4వ అధ్యాయం
‘నువ్వు వెళ్లే చోటికే నేనూ వస్తాను’
1, 2. (ఎ) రూతు, నయోమిల ప్రయాణం గురించి వివరించండి. వాళ్లు ఎందుకు దుఃఖంలో ఉన్నారు? (బి) రూతు ప్రయాణానికి, నయోమి ప్రయాణానికి తేడా ఏమిటి?
రూతు నయోమితో కలిసి ఎత్తైన మోయాబు మైదానాల్లో నడుస్తోంది. గాలి హోరుగా వీచే సువిశాలమైన ఆ ప్రాంతంలో వాళ్లిద్దరూ చీమల్లా కనిపిస్తున్నారు. మండుటెండ నీరెండగా మారి, వాళ్ల నీడల పొడవు అంతకంతకూ పెరుగుతోంది. రూతు తన అత్త నయోమికేసి చూస్తూ ఆ రాత్రి ఎక్కడ తలదాచుకోవాలో ఆలోచిస్తోంది. అత్తంటే ఆమెకు వల్లమాలిన ప్రేమ. ఆమె కోసం సర్వస్వం ధారపోయడానికి సిద్ధంగా ఉంది.
2 దుఃఖంతో వాళ్లిద్దరి గుండెలూ బరువెక్కాయి. నయోమి భర్త చనిపోయి అప్పటికి చాలా సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు ఆమె దుఃఖానికి కారణం అది కాదు. ఇటీవలే ఆమె ఇద్దరు కుమారులు మహ్లోను, కిల్యోను చనిపోయారు. రూతు కూడా దుఃఖంలో ఉంది, ఎందుకంటే మహ్లోను ఆమె భర్త. రూతు, నయోమిల గమ్యస్థానం ఇశ్రాయేలులోని బేత్లెహేము పట్టణమే. అది నయోమి స్వదేశం, రూతుకు మాత్రం ఆ దేశం పూర్తిగా కొత్త. ఆమె తనవాళ్లను, తన దేశాన్ని, తన దేవుళ్లను, ఆచారాలన్నిటినీ పూర్తిగా వదిలేసి అక్కడకు వస్తోంది.—రూతు 1:3-6 చదవండి.
3. మనం ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటే రూతులా విశ్వాసం చూపించగలుగుతాం?
3 అంత పెద్ద మార్పులు చేసుకునేలా ఆ యువతిని కదిలించింది ఏమిటి? ఒక కొత్త జీవితం ఆరంభించడానికి, అత్త బాగోగులు చూసుకోవడానికి కావాల్సిన బలం ఆమెకు ఎక్కడనుండి వస్తుంది? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటే, మోయాబీయురాలైన రూతును ఆదర్శంగా తీసుకొని మనం ఎన్నో విషయాల్లో విశ్వాసం చూపించవచ్చని నేర్చుకుంటాం. (“ ఓ చిన్న కళాఖండం” అనే బాక్సు కూడా చూడండి.) ఎంతో దూరానవున్న బేత్లెహేముకు ఆ ఇద్దరు స్త్రీలు అసలు ఎందుకు వెళ్లాల్సివచ్చిందో ముందు పరిశీలిద్దాం.
కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన విషాదం
4, 5. (ఎ) నయోమి కుటుంబం మోయాబు దేశానికి ఎందుకు వలసవెళ్లింది? (బి) అక్కడ నయోమికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?
4 మృత సముద్రానికి తూర్పునవున్న మోయాబు అనే చిన్న దేశంలో రూతు పెరిగింది. ఆ దేశంలో చాలావరకు ఎత్తైన పీఠభూములు, అక్కడక్కడ చెట్లు, లోతైన లోయలు ఉండేవి. ఇశ్రాయేలు ప్రాంతం కరువు బారిన పడినప్పుడు కూడా ‘మోయాబు దేశంలో’ పంటలు బాగా పండేవి. మహ్లోనుతో, ఆయన కుటుంబంతో రూతుకు పరిచయం ఏర్పడడానికి కారణం కూడా అదే.—రూతు 1:1.
