బైబిలు జీవితాలను మారుస్తుంది
“నా జీవిత గమనం గురించి తీవ్రంగా ఆలోచించసాగాను”
-
జననం: 1941
-
దేశం: ఆస్ట్రేలియా
-
ఒకప్పుడు: సిగరెట్లు తాగేవాడు, మద్యం అతిగా సేవించేవాడు
నా గతం:
నేను న్యూ సౌత్ వేల్స్‌లోని వారియల్డ అనే ఓ చిన్న పల్లెటూరిలో పెరిగాను. మా ఊరు మొత్తం పాడిపంటలే, చాలామంది జీవనాధారం అదే. నేరాలు అంతగా జరగవు కాబట్టి మా ఊరు మచ్చ లేకుండా ఉంది.
మేము మొత్తం పదిమంది పిల్లలం. నేనే పెద్దవాణ్ణి కావడంతో 13 ఏళ్లకే పనికి వెళ్లడం మొదలుపెట్టి ఇల్లు గడవడానికి చేయందించాను. నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి పొలాల్లో, పశువుల దొడ్లలో పనిచేశాను. నాకు 15 ఏళ్లు వచ్చేసరికి నేను గుర్రాలను మచ్చిక చేస్తూ పశుపాలకునిగా పనిచేయడం మొదలుపెట్టాను.
పొలాల్లో పనిచేయడం వల్ల కొన్ని సంతోషాలు పొందాను, కాస్త పాడయ్యాను కూడా. ఒకవైపు నేను నా పనిని, ఆహ్లాదకరమైన పరిసరాలను ఎంతో ఆస్వాదించాను. రాత్రివేళ చలిమంట కాచుకుంటూ చంద్రుణ్ణి, నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తుంటే ఎంతో కనువిందుగా ఉండేది. ఆ సంధ్య వేళ వీచే చిరుగాలి చుట్టూ ఉన్న మొక్కల నుండి మోసుకొచ్చే పరిమళాలు ఇంపుగా ఉండేవి. ఇవన్నీ ఖచ్చితంగా ఎవరో ఒకరు సృష్టించివుంటారని నేను అనుకున్నట్టు నాకు గుర్తు. మరోవైపు, పొలాల్లో పనిచేసేటప్పుడు కొన్ని చెడ్డ అలవాట్లు నాకు అంటుకున్నాయి. అక్కడ పనిచేసేవాళ్లు బూతులు మాట్లాడేవాళ్లు, సిగరెట్లు తాగేవాళ్లు. కొంతకాలానికే నాకు కూడా బూతులు మాట్లాడడం, సిగరెట్లు తాగడం అలవాటైపోయింది.
నా 18వ ఏట సిడ్నీకి తరలి వెళ్లాను. నేను సైనిక దళంలో చేరడానికి ప్రయత్నించాను కానీ నాకు తగిన విద్యార్హతలు లేనందుకు నన్ను తిరస్కరించారు. అయితే నాకు వేరే ఉద్యోగం దొరకడంతో ఓ ఏడాది పాటు సిడ్నీలో ఉన్నాను. ఆ సమయంలోనే తొలిసారి యెహోవాసాక్షులు నన్ను కలిసారు. వాళ్లు నన్ను ఓ కూటానికి రమ్మని ఆహ్వానించినప్పుడు నేను వెళ్లాను, వాళ్ల బోధలే సత్యమని వెంటనే అర్థమైంది.
ఆ తర్వాత కొద్దికాలానికే, నేను సిడ్నీ నుండి తిరిగి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాను. చివరకు నేను క్వీన్స్‌ల్యాండ్‌లోని గ్యూన్‌డవిన్‌డి అనే పట్టణంలో స్థిరపడ్డాను. నాకు అక్కడ ఉద్యోగం దొరికింది, పెళ్లి అయ్యింది. విచారకరంగా, తాగడం కూడా మొదలుపెట్టాను.
మాకు ఇద్దరు అబ్బాయిలు. వాళ్లు పుట్టాక, నేను నా జీవిత గమనం గురించి
తీవ్రంగా ఆలోచించసాగాను. నేను అంతకుముందు సిడ్నీలో ఉన్నప్పుడు సాక్షుల కూటంలో విన్నవి నాకు గుర్తొచ్చాయి. దాంతో ఇంకా ఎక్కువ విషయాలు నేర్చుకోవాలని అనుకున్నాను.ఇంట్లో వెదికినప్పుడు నాకు ఓ పాత కావలికోట సంచిక దొరికింది. అందులో ఆస్ట్రేలియాలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం చిరునామా ఉంది. సహాయం కోరుతూ నేను ఉత్తరం రాశాను. అప్పుడు ఒక యెహోవాసాక్షి మా ఇంటికి వచ్చాడు. ఆయన ఎంతో ప్రేమగల, దయగల వ్యక్తి. కొన్నిరోజుల్లోనే నేను ఆయన దగ్గర బైబిలు విషయాలు నేర్చుకోవడం మొదలుపెట్టాను.
బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే . . .
నేను బైబిలు విషయాలు నేర్చుకుంటున్నప్పుడు, నా జీవితంలో పెనుమార్పులు అవసరమని గుర్తించాను. బైబిల్లో, ప్రత్యేకంగా 2 కొరింథీయులు 7:1 అనే లేఖనం నన్ను బాగా ఆలోచింపజేసింది. ‘శరీరానికి కలిగిన సమస్త కల్మషం నుండి పవిత్రం చేసుకోమని’ ఆ లేఖనం మనల్ని ప్రోత్సహిస్తోంది.
సిగరెట్లు తాగడం, అతిగా మద్యం సేవించడం మానుకోవాలని తీర్మానించుకున్నాను. ఎన్నో ఏళ్ల నుండి ఉన్న ఆ అలవాట్లను మానుకోవడం అంత సులువేమీ కాలేదు. కానీ యెహోవాకు నచ్చినట్లు జీవించాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. రోమీయులు 12:2 లోని సూత్రాన్ని పాటించడం వల్ల గొప్ప మేలు జరిగింది. అక్కడ ఇలా ఉంది: “ఇక మీదట ఈ లోకం తీరును అనుసరిస్తూ జీవించకండి. మీ మనస్సు మార్చుకొని మీరు కూడా మార్పు చెందండి.” (పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) నేను నా అలవాట్లు మానుకోవాలంటే, ముందు నా ఆలోచన తీరును మార్చుకొని వాటి విషయంలో యెహోవాకున్న అభిప్రాయాన్నే కలిగివుండాలని గ్రహించాను. అవి యెహోవా దృష్టిలో హానికరమైన అలవాట్లు. వాటిని నేను యెహోవా సహాయంతోనే మానుకోగలిగాను.
‘నేను నా అలవాట్లు మానుకోవాలంటే, ముందు నా ఆలోచన తీరును మార్చుకోవాలని గ్రహించాను’
బూతులు మానుకోవడం మాత్రం నాకు చాలా కష్టమైంది. ‘దుర్భాష ఏదీ మీ నోట రానివ్వకండి’ అని ఎఫెసీయులు 4:29 లో ఉన్న సలహా నాకు తెలుసు. అయినా నేను ఆ అలవాటును వెంటనే మానుకోలేకపోయాను. కానీ, యెషయా 40:26లో ఉన్న మాటలను ధ్యానించడం నాకు ఎంతో సహాయం చేసింది. నక్షత్రాలతో నిండిన ఆకాశం గురించి ఆ లేఖనంలో ఇలా ఉంది: ‘మీ కళ్లు పైకెత్తి చూడండి. వాటిని ఎవరు సృష్టించారు? వాటి లెక్కచొప్పున వాటి సమూహాల్ని బయలుదేరజేసి వాటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేత, తన బలాతిశయం చేత ఆయన ఒక్కటైనా విడిచిపెట్టడు.’ నేను తిలకించడానికి ఇష్టపడే సువిశాల విశ్వాన్ని సృష్టించే శక్తి దేవునికి ఉందంటే, తనను సంతోషపెట్టేలా జీవించడానికి తగిన మార్పులు చేసుకునేందుకు కావాల్సిన బలాన్ని తప్పకుండా ఆయన నాకు ఇస్తాడు కదా అని నాలో నేను అనుకున్నాను. దేవునికి ఎన్నోసార్లు ప్రార్థన చేసీచేసీ, ఎంతో ప్రయత్నించాక నెమ్మదిగా నేను నా నోటిని అదుపు చేసుకోగలిగాను.
నేనెలా ప్రయోజనం పొందానంటే . . .
నేను పశుపాలకునిగా పనిచేస్తున్న చోట ప్రజలతో మాట్లాడడానికి ఎక్కువ అవకాశాలు దొరికేవి కావు. ఎందుకంటే, అక్కడ కొద్దిమందే ఉండేవాళ్లు. అయితే, యెహోవాసాక్షుల కూటాల్లో దొరికిన శిక్షణ వల్ల ప్రజలతో చక్కగా మాట్లాడడం నేర్చుకున్నాను. ఆ శిక్షణ వల్ల నేను చాలా ప్రయోజనాలు పొందాను. అలాంటి ఓ ప్రయోజనం ఏమిటంటే, దేవుని రాజ్యం గురించిన శుభవార్తను నలుగురితో పంచుకునే సామర్థ్యాన్ని సంపాదించుకోగలిగాను.—మత్తయి 6:9, 10; 24:14.
గత కొన్నేళ్లుగా సంఘపెద్దగా సేవ చేస్తూ ఎంతో ఆనందిస్తున్నాను. నా తోటి విశ్వాసులకు సహకరించడానికి నేను చేయగలిగినదంతా చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.
పెద్దగా చదువుకోని నాకు తన దగ్గర శిక్షణ పొందే గొప్ప వరాన్ని ఇచ్చినందుకు యెహోవాకు నా కృతజ్ఞతలు. (యెషయా 54:13) సామెతలు 10:22 లోని మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ‘యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది’ అని ఆ లేఖనం చెబుతోంది. (w13-E 08/01)