9వ భాగం
యెహోవాను ఓ కుటుంబంగా ఆరాధించండి
‘ఆకాశాన్ని, భూమిని సృష్టించిన దేవుణ్ణే ఆరాధించండి.’—ప్రకటన 14:7, NW.
మీకు, మీ కుటుంబానికి ఉపయోగపడే సూత్రాలు ఎన్నో బైబిల్లో ఉన్నాయని మీరు ఈ బ్రోషురులో చూశారు. మీరు సంతోషంగా ఉండాలన్నదే యెహోవా అభిలాష. మీరు తన ఆరాధనకు ప్రథమస్థానం ఇస్తే, ఇతర అవసరాలు కూడా తీరుస్తానని ఆయన మాటిస్తున్నాడు. (మత్తయి 6:33) మీరు తన స్నేహితులు కావాలని ఆయన నిజంగా కోరుకుంటున్నాడు. దేవునితో స్నేహం చేయడానికి దొరికే ఏ అవకాశాన్నీ చేజార్చుకోకండి. దీనికి మించిన గొప్ప అవకాశం మనిషికి ఇంకొకటి ఉండదు. —మత్తయి 22:37, 38.
1 యెహోవాతో మీ బంధాన్ని పటిష్ఠపర్చుకోండి
బైబిలు ఏమి చెబుతోందంటే . . . ‘మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులుగా, కుమార్తెలుగా ఉంటారు అని ప్రభువు [“యెహోవా,” NW] చెబుతున్నాడు.’ (2 కొరింథీయులు 6:18) మీరు తనకు దగ్గరి స్నేహితులు కావాలని యెహోవా కోరుతున్నాడు. ఆయనకు స్నేహితులవ్వడానికి ఓ మార్గం ప్రార్థన. ‘ఎడతెగక ప్రార్థన చేయండి’ అని యెహోవా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. (1 థెస్సలొనీకయులు 5:15) మీ హృదయలోతుల్లో ఉన్న మనోభావాల్ని, మీ చింతల్ని వినాలని ఆయన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. (ఫిలిప్పీయులు 4:6) కుటుంబంతో కలిసి మీరు ప్రార్థిస్తే, దేవునితో మీకున్న స్నేహం ఎంత బలమైనదో వాళ్లకు తెలుస్తుంది.
మీరు దేవునితో మాట్లాడడం ఒక్కటే కాదు, ఆయన చెప్పేది కూడా మీరు వినాలి. ఆయన వాక్యాన్ని, బైబిలు ప్రచురణలను బాగా చదవడం ద్వారా మీరు ఆయన చెప్పేది వినవచ్చు. (కీర్తన 1:1, 2) మీరు నేర్చుకునే దాని గురించి లోతుగా ఆలోచించండి. (కీర్తన 77:11, 12) అయితే దేవుడు చెప్పేది వినాలంటే మనం ఇంకొకటి చేయాలి, క్రమంగా క్రైస్తవ కూటాలకు హాజరవ్వాలి.—కీర్తన 122:1-4.
యెహోవాతో మీ బంధాన్ని పటిష్ఠపర్చుకునే ముఖ్యమైన మార్గం మరొకటి ఉంది. అదేమిటంటే, ఆయన గురించి ఇతరులకు చెప్పడం. ఆ పని మీరు ఎంత ఎక్కువగా చేస్తే, ఆయనకు అంత ఎక్కువగా దగ్గరైనట్టు మీకు అనిపిస్తుంది.—మత్తయి 28:19, 20.
మీరు ఏమి చేయవచ్చంటే . . .
-
బైబిలు చదవడానికి, ప్రార్థించడానికి ప్రతీరోజు సమయం కేటాయించండి
-
కుటుంబంగా మీరందరూ వినోదం, ఆటవిడుపుల కన్నా ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వండి
2 మీ కుటుంబ ఆరాధనను ఆస్వాదించండి
బైబిలు ఏమి చెబుతోందంటే . . . “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.” (యాకోబు 4:8) మంచి పట్టిక వేసుకుని క్రమంగా కుటుంబ ఆరాధన జరుపుకోవాలి. (ఆదికాండము 18:19) అయితే అదొక్కటే సరిపోదు. దేవుడు మీ రోజువారీ జీవితంలో ఓ భాగం కావాలి. “నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును” దేవుని గురించి మాట్లాడుతూ ఆయనతో మీ కుటుంబ బంధాన్ని పటిష్ఠపర్చుకోండి. (ద్వితీయోపదేశకాండము 6:6, 7) యెహోషువ ఇలా అన్నాడు: “నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము.” మీరు ఆయనలా ఉండాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి.—యెహోషువ 24:15.
మీరు ఏమి చేయవచ్చంటే . . .
-
మీ కుటుంబంలో ప్రతీ ఒక్కరి అవసరాలను పరిగణనలోకి తీసుకుంటూ ఓ చక్కని శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోండి, దాన్ని క్రమంగా జరుపుకుంటూ ఉండండి