నేను మంచి స్నేహితుల్ని ఎలా సంపాదించుకోవచ్చు?
అధ్యాయం 8
నేను మంచి స్నేహితుల్ని ఎలా సంపాదించుకోవచ్చు?
“నాకు కోపం వచ్చినప్పుడు, దాన్ని కక్కేయడానికి ఎవరో ఒకరు కావాలి. నాకు బాధగా ఉన్నప్పుడు, నన్ను ఓదార్చడానికి ఎవరో ఒకరు కావాలి. నాకు సంతోషంగా ఉన్నప్పుడు, దాన్ని పంచుకోవడానికి ఎవరో ఒకరు కావాలి. నా వరకైతే, ఫ్రెండ్స్ చాలాచాలా అవసరం.”—బ్రిటనీ.
చిన్నపిల్లలకు అవసరమయ్యే ఫ్రెండ్స్ వేరు, టీనేజర్లకు అవసరమయ్యే ఫ్రెండ్స్ వేరు.
చిన్నపిల్లలకైతే కేవలం ఆడుకోవడానికి ఎవరో ఒకరు ఉంటే చాలు.
కానీ టీనేజర్లకు మాత్రం నిజంగా సహాయం చేసి మద్దతిచ్చే ఫ్రెండ్ కావాలి.
అంతేకాదు, బైబిలు ఇలా చెప్తుంది: “నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, కష్టకాలంలో అతను సహోదరుడిలా ఉంటాడు.” (సామెతలు 17:17) ఇక్కడ వర్ణించిన స్నేహం, బహుశా ఆడుకునే వయసులో దొరికిన స్నేహం లాంటిది కాదు, అంతకన్నా బలమైనది!
నిజం: పెద్దయ్యేకొద్దీ, మీకు ఎలాంటి స్నేహితులు ఉండాలంటే ...
1. వాళ్లకు మంచి లక్షణాలు ఉండాలి.
2. వాళ్ల ప్రవర్తన బాగుండాలి.
3. వాళ్లు మీమీద మంచి ప్రభావం చూపించాలి.
ప్రశ్న: అలాంటి ఫ్రెండ్స్ ఎక్కడ దొరుకుతారు? ఆ మూడు విషయాల్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.
స్నేహానికి కావాల్సినవి #1—మంచి లక్షణాలు
మీరేం తెలుసుకోవాలి? ఫ్రెండ్ అని చెప్పుకునే ప్రతీఒక్కరు నిజమైన ఫ్రెండ్ కాదు. బైబిలు ఇలా చెప్తుంది: “ఒకరినొకరు నాశనం చేసుకోవాలని చూసే సహవాసులు ఉన్నారు.” (సామెతలు 18:24) అది వింతగా అనిపించవచ్చు. కానీ ఆలోచించండి: ఎవరైనా “ఫ్రెండ్” మిమ్మల్ని వాడుకున్నారా? మీ వెనకే మీ గురించి తప్పుగా మాట్లాడారా? లేదా మీ గురించి పుకార్లు పుట్టించారా? అలా జరిగినప్పుడు, మీకు ఫ్రెండ్స్ మీద నమ్మకం పోవచ్చు. a కానీ ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అనేదాని కన్నా మంచి ఫ్రెండ్స్ ఉన్నారా లేదా అనేదే ప్రాముఖ్యం!
మీరేం చేయవచ్చు? ఎవర్ని చూస్తే, ‘అబ్బా! వీళ్లలా ఉండాలి’ అని అనిపిస్తుందో వాళ్లను ఫ్రెండ్స్‌గా ఎంచుకోండి.
“మా ఫ్రెండ్ ఫియోనా గురించి అందరూ మంచిగా మాట్లాడతారు. నా గురించి కూడా అందరూ అలాగే మాట్లాడుకోవాలని నా కోరిక. నాకు తనంటే ఇష్టం. నాకు తనలా ఉండాలనిపిస్తుంది.”—ఇవెట్, 17.
ఇలా చేసి చూడండి.