5 ఇశ్రాయేలులో కరువుభారం పెరగడంతో నయోమి భర్త ఎలీమెలెకు తన భార్యను, ఇద్దరు కుమారులను తీసుకొని మోయాబు దేశానికి వలసవెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇశ్రాయేలీయులు యెహోవా చెప్పిన పవిత్రస్థలంలో క్రమం తప్పకుండా ఆరాధించాలి. కానీ ఎలీమెలెకు కుటుంబం మోయాబు దేశానికి తరలివెళ్లింది కాబట్టి తమ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్లకు ఎన్నో అడ్డంకులు ఎదురైవుంటాయి. (ద్వితీ. 16:16, 17) అయితే, నయోమి విశ్వాసాన్ని సజీవంగా ఉంచుకుంది. అయినా, తన భర్త మరణం ఆమెను చాలా కృంగదీసింది.—రూతు 1:2, 3.
6, 7. (ఎ) తన ఇద్దరు కుమారులు మోయాబు స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు నయోమి ఎందుకు బాధపడివుంటుంది? (బి) నయోమి కోడళ్లను చూసుకున్న తీరు ఎందుకు ప్రశంసనీయం?
6 తన కుమారులు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నయోమి ఎంతో బాధపడివుంటుంది. (రూతు 1:4) తమ మూలపురుషుడు అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకు కోసం, యెహోవాను ఆరాధించే ప్రజల్లో నుండి ఒక అమ్మాయిని చూడడానికి ఎంతో శ్రమ తీసుకున్నాడని ఆమెకు తెలుసు. (ఆది. 24:3, 4) అన్యులను పెళ్లిచేసుకుంటే వాళ్లు దేవుని ప్రజలను విగ్రహారాధన వైపు తిప్పేసే ప్రమాదముంది కాబట్టి, వాళ్లతో వియ్యమందకూడదని ఆ తర్వాతి కాలాల్లో మోషే ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులను హెచ్చరించింది.—ద్వితీ. 7:3, 4.
7 అయినా మహ్లోను, కిల్యోనులు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. అందుకు నయోమి బాధపడిందో, నిరాశపడిందో మనకు సరిగ్గా తెలియదు కానీ, ఇద్దరు కోడళ్లనైతే ప్రేమగా చూసుకొనివుంటుంది. ఏదోకరోజు వాళ్లు కూడా తనలా యెహోవా ఆరాధకులు అవుతారని ఆమె ఎదురుచూసివుంటుంది. ఏదేమైనా రూతు, ఓర్పాలు కూడా అత్తకు బాగా దగ్గరయ్యారు. వాళ్ల జీవితాల్లో విషాదం చోటుచేసుకున్నప్పుడు, వాళ్ల మధ్యవున్న ఆ అనుబంధమే వాళ్ల మనసులకు సాంత్వననిచ్చింది. పిల్లలు పుట్టకముందే రూతు, ఓర్పా ఇద్దరూ విధవరాళ్లయ్యారు.—రూతు 1:5.
8. రూతు యెహోవాకు ఎలా దగ్గరైవుంటుంది?
8 ఆ విషాదాన్ని తట్టుకోవడానికి రూతుకు తన మత నేపథ్యం ఏమైనా సహాయం చేసిందా? చేసివుండకపోవచ్చు. మోయాబీయులు చాలా దేవుళ్లను ఆరాధించేవాళ్లు. వాళ్లలో ముఖ్యుడు కెమోషు. (సంఖ్యా. 21:29) పిల్లల్ని బలివ్వడం వంటి క్రూరాతిక్రూరమైన, భయంకరమైన ఆచారాలు ఆ రోజుల్లో సర్వసాధారణం కాబట్టి, మోయాబీయుల మతంలో కూడా అలాంటివి ఉండేవుంటాయి. ప్రేమ, కనికరం గల ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా గురించి రూతు తన భర్త దగ్గర లేదా అత్త దగ్గర ఎంతో కొంత నేర్చుకునేవుంటుంది. దాని ఆధారంగా, తమ దేవుళ్లకూ యెహోవాకూ ఉన్న తేడాను ఆమె గుర్తించివుంటుంది. యెహోవా ప్రేమగల పరిపాలకుడే గానీ క్రూరుడు కాదు. (ద్వితీయోపదేశకాండము 6:5 చదవండి.) భర్తను పోగొట్టుకున్న తర్వాత రూతు వృద్ధురాలైన నయోమికి ఇంకా దగ్గరైవుంటుంది. సర్వశక్తిగల యెహోవా దేవుని గురించి, ఆయన అద్భుత కార్యాల గురించి, ఆయన తన ప్రజలపట్ల ప్రేమతో, కనికరంతో వ్యవహరించిన తీరు గురించి అత్త చెబుతూవుంటే రూతు ఆసక్తిగా వినివుంటుంది.
