త్రిక ముఖ్యాంశం | ఆందోళనలను ఎలా తట్టుకోవాలి?
ఎప్పుడు ఏమవుతుందో అనే ఆందోళన
“సైరన్ వినబడగానే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది, వెంటనే బాంబ్ షెల్టర్‌కు పరుగెత్తుతాను. అయితే అక్కడకు వెళ్లినా నా ఆందోళన తగ్గదు. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు తలదాచుకోవడానికి ఏచోటూ లేకపోతే నా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఒకసారి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎందుకో ఏడుపొచ్చేసింది, ఇంక ఊపిరాడలేదు. మళ్లీ మాములుగా అవడానికి కొన్ని గంటలు పట్టింది. ఇంతలోనే సైరన్ మళ్లీ మోగింది” అని అలోనా చెప్తుంది.
ప్రాణాలకు ముప్పు తెచ్చే వాటిల్లో యుద్ధం ఒకటి మాత్రమే. ఉదాహరణకు, మీకు లేదా మీకిష్టమైన వాళ్లకు ప్రాణాంతక రోగం ఉందని తెలిసినప్పుడు నిజంగానే మీ మీద బాంబు పడినట్లు ఉంటుంది. భవిష్యత్తు ఎలా ఉంటుందోననే ఆందోళన ఇంకొందరిని వేధిస్తుంది. వాళ్లు ‘నా పిల్లలు-మనవళ్లు యుద్ధాలు, నేరాలు, రోగాలు, కాలుష్యం నిండిన లోకంలో, పాడైపోయిన వాతావరణంలో బ్రతకాల్సి వస్తుందా?’ అని ఆందోళన పడుతుంటారు. వాటిని మనమెలా తట్టుకోవచ్చు?
చెడు జరుగుతుంది అని తెలుసు కాబట్టి, “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును.” (సామెతలు 27:12) మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకున్నట్లే, మన మనసుని, మన భావోద్వేగాల్ని కాపాడుకోవడానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. క్రూరత్వం నిండిన వినోద కార్యక్రమాలు, భయాన్ని కలిగించే దృశ్యాలతో నిండిన వార్తలు మనకు, మన పిల్లలకు భయాన్ని పెంచుతాయి. భయంకరమైన దృశ్యాలను చూడకపోవడం మంచిది, అంటే దానర్థం వాస్తవాల్ని కొట్టిపారేసినట్లు కాదు. దేవుడు మన మనసుని చెడు విషయాల గురించి ఆలోచించేలా తయారుచేయలేదు. కాబట్టి “ఏవి సత్యమైనవో . . . ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో” వాటి గురించే మనం ఆలోచించాలి. అప్పుడు “సమాధానకర్తయగు దేవుడు” మనకు మనశ్శాంతిని ఇస్తాడు.—ఫిలిప్పీయులు 4:8, 9.
ప్రార్థించడం చాలా అవసరం
ఆందోళనను అధిగమించడానికి నిజమైన విశ్వాసం మనకు సహాయం చేస్తుంది. “ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి” అని దేవుడు మనకు చెప్తున్నాడు. (1 పేతురు 4:7) “మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించుననే” నమ్మకంతో దేవుని సహాయం అడగవచ్చు. మనమున్న పరిస్థితుల్లో కూడా వీలైనంత సంతోషంగా ఉండడానికి కావాల్సిన జ్ఞానాన్ని, ధైర్యాన్ని ఇవ్వమని అడగవచ్చు.—1 యోహాను 5:15.
దేవుడు కాదు సాతానే “ఈ లోకాధికారి” అని, ‘లోకమంతయు దుష్టుని యందున్నదని’ బైబిలు చెప్తుంది. (యోహాను 12:31; 1 యోహాను 5:19) “దుష్టునినుండి మమ్మును తప్పించుము” అని ప్రార్థించమని చెప్పినప్పుడు సాతాను నిజంగా ఉన్నాడు, ఆ దుష్టుని నుండి దేవుడు మనల్ని కాపాడతాడని యేసు తెలియచేశాడు. (మత్తయి 6:13) “సైరన్ మోగినప్పుడల్లా నా భావోద్వేగాల్ని అదుపు చేసుకోవడానికి సహాయం చేయమని నేను యెహోవాకు ప్రార్థిస్తాను. నా భర్త కూడా నాకు ఫోన్ చేసి నాతో ప్రార్థన చేస్తాడు. ప్రార్థన నిజంగా నాకు చాలా సహాయం చేస్తుంది” అని అలోనా చెప్తుంది. అవును బైబిలు చెప్తున్నట్లు, “తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు.”—కీర్తన 145:18.
భవిష్యత్తు చాలా బాగుంటుంది
కొండ మీద ప్రసంగంలో యేసు “నీ రాజ్యము వచ్చుగాక” అని ప్రార్థించమని చెప్పాడు. (మత్తయి 6:9, 10) దేవుని రాజ్యం ఇప్పుడు మనకున్న ఆందోళనలన్నీ పూర్తిగా తీసేస్తుంది. “సమాధానకర్తయగు అధిపతి” అయిన యేసు “భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు.” (యెషయా 9:6; కీర్తన 46:9) “ఆయన [దేవుడు] మధ్యవర్తియై అనేక జనములకు న్యాయము తీర్చును . . . జనముమీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును, యుద్ధముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయములేకుండ” జీవిస్తారు. (మీకా 4:3, 4) కుటుంబాలన్నీ సంతోషంగా ఉంటాయి. “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు.” (యెషయా 65:21) “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.”—యెషయా 33:24.
ఇప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనుకోకుండా జరిగే ప్రమాదాల్ని ఆపలేం, వాటినుండి అన్నిసార్లు తప్పించుకోలేం. (ప్రసంగి 9:11) వందల సంవత్సరాలుగా యుద్ధాలు, నేరాలు, రోగాల వల్ల ఎంతోమంది మంచివాళ్లు చనిపోయారు, ఇప్పుడు కూడా చనిపోతున్నారు. అలా చనిపోయిన అమాయకుల పరిస్థితి ఏంటి?
కోట్లాది ప్రజలు చనిపోయారు, ఎంతమందో దేవునికే తెలుసు. ప్రస్తుతం వాళ్లంతా ఆయన మనసులో భద్రంగా ఉన్నారు. “సమాధులలో నున్నవారందరు” నిద్రపోతున్నారు. కానీ, ఒకరోజు వాళ్లంతా “బయటికి” వస్తారు అంటే మళ్లీ బ్రతుకుతారు. (యోహాను 5:28, 29) చనిపోయినవాళ్లు బ్రతకడం గురించి బైబిలు ఇలా అభయమిస్తుంది: “ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది.” (హెబ్రీయులు 6:19) దేవుడు “మృతులలోనుండి ఆయనను [యేసును] లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.”—అపొస్తలుల కార్యములు 17:31.
దేవునికి నచ్చినట్లు జీవిస్తున్న వాళ్లు కూడా ప్రస్తుతం ఆందోళనలు ఎదుర్కొంటున్నారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ, ప్రార్థన చేస్తూ దేవునికి దగ్గరవుతూ, భవిష్యత్తు గురించి బైబిలు చేస్తున్న వాగ్దానాల మీద నమ్మకం పెంచుకుంటూ పాల్, జానెట్, అలోనా తమ ఆందోళనల్ని విజయవంతంగా ఎదుర్కొంటున్నారు. “నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక” అనేమాట వాళ్ల విషయంలో నిజమవుతున్నట్లే మన విషయంలో కూడా నిజమవుతుంది.—రోమీయులు 15:13. ▪ (w15-E 07/01)