1. గలతీయులు 5:22, 23 చదవండి.
2. ఇలా ప్రశ్నించుకోండి: ‘ఇక్కడ చెప్పిన “పవిత్రశక్తి ... పుట్టించే లక్షణాలు” ఏవైనా నా ఫ్రెండ్స్‌కి ఉన్నాయా?’
3. కింద మీ బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు రాసుకోండి. ప్రతీ పేరు పక్కన, ఆ పేరు వినగానే వాళ్లలో మీకు గుర్తొచ్చే లక్షణం రాయండి.
పేరు
..................
లక్షణం
..................
సలహా: ఒకవేళ మీకు వాళ్లలో చెడు లక్షణాలు మాత్రమే గుర్తొస్తున్నాయంటే, మీ ఫ్రెండ్స్‌ని మార్చేయడం మంచిదేమో!
స్నేహానికి కావాల్సినవి #2—ప్రవర్తన బాగుండాలి
మీరేం తెలుసుకోవాలి? అసలు స్నేహితులే లేకపోవడం కన్నా ఎవరో ఒకరు ఉంటే మంచిది అని మీరు అనుకుంటే గనుక, చెడ్డ స్నేహితుల్ని ఎంచుకునే ప్రమాదముంది. బైబిలు ఇలా చెప్తుంది: “మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు.” (సామెతలు 13:20) ఇక్కడ “మూర్ఖులు” అంటున్నప్పుడు తక్కువ మార్కులు వచ్చేవాళ్లో, తెలివితక్కువవాళ్లో అని అర్థంకాదు. బదులుగా మంచి సలహాను వినకుండా, చెడు పనులు చేయడానికే నిర్ణయించుకునేవాళ్లు అని అర్థం. అలాంటి ఫ్రెండ్స్ మీకు అక్కర్లేదు!
మీరేం చేయవచ్చు? ఎవరితోపడితే వాళ్లతో స్నేహం చేసే బదులు, ఫ్రెండ్స్‌ని జాగ్రత్తగా ఎంచుకోండి. (కీర్తన 26:4) అంటే దానర్థం, పక్షపాతం చూపించమని కాదు. “నీతిమంతునికి, దుష్టునికి; దేవుణ్ణి సేవిస్తున్న వ్యక్తికి, సేవించని వ్యక్తికి మధ్య తేడాను” మీరు గుర్తించగలగాలి.—మలాకీ 3:18.
“నా వయసువాళ్లలో దేవుణ్ణి నిజంగా ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్లతో స్నేహం చేయడానికి మా మమ్మీడాడీ నాకు సహాయం చేశారు. వాళ్లకు చాలా థాంక్స్.”—క్రిస్టఫర్, 13.
ఈ ప్రశ్నలకు జవాబు రాయండి:
నా ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు, వాళ్లు నాచేత ఏదైనా తప్పు చేయిస్తారేమో అని నేను భయపడుతున్నానా?
□ అవును
□ కాదు
నా ఫ్రెండ్స్ మా మమ్మీడాడీకి నచ్చరేమో అని వాళ్లను పరిచయం చేయడానికి వెనకాడుతున్నానా?
□ అవును
□ కాదు
సలహా: ఒకవేళ పైప్రశ్నలకు మీ జవాబు అవును అయితే, మంచి ప్రవర్తన ఉండి దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్న ఫ్రెండ్స్ కోసం వెదకండి.