9-11. (ఎ) నయోమి, రూతు, ఓర్పా ఏ నిర్ణయం తీసుకున్నారు? (బి) వాళ్ల జీవితాల్లో చోటుచేసుకున్న విషాద సంఘటనలను చూస్తే మనకు ఏమి తెలుస్తుంది?
9 స్వదేశం గురించిన కబురంటే నయోమికి ఎంతో ఆసక్తి. ఒకరోజు అటుగా వెళ్తున్న వర్తకుని ద్వారా, ఇశ్రాయేలు దేశంలో కరువు పోయిందన్న వార్త నయోమికి తెలిసింది. యెహోవా తన ప్రజల మీద అనుగ్రహం చూపించాడు. బేత్లెహేము (ఈ పదానికి, “రొట్టెల ఇల్లు” అని అర్థం.) తన పేరును మళ్లీ సార్థకం చేసుకుంటోంది. అందుకే, నయోమి స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకుంది.—రూతు 1:6.
10 మరి రూతు, ఓర్పాలు ఏమి చేశారు? (రూతు 1:7) అత్తలాగే భర్తలను పోగొట్టుకున్న కోడళ్లిద్దరూ ఆమెకు ఇంకా దగ్గరయ్యారు. అత్త దయాగుణానికి, యెహోవా మీద ఆమెకున్న అచంచల విశ్వాసానికి ముగ్ధురాలై కావచ్చు రూతు నయోమికి దగ్గరైంది. అందుకే ముగ్గురూ కలిసి యూదా దేశానికి పయనమయ్యారు.
11 మంచివాళ్లు, చెడ్డవాళ్లు, నిజాయితీపరులు అనే తేడా లేకుండా ఎవరి జీవితంలోనైనా విషాద సంఘటనలు చోటుచేసుకుంటాయని అనడానికి రూతు వృత్తాంతమే తార్కాణం. (ప్రసం. 9:2, 11) అయినవాళ్ల మరణం మనల్ని నిలువునా కృంగదీస్తున్నప్పుడు, సాటి మనుషుల దగ్గర ముఖ్యంగా యెహోవాను ఆశ్రయించిన నయోమిలాంటి వాళ్ల దగ్గర సాంత్వన, ఊరట పొందడం తెలివైన పనని అది చూపిస్తోంది.—సామె. 17:17.
రూతు విశ్వసనీయమైన ప్రేమ
12, 13. కోడళ్లిద్దర్నీ తమ స్వదేశానికి తిరిగివెళ్లమని నయోమి ఎందుకు చెప్పింది? మొదట్లో వాళ్లు ఎలా స్పందించారు?
12 ఆ ముగ్గురూ మోయాబు దేశం దాటి చాలాదూరం వచ్చేశారు. ఇప్పుడు నయోమిని మరో విషయం కలవరపెడుతోంది. తనతోపాటు నడుస్తున్న యౌవన కోడళ్లకేసి చూసింది. వాళ్లు తనను, తన కుమారులను ఎంత బాగా చూసుకున్నారో ఆమెకు గుర్తొచ్చింది. వాళ్ల మీద ఇంకా ఎక్కువ భారం పడుతుందేమోనన్న ఆలోచనే ఆమెను కలచివేస్తోంది. వాళ్లు తమ స్వదేశాన్ని వదిలేసి తనతో బేత్లెహేముకు వచ్చేస్తే, వాళ్ల కోసం అక్కడ తను ఏమి చేయగలదు?
