రెండు దిశల్లో ప్రయాణిస్తున్న చీమలు చక్కని నియంత్రణతో ప్రయాణిస్తాయి, అంతేకాక అవి తప్పు దారిలో వెళ్ళి తమ శక్తిని వృధా చేసుకోవు.”

దిక్సూచిగల పక్షులు చాలా పక్షులు సుదూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు అన్ని రకాల వాతావరణాల్లోనూ నిక్కచ్చిగా ఒకే దిశలో ప్రయాణిస్తాయి. ఎలా? పక్షులు భూమి యొక్క అయస్కాంత క్షేత్ర ప్రభావాన్ని గ్రహించగలవని పరిశోధకులు కనిపెట్టారు. అయితే, భూమిలోని “అయస్కాంత క్షేత్ర రేఖలు వివిధ ప్రాంతాల్లో భిన్నంగా ఉండి, ఎల్లప్పుడూ ఉత్తర దిక్కునే సూచించవు” అని సైన్స్‌ పత్రిక చెబుతోంది. మరి వలస వెళ్లే పక్షులు దారి తప్పిపోకుండా ఏది నివారిస్తుంది? పక్షులు ప్రతీరోజు సూర్యుడు అస్తమించే స్థానాన్నిబట్టి తమలోని దిక్సూచిని సవరించుకుంటాయి. అక్షాంశాలు, ఋతువుల ఆధారంగా సూర్యుడు అస్తమించే స్థానం మారుతుంది కాబట్టి, “సంవత్సరంలోని సమయాన్ని తెలిపే తమలోని ప్రకృతి సహజమైన గడియారం” సహాయంతో అవి ఆ సూర్యుడు అస్తమించే స్థానానికి సంబంధించిన మార్పులను గ్రహిస్తాయని పరిశోధకులు భావిస్తున్నట్లు సైన్స్‌ పత్రిక తెలియజేస్తోంది.

చీమలకు రేఖాశాస్త్రాన్ని అర్థం చేసుకునే విద్యను ఎవరు నేర్పించారు? పక్షులకు దిక్సూచిని, ప్రకృతి సహజమైన గడియారాన్ని, అవి అందజేసే సమాచారాన్ని అర్థం చేసుకునే మెదడును ఎవరు అనుగ్రహించారు? జ్ఞానంతో ఏమాత్రం సంబంధంలేని పరిణామక్రమమా? లేక జ్ఞానవంతుడైన ఒక సృష్టికర్తా?

[చిత్రసౌజన్యం]

E.J.H. Robinson 2004