స్నేహానికి కావాల్సినవి #3—మంచి ప్రభావం
మీరేం తెలుసుకోవాలి? బైబిలు ఇలా చెప్తుంది: “చెడు సహవాసం మంచి ప్రవర్తనను చెడగొడుతుంది.” (1 కొరింథీయులు 15:33, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) లారెన్ అనే అమ్మాయి ఇలా అంటుంది: “మా స్కూల్లో నా తోటివాళ్లు చెప్పేదల్లా చేస్తేనే వాళ్లు నన్ను కలుపుకునేవాళ్లు. నాకు ఒంటరిగా అనిపించేది కాబట్టి, వాళ్లలో కలిసిపోవడం కోసం వాళ్లకు నచ్చినట్టు ఉందాంలే అనుకున్నాను.” తర్వాత లారెన్‌కి అర్థమైంది ఏంటంటే, వేరేవాళ్లు చెప్పిన దానికల్లా తలాడిస్తే, మన పరిస్థితి చెస్‌బోర్డు మీద పాన్‌లాగే ఉంటుంది. వాళ్లు వాళ్లకు నచ్చినట్టు మనల్ని ఆడిస్తారు. మీకు అలాంటి స్నేహితులు అవసరమా?
మీరేం చేయవచ్చు? మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని తమలా మారిపోవాలని ఒత్తిడి చేస్తుంటే, అలాంటివాళ్లతో స్నేహం తెంచేసుకోండి. దానివల్ల మీకు స్నేహితులు తగ్గిపోతారేమో గానీ, మీ గురించి మీకు మంచిగా అనిపిస్తుంది. అలాగే మీమీద చక్కని ప్రభావం చూపించే మంచి స్నేహితులు మీకు దొరుకుతారు.—రోమీయులు 12:2.
“నా బెస్ట్ ఫ్రెండ్ క్లింట్ మంచి నిర్ణయాలు తీసుకుంటాడు, వేరేవాళ్ల ఫీలింగ్స్‌ని పట్టించుకుంటాడు. అందుకే తనతో ఉంటే నాకు బాగా అనిపిస్తుంది.”—జేసన్, 21.
ఈ ప్రశ్నలు వేసుకోండి:
కేవలం నా ఫ్రెండ్స్‌ని సంతోషపెట్టడం కోసం నేను పిచ్చిబట్టలు వేసుకుంటున్నానా, తప్పుగా మాట్లాడుతున్నానా, లేదా చెడుగా ప్రవర్తిస్తున్నానా?
□ అవును
□ కాదు
ఫ్రెండ్స్ కోసం, వాళ్ల సంతోషం కోసం నేను వెళ్లకూడని చోట్లకు కూడా వెళ్తున్నానా?
□ అవును
□ కాదు
సలహా: ఒకవేళ పైప్రశ్నలకు మీ జవాబు అవును అయితే, మీ మమ్మీడాడీని గానీ అనుభవం ఉన్న ఎవరైనా పెద్దవాళ్లను గానీ సలహా అడగండి. మీరు ఒక యెహోవాసాక్షి అయితే, సంఘ పెద్దతో మాట్లాడి, మీమీద మంచి ప్రభావం చూపించే ఫ్రెండ్స్‌ని ఎంచుకోవడానికి సహాయం చేయమని అడగవచ్చు.
[అధస్సూచి]
a నిజమే, అందరం తప్పులు చేస్తాం. (రోమీయులు 3:23) కాబట్టి మీ ఫ్రెండ్ మిమ్మల్ని బాధపెట్టినా, తర్వాత మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగితే, “ప్రేమ చాలా పాపాల్ని కప్పుతుంది” అని గుర్తుంచుకోండి.—1 పేతురు 4:8.
ముఖ్య వచనం
“సహోదరుడి కన్నా ఎక్కువగా ప్రేమించే స్నేహితుడు కూడా ఉన్నాడు.”—సామెతలు 18:24.
టిప్
సరైనది చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు, మీలాగే సరైనది చేయడానికి కృషిచేస్తున్న వాళ్లు మీకు దొరకవచ్చు. అలాంటివాళ్లు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు!
మీకు తెలుసా . . . ?
దేవునికి పక్షపాతం లేదు, కానీ తన “గుడారంలో ఎవరు అతిథిగా” ఉండాలో ఆయన చాలా జాగ్రత్తగా ఎంచుకుంటాడు.—కీర్తన 15:1-5.
నేనిలా చేస్తాను!
మంచి స్నేహితుల్ని సంపాదించుకోవడానికి, నేను ........