13 నయోమి చివరకు విషయం చెప్పింది. “మీరు మీ తల్లుల యిండ్లకు తిరిగి వెళ్లుడి; చనిపోయిన వారి యెడలను నా యెడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ యెడల దయచూపునుగాక” అని వాళ్లతో అంది. యెహోవా ఆశీర్వాదంతో వాళ్ల జీవితాల్లోకి కొత్త వ్యక్తులు వస్తారనీ, కోడళ్లిద్దరూ మళ్లీ కొత్త జీవితం మొదలుపెడతారనీ ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. ‘ఆమె వాళ్లను ముద్దుపెట్టుకుంది. అప్పుడు వాళ్లు ఎలుగెత్తి ఏడ్చారు’ అని బైబిలు చెబుతోంది. దయాపరురాలు, నిస్వార్థపరురాలు అయిన అత్తకు రూతు, ఓర్పాలు ఎందుకంత చేరువయ్యారో మనం అర్థం చేసుకోవచ్చు. “నీ ప్రజలయొద్దకు నీతో కూడ వచ్చెదము” అని కోడళ్లిద్దరూ పట్టుబట్టారు.—రూతు 1:8-10.
14, 15. (ఎ) ఓర్పా ఎక్కడికి తిరిగివెళ్లిపోయింది? (బి) రూతుకు నయోమి ఎలా నచ్చజెప్పి చూసింది?
14 నయోమి అంత త్వరగా ఒప్పుకోలేదు. వాళ్లను ఆలోచింపజేసేలా మాట్లాడింది. పోషించడానికి తనకు భర్త లేడని, వాళ్లకు పెళ్లిళ్లు చేయడానికి తనకు కుమారులు లేరని అంటూ ఇశ్రాయేలు దేశంలో వాళ్లకు తను చేయగలిగిందేమీ లేదని నచ్చచెప్పింది. తన నిస్సహాయ స్థితి గురించి చెప్పుకొని బాధపడింది. నయోమి చెప్పాలనుకున్న దాన్ని ఓర్పా అర్థం చేసుకుంది. ఓర్పాకు మోయాబు దేశంలో ఉన్న వాళ్ల అమ్మ, పుట్టిల్లు గుర్తొచ్చాయి. ఒక్కసారిగా తనవాళ్లందరూ కళ్లముందు మెదిలారు. స్వదేశానికి వెళ్లిపోవడమే సబబని ఆమెకు అనిపించింది. బరువెక్కిన గుండెతో ఓర్పా అత్తను ముద్దుపెట్టుకొని ఇంటిముఖం పట్టింది.—రూతు 1:11-14.
15 మరి రూతు ఏమి చేసింది? నయోమి మాటలు ఆమెకూ వర్తిస్తాయి. కానీ “రూతు ఆమెను హత్తుకొనెను” అని బైబిలు చెబుతోంది. నయోమి కోడలితో ఇలా అంది: “చూడమ్మా! నీ తోడికోడలు తన సొంతవారి దగ్గరకు, వారి దేవుళ్ల దగ్గరకు తిరిగి వెళ్లిపోయినది. నీవుకూడా అలానే చేయి.” (రూతు 1:15, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) నయోమి మాటల్లో ఒక ముఖ్యమైన విషయం స్ఫురిస్తోంది. ఓర్పా తిరిగివెళ్లింది తన ప్రజల దగ్గరికి మాత్రమే కాదు, “వారి దేవుళ్ల” దగ్గరకు కూడా. కెమోషు, మరితర అబద్ధ దేవుళ్ల ఆరాధకురాలిగా ఉండిపోతే చాలని ఆమె అనుకుంది. రూతు కూడా అలాగే అనుకుందా?
