1వ భాగం
ఆనందం వెల్లివిరిసే వైవాహిక జీవితం కోసం దేవుని సహాయం తీసుకోండి
‘సృష్టించినవాడు ఆదినుండి వారిని పురుషునిగా, స్త్రీగా సృష్టించాడు.’ —మత్తయి 19:4.
యెహోవా a దేవుడు మొట్టమొదటి వివాహాన్ని జరిపించాడు. ఆయన మొదటి స్త్రీని చేసి ఆదాము దగ్గరికి తీసుకువచ్చాడని బైబిలు చెబుతోంది. అప్పుడు ఆదాము ఆనందపరవశంతో ఇలా అన్నాడు: “నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము.” (ఆదికాండము 2:22, 23) వివాహ దంపతులు సంతోషంగా ఉండాలన్నదే ఇప్పటికీ యెహోవా అభిలాష.
మీరు పెళ్లి చేసుకున్నప్పుడు, వైవాహిక జీవితం చీకూచింత లేకుండా సాఫీగా ఉంటుందని బహుశా మీకు అనిపించవచ్చు. నిజం చెప్పాలంటే, ఒకరినొకరు బాగా ప్రేమించుకునే భార్యాభర్తల మధ్య కూడా కొన్ని సమస్యలు వస్తాయి. (1 కొరింథీయులు 7:28) అయితే మీ కాపురాన్ని, మీ కుటుంబాన్ని సంతోషమయం చేయగల బైబిలు సూత్రాలు ఈ బ్రోషుర్లో ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా వాటిని పాటించడమే.—కీర్తన 19:8-11.
యెహోవా మీకిచ్చిన పాత్రను తెలుసుకోండి
బైబిలు ఏమి చెబుతోందంటే . . . కుటుంబ శిరస్సు భర్త.—ఎఫెసీయులు 5:23.
మీరు భర్తా? అలాగైతే, మీ భార్యను శ్రద్ధగా చూసుకుంటూ ఆమెతో సుతిమెత్తగా వ్యవహరించాలని యెహోవా కోరుతున్నాడు. (1 పేతురు 3:7) దేవుడు ఆమెను మీకు ‘సహకారిగా’ ఇచ్చాడు. ఆమెతో మీరు గౌరవంగా, ప్రేమగా మెలగాలని ఆయన కోరుతున్నాడు. (ఆదికాండము 2:18) మీరు మీ ఇల్లాలిని ప్రేమించాలి. ఎంతమేరకు అనుకుంటున్నారా? మీ ఇష్టాయిష్టాల్ని పక్కన పెట్టి, తన ఇష్టానికి ప్రాధాన్యం ఇచ్చేంతగా!—ఎఫెసీయులు 5:25-29.
మీరు భార్యా? అలాగైతే, మీ భర్తను ప్రగాఢంగా గౌరవించాలని, మీ భర్త తన పాత్రను నిర్వర్తించడానికి మీరు చేయూతనివ్వాలని యెహోవా ఆశిస్తున్నాడు. (1 కొరింథీయులు 11:3; ఎఫెసీయులు 5:33) మీ భర్త నిర్ణయాలకు మద్దతునివ్వండి, ఆయనకు మనస్ఫూర్తిగా సహకరించండి. (కొలొస్సయులు 3:18) అలా చేస్తే మీ భర్త దృష్టిలో, యెహోవా దృష్టిలో మీరు అందంగా కనిపిస్తారు.—1 పేతురు 3:1-6.
మీరు ఏమి చేయవచ్చంటే . . .
-
మీరు ఇంకా మంచి భర్తగా లేదా భార్యగా ఉండడానికి ఏమి చేయాలో మీ జీవిత భాగస్వామినే అడగండి. తను చెప్పేది జాగ్రత్తగా వినండి, ఆ తర్వాత మీ శక్తిమేరకు ఆ దిశగా కృషి చేయండి
-
అయితే మీరు ఓపిక పట్టాలి. ఎందుకంటే, ఒకరినొకరు సంతోషపెట్టుకోవడం రావాలంటే మీ ఇద్దరికీ సమయం పడుతుంది
మీ జీవిత భాగస్వామి మనోభావాల్ని పట్టించుకోండి
బైబిలు ఏమి చెబుతోందంటే . . . మీ జీవిత భాగస్వామి ఇష్టాయిష్టాలను మీరు పట్టించుకోవాలి. (ఫిలిప్పీయులు 2:3, 4) తన సేవకులు ‘అందరితో సాధువుగా [“మృదువుగా,” NW]’ మెలగాలన్నది యెహోవా కోరిక అని గుర్తుంచుకొని, మీ జీవిత భాగస్వామి మీ దృష్టిలో విలువైన వ్యక్తి అని తనకు అనిపించేలా ప్రవర్తించండి. (2 తిమోతి 2:24) అనాలోచితంగా మాట్లాడే మాటలు ‘కత్తిపోట్లలా’ ఉంటాయి. అయితే “జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.” కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. (సామెతలు 12:18) దయగా, ప్రేమగా మాట్లాడడానికి యెహోవా ఆత్మ మీకు సహాయం చేస్తుంది. —గలతీయులు 5:22-24; కొలొస్సయులు 4:6.
మీరు ఏమి చేయవచ్చంటే . . .
-
మీ జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాలు చర్చించే ముందు ప్రశాంతంగా ఉండడానికి, తన అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని ఆలోచించేందుకు సుముఖంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థించండి
-
మీరు చెప్పబోయే విషయం గురించి, చెప్పే తీరు గురించి ఒకటికి పదిసార్లు ఆలోచించండి
ఒక జట్టుగా ఆలోచించండి
బైబిలు ఏమి చెబుతోందంటే . . . పెళ్లి చేసుకున్నప్పుడు మీరు, మీ జీవిత భాగస్వామి “ఏకశరీరము” అవుతారు. (మత్తయి 19:5) అయినా సరే, మీరిద్దరు వేర్వేరు వ్యక్తులు కాబట్టి మీ ఇద్దరికీ వేర్వేరు అభిప్రాయాలు ఉండే అవకాశం ఉంది. అందుకే మీరిద్దరు మీ ఆలోచనల్లో, మీ మనోభావాల్లో ఒకటవ్వడం నేర్చుకోవాలి. (ఫిలిప్పీయులు 2:2) మీరిద్దరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం. “ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును” అని బైబిలు చెబుతోంది. (సామెతలు 15:22) కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు బైబిలు సూత్రాల్ని మనసులో ఉంచుకోండి.—సామెతలు 8:32, 33.
మీరు ఏమి చేయవచ్చంటే . . .
-
మీ జీవిత భాగస్వామితో ఆయా విషయాల్ని చెప్పడం లేదా అభిప్రాయాల్ని వెలిబుచ్చడం ఇలాంటివే కాకుండా, మీ మనసులోని భావాల్ని కూడా పంచుకోండి
-
ఎవరికైనా మాటిచ్చేముందు, దేనికైనా ఒప్పుకునేముందు ఒకసారి మీ భాగస్వామితో మాట్లాడండి
a దేవుని పేరు యెహోవా అని బైబిలు చెబుతోంది.