నాకంటే వయసులో పెద్దవాళ్లయిన వీళ్లతో నేను పరిచయం పెంచుకోవాలని అనుకుంటున్నాను ........
ఈ విషయం గురించి నేను మా మమ్మీడాడీని ఏం అడగాలనుకుంటున్నాను అంటే ........
మీకు ఏమనిపిస్తుంది?
● మీ ఫ్రెండ్‌లో ఏ లక్షణాలు ఉంటే మీరు ఇష్టపడతారు? ఎందుకు?
● మీరు మంచి ఫ్రెండ్‌గా ఉండడానికి ఏ లక్షణాల్ని అలవర్చుకోవాలి?
[బ్లర్బ్]
“‘నన్ను కొంతమంది ఫ్రెండ్స్‌కి దూరంగా ఉండమని మా మమ్మీడాడీ చెప్పినప్పుడు, నాకు ఆ ఫ్రెండ్స్ చాలా నచ్చారు, వాళ్లు తప్ప ఇంకెవరున్నారు అని నాలో నేను అనుకున్నాను. కానీ మా మమ్మీడాడీ ఇచ్చిన సలహా గురించి ఆలోచించినప్పుడు, నా కళ్లు తెరుచుకున్నాయి. మంచి స్నేహితులు ఇంకా చాలామంది ఉన్నారని నేను అర్థం చేసుకున్నాను.”—కోల్
[బాక్సు]
ఈ చిట్కాలు పాటించి చూడండి
మీ మమ్మీడాడీని వాళ్ల ఫ్రెండ్స్ గురించి అడగండి. మీ వయసులో ఉన్నప్పుడు వాళ్లకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉండేవాళ్లో అడగండి. అలాంటి ఫ్రెండ్స్‌ని ఎంచుకున్నందుకు వాళ్లు ఎప్పుడైనా బాధపడ్డారా? ఒకవేళ బాధపడివుంటే, ఎందుకు? వాళ్లు చేసిన తప్పులే మీరు ఎలా చేయకుండా ఉండవచ్చో వాళ్లను అడగండి.
మీ ఫ్రెండ్స్‌ని మీ మమ్మీడాడీకి పరిచయం చేయండి. ఒకవేళ అలా పరిచయం చేయడానికి మీరు ఇబ్బంది పడుతుంటే, ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను ఎందుకు వెనకాడుతున్నాను?’ ఒకవేళ మీ ఫ్రెండ్స్ మీ మమ్మీడాడీకి నచ్చరేమో అని మీరు భయపడుతున్నారా? అలాగైతే, మీరు ఇంకాస్త జాగ్రత్తగా ఫ్రెండ్స్‌ని ఎంచుకోవాలని అర్థం.
మీ ఫ్రెండ్స్ చెప్పేది శ్రద్ధగా వినండి. మీ ఫ్రెండ్స్ బాగోగుల విషయంలో శ్రద్ధ చూపించండి, అలాగే వాళ్ల ఫీలింగ్స్‌ని పట్టించుకోండి.—ఫిలిప్పీయులు 2:4.
క్షమించండి. వాళ్లు ఏ తప్పు చేయకుండా పర్ఫెక్ట్‌గా ఉండాలని అనుకోకండి. “మనందరం తరచూ పొరపాట్లు చేస్తుంటాం.”—యాకోబు 3:2.
మీ ఫ్రెండ్‌కి కాస్త ఫ్రీ టైం వదలండి. మీరెప్పుడూ మీ ఫ్రెండ్‌నే అతుక్కొని ఉండనక్కర్లేదు. ఎందుకంటే, నిజమైన స్నేహితులు మీకు అవసరమైనప్పుడు తోడుంటారు.—ప్రసంగి 4:9, 10.
[చిత్రం]
వేరేవాళ్లు చెప్పిన దానికల్లా తలాడిస్తే, మన పరిస్థితి చెస్‌బోర్డు మీద పాన్‌లాగే ఉంటుంది. వాళ్లు వాళ్లకు నచ్చినట్టు మనల్ని ఆడిస్తారు