16-18. (ఎ) రూతు ప్రేమ విశ్వసనీయమైనదని ఎలా చెప్పవచ్చు? (బి) ఈ విషయంలో రూతు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (ఆ ఇద్దరు స్త్రీల చిత్రాలు కూడా చూడండి.)
16 ఇప్పుడు ఆ దారిలో వాళ్లిద్దరే ఉన్నారు. రూతు ఒకసారి అలా నయోమికేసి చూసింది. రూతు నిర్ణయం ఆమె మనసులో స్పష్టంగా ఉంది. ఆమె మనసంతా ఒక్కసారిగా నయోమి మీద, నయోమి సేవిస్తున్న దేవుని మీద ప్రేమతో ఉప్పొంగిపోయింది. ఆమె అత్తతో ఇలా అంది: “నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు; నీవు మృతి బొందుచోటను నేను మృతిబొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక.”—రూతు 1:16, 17.
17 ఆ మాటలు ఎంత శక్తిమంతమైనవంటే, ఆమె చనిపోయి 3,000 సంవత్సరాలైనా అవి ఇంకా అందరి నోళ్లలో నానుతూనే ఉన్నాయి. ఆ మాటల్లో, విశ్వసనీయమైన ప్రేమ అనే చక్కని లక్షణం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. నయోమి మీద రూతుకున్న ప్రేమ ఎంత బలమైనది, విశ్వసనీయమైనది అంటే నయోమి ఎక్కడికి వెళ్లినా రూతు ఆమెతోనే ఉండాలనుకుంది. మరణం తప్ప ఏదీ వాళ్లను విడదీయలేదు! మోయాబీయుల దేవుళ్లతో సహా అక్కడ తనకు సంబంధించిన వాటన్నిటినీ వదిలేయడానికి రూతు సిద్ధపడింది. కాబట్టి, ఇప్పుడు నయోమి ప్రజలే ఆమె సొంత ప్రజలౌతారు. నయోమి దేవుడైన యెహోవానే తానూ ఆరాధించాలని కోరుకుంటున్నట్లు రూతు మనస్ఫూర్తిగా చెప్పింది, ఈ విషయంలో ఓర్పాకు, రూతుకు చాలా తేడా ఉంది. a
18 ఇప్పుడు రూతు, నయోమిలు ఇద్దరే మళ్లీ నడక ప్రారంభించారు. బేత్లెహేము ఇంకా చాలా దూరంలో ఉంది. ఒక అంచనా ప్రకారం, అక్కడికి చేరుకోవడానికి వాళ్లకు వారం రోజులు పట్టివుంటుంది. వాళ్లిద్దరూ ఎంతో మనోవేదనతో బాధపడుతున్నా, ఒకరిని చూసి ఒకరు కొంత ధైర్యం తెచ్చుకొనివుంటారు.
19. రూతును ఆదర్శంగా తీసుకొని కుటుంబంలో, స్నేహితుల మీద, సంఘంలో విశ్వసనీయమైన ప్రేమను ఎలా చూపించవచ్చని మీకు అనిపిస్తోంది?
19 ఈ లోకంలో బాధలకు కొదువే లేదు. “మహాకష్టమైన సమయాలు” అని బైబిలు అంటున్న నేటి కాలంలో మనం ఎన్నో కోల్పోతుంటాం, ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తుంటాం. (2 తిమో. 3:1, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) అందుకే, రూతుకున్న విశ్వసనీయమైన ప్రేమ అనే లక్షణం మన కాలంలో ఎంతో అవసరం. అది ఉంటే, కష్టాలు ఉప్పెనలా ముంచెత్తినా అవతలివాళ్లను కడదాకా ప్రేమిస్తాం, వాళ్లను ఎప్పటికీ విడిచిపెట్టం. అంధకారంలో కూరుకుపోతున్న ఈ లోకంలో దానివల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆలుమగల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్య, క్రైస్తవ సంఘ సభ్యుల మధ్య ఉండాల్సిన విశిష్ట లక్షణమది. (1 యోహాను 4:7, 8, 20 చదవండి.) మనం అలాంటి ప్రేమను అలవర్చుకుంటే రూతును ఆదర్శంగా తీసుకున్నట్లే.
బేత్లెహేములో రూతు, నయోమి
20-22. (ఎ) మోయాబు దేశంలో ఉండి వచ్చిన తర్వాత నయోమిలో ఎలాంటి మార్పు వచ్చింది? (బి) తన బాధలకు కారణం ఎవరని ఆమె పొరబడింది? (యాకోబు 1:13 కూడా చూడండి.)
20 విశ్వసనీయమైన ప్రేమ చూపించడం మాటల్లో చెప్పినంత సులువు కాదు. ఒక్క నయోమి మీదే కాదు, తను ఆరాధించాలనుకున్న యెహోవా దేవుని మీద కూడా విశ్వసనీయమైన ప్రేమ చూపించే అవకాశం రూతుకు దొరికింది.
21 యెరూషలేముకు దక్షిణాన దాదాపు 10 కి.మీ. దూరంలో ఉన్న బేత్లెహేముకు వాళ్లిద్దరు చేరుకున్నారు. ఈ చిన్న పట్టణంలో ఒకప్పుడు నయోమివాళ్ల కుటుంబానికి మంచి పేరు ఉండివుంటుంది. అందుకే, ఆమె తిరిగివచ్చిందన్న వార్త ఆ ప్రాంతమంతా దావానలంలా వ్యాపించింది. అక్కడి స్త్రీలు నయోమిని పరిశీలనగా చూసి ‘ఈమె నయోమినే కదా!’ అన్నారు. మోయాబు దేశంలో ఉండి వచ్చిన తర్వాత, ఆమె రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అంతకాలం తను పడిన బాధలు, వేదన ఆమెలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.—రూతు 1:19.
22 ఆ బంధువురాళ్ల ముందు, ఒకప్పుడు తన ఇంటిపక్కన ఉన్నవాళ్ల ముందు నయోమి తన గోడు వెళ్లబోసుకుంది. తనను నయోమి (మధురము) అనవద్దని, మారా (చేదు) అనమని వాళ్లతో అంది. పాపం నయోమి! అంతకుముందు జీవించిన యోబులాగే ఆమె కూడా తన బాధలకు కారణం యెహోవా దేవుడే అనుకుంది.—రూతు 1:20, 21; యోబు 2:10; 13:24-26.
23. రూతు ఏ ఆలోచనలో పడింది? మోషే ధర్మశాస్త్రంలో పేదవాళ్ల కోసం ఎలాంటి ఏర్పాటు ఉండేది? (అధస్సూచి కూడా చూడండి.)
23 ఆ ఇద్దరు స్త్రీలు బేత్లెహేములో జీవితానికి మెల్లమెల్లగా అలవాటుపడ్డారు. రూతు ఇప్పుడు, తమ బాగోగులను చక్కగా చూసుకోవడం ఎలాగనే ఆలోచనలో పడింది. యెహోవా తన ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో, పేదవాళ్ల కోసం ప్రేమతో చేసిన ఒక ఏర్పాటు ఉందని ఆమె విన్నది. అదేమిటంటే, కోత సమయంలో పేదలు పొలాల్లో కోతకోసేవాళ్ల వెనకే వెళ్తూ, వాళ్లు వదిలేసిన పరిగెను ఏరుకోవచ్చు, పొలాల అంచుల్లో, మూలల్లో పెరిగిన వాటిని కోసుకోవచ్చు. b—లేవీ. 19:9, 10; ద్వితీ. 24:19-21.
24, 25. రూతు బోయజు పొలాన్ని చూసినప్పుడు ఏమి చేసింది? పరిగె ఏరుకునే పని ఎలా ఉండేది?
24 అది యవల కోత సమయం. మన క్యాలెండర్ ప్రకారం బహుశా అది ఏప్రిల్ నెల అయ్యుంటుంది. పరిగె ఏరుకోవడానికి ఎవరు అనుమతిస్తారో కనుక్కోవడానికి రూతు బయలుదేరింది. ఆమెకు బోయజు అనే ధనిక భూస్వామి పొలం కనిపించింది. ఆయన ఎవరో కాదు నయోమి భర్త ఎలీమెలెకు బంధువు. ధర్మశాస్త్రం ప్రకారం పరిగె ఏరుకునే హక్కుంది కదా అనుకుంటూ రూతు నేరుగా పొలంలోకి వెళ్లిపోలేదు, అక్కడి పనిని చూసుకుంటున్న యువకుని అనుమతి కోరింది. అనుమతి దొరకగానే పరిగె ఏరుకోవడం మొదలుపెట్టింది.—రూతు 1:22–2:3, 7.
25 ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. రూతు, కోత కోసేవాళ్ల వెనకే వెళ్తోంది. వాళ్లు యవల పంటను కొడవలితో కోస్తున్నారు. రూతు వంగి కిందపడిన, విడిచిపెట్టిన పరిగె ఏరుకొని పనలను కట్ట కట్టి నూర్చడానికి ఒక చోట పెట్టింది. అది ఎంతో అలసటతో, ఓపికతో కూడుకున్న పని. పొద్దెక్కే కొద్దీ పని ఇంకా కష్టంగా తయారైంది. అయినా సరే, రూతు అలా పనిచేస్తూనే ఉంది. మధ్యమధ్యలో చమట తుడుచుకోవడానికి, మధ్యాహ్నం భోజనం చేయడానికి మాత్రమే కాసేపు ఆగింది.
26, 27. బోయజు ఎలాంటివాడు? ఆయన రూతును ఎలా చూసుకున్నాడు?
26 ఇతరులు తనను గమనిస్తారనో, గమనించాలనో రూతు అనుకొనివుండదు. అయినా ఆమె ఇతరుల కళ్లల్లో పడింది. బోయజు రూతును చూసి, అక్కడి పనిని చూసుకుంటున్న యువకుని దగ్గర ఆమె గురించి వాకబు చేశాడు. బోయజు మంచి విశ్వాసంగల వ్యక్తి. తన దగ్గర పనిచేసే రోజువారీ కూలీలను, ఆఖరికి పరదేశులను కూడా, “యెహోవా మీకు తోడై యుండునుగాక” అని పలకరించాడు. వాళ్లు కూడా ఆయనను అలాగే పలకరించారు. బోయజు వయసు పైబడినవాడు, యెహోవా పట్ల ప్రేమగలవాడు. అందుకే ఒక తండ్రిలా రూతు గురించి శ్రద్ధ తీసుకున్నాడు.—రూతు 2:4-7.
27 బోయజు రూతును, “నా కుమారీ” అంటూ, పరిగె ఏరుకోవడానికి తన పొలానికే వస్తూ ఉండమన్నాడు. అక్కడ పని చేసే కుర్రాళ్లు రూతును ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి, పనికత్తెలతోనే ఉండమని ఆమెతో చెప్పాడు. మధ్యాహ్నం ఆమె తినడానికి ఏర్పాటు కూడా చేశాడు. (రూతు 2:8, 9, 14 చదవండి.) అదీగాక ఆమెను మెచ్చుకున్నాడు, ప్రోత్సహించాడు. ఎలా?
28, 29. (ఎ) రూతు ఎలాంటి పేరు తెచ్చుకుంది? (బి) రూతులా యెహోవా రెక్కల చాటున ఆశ్రయం పొందడానికి మీరు ఏమి చేయవచ్చు?
28 అన్యురాలైన తనమీద ఎందుకంత దయ చూపిస్తున్నారని రూతు బోయజును అడిగింది. అత్త కోసం రూతు చేసినదంతా తాను విన్నానని ఆయన అన్నాడు. బేత్లెహేము స్త్రీలతో నయోమి తన ముద్దుల కోడలు రూతు గురించి గొప్పగా చెప్పివుంటుంది. ఆ మాటలు ఆ నోటా ఈ నోటా పడి బోయజు దాకా చేరాయి. రూతు యెహోవా ఆరాధకురాలు అయ్యిందని కూడా బోయజుకు తెలుసు. అందుకే ఆయనిలా అన్నాడు: “యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును.”—రూతు 2:12.
29 ఆ మాటలు రూతును ఎంతో ప్రోత్సహించివుంటాయి. అవును, పక్షి పిల్ల తన తల్లి రెక్కల చాటున సురక్షితంగా ఉన్నట్లే, రూతు యెహోవా రెక్కల చాటున సురక్షితంగా ఉండాలనుకుంది. మాటలతో ధైర్యాన్నిచ్చినందుకు బోయజుకు కృతజ్ఞతలు తెలిపింది. పొద్దుగ్రుంకే వరకు ఆమె నిర్విరామంగా పనిచేస్తూనే ఉంది.—రూతు 2:13, 17.
30, 31. పని అలవాట్లు, కృతజ్ఞతా స్ఫూర్తి, విశ్వసనీయమైన ప్రేమ గురించి రూతు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
30 ఆర్థిక ఇబ్బందులు ఎక్కువౌతున్న ఈ రోజుల్లో, విశ్వాసంతో రూతు చేసిన పనులు మనందరికీ స్ఫూర్తిదాయకం. తాను ఓ విధవరాలు కాబట్టి తనకు సహాయం చేయాల్సిన బాధ్యత ఇతరులకు ఉందని ఆమె అనుకోలేదు. అందుకే, ఇతరులు ఏ కాస్త సాయం అందించినా సంతోషంగా స్వాగతించింది. తాను ప్రేమించే మనిషిని చూసుకోవడానికి రోజంతా చెమటోడ్చి పనిచేసింది, అది తక్కువ స్థాయి పనే అయినా అస్సలు సిగ్గుపడలేదు. పని విషయంలో జాగ్రత్తలు, పనిస్థలంలో స్నేహాల గురించిన మంచి సలహాలను ఆమె మనస్ఫూర్తిగా స్వీకరించి పాటించింది. అవన్నీ ఒక ఎత్తయితే, తన సంరక్షకుడైన యెహోవా తండ్రే తన నిజమైన ఆశ్రయమని ఆమె ఎన్నడూ మరచిపోలేదు.
31 మనం రూతులా విశ్వసనీయమైన ప్రేమను, వినయాన్ని, కష్టపడే తత్వాన్ని, కృతజ్ఞతా స్ఫూర్తిని చూపిస్తే మన విశ్వాసం కూడా ఇతరులకు స్ఫూర్తిదాయకం అవుతుంది. ఇంతకీ రూతు, నయోమిలను యెహోవా ఎలా సంరక్షించాడు? దీని గురించి మనం తర్వాతి అధ్యాయంలో చర్చిస్తాం.
a చాలామంది అన్యులు, “దేవుడు” అనే సాధారణ బిరుదును మాత్రమే ఉపయోగించేవాళ్లు, కానీ రూతు “యెహోవా” అనే పేరును కూడా ఉపయోగించిందని గమనించాలి. “ఆ అన్యురాలు సత్యదేవుణ్ణి ఆరాధించేదని రచయిత అలా నొక్కి చెబుతున్నాడు” అని ది ఇంటర్‌ప్రెటర్స్ బైబిల్ వ్యాఖ్యానించింది.
b ఆ నియమం ఎంతో విశేషమైనది. మోయాబు దేశంలో అలాంటి నియమం ఉండివుండకపోవచ్చు. ప్రాచీన సమీప ప్రాచ్య దేశాల్లో విధవరాళ్ల పరిస్థితి దుర్భరంగా ఉండేది. ఒక రెఫరెన్సు గ్రంథం ఇలా చెబుతోంది: “భర్త చనిపోయిన తర్వాత ఒక స్త్రీ సాధారణంగా తన పిల్లల మీద ఆధారపడాలి; పిల్లలు లేకపోతే బానిసగా అమ్ముడుపోవాల్సి వచ్చేది, వ్యభిచార వృత్తిలోకి దిగాల్సి వచ్చేది, లేదా చావే శరణ్యమయ్యేది.”