అధ్యాయం 24
ఏదీ ‘మనల్ని దేవుని ప్రేమనుండి ఎడబాపలేదు’
1.కొంతమంది నిజ క్రైస్తవులతో సహా చాలామందిని ఎలాంటి ప్రతికూల భావాలు బాధిస్తుంటాయి?
యెహోవా వ్యక్తిగతంగా మిమ్మల్ని ప్రేమిస్తాడా? యోహాను 3:16 చెబుతున్నట్లుగా దేవుడు మానవాళిని ప్రేమిస్తాడని కొందరు అంగీకరిస్తారు. కానీ వారు నిజానికి ‘దేవుడు నన్ను ప్రత్యేకంగా ఒక వ్యక్తిగా ఎన్నడూ ప్రేమించలేడు’ అని భావిస్తారు. ఆ విషయానికొస్తే నిజ క్రైస్తవులకు సైతం అప్పుడప్పుడు అలాంటి సందేహాలు రావచ్చు. నిరుత్సాహపడి ఓ వ్యక్తి ఇలా అన్నాడు: ‘నా విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకుంటాడని నమ్మడం నాకు చాలా కష్టంగా ఉంది.’ అలాంటి సందేహాలే కొన్నిసార్లు మిమ్మల్నీ వేధిస్తాయా?
2, 3.మనం యెహోవా దృష్టిలో విలువలేని వారమని, ప్రేమార్హులము కాదని భావించాలని ఎవరు కోరుకొంటున్నారు, అలాంటి భావాలను మనమెలా అధిగమించవచ్చు?
2 యెహోవా దేవుడు మనలను ప్రేమించడనీ, విలువైనవారిగా ఎంచడనీ మనలను నమ్మించాలని సాతాను తీవ్రవాంఛతో ఉన్నాడు. ప్రజలు తమ గురించి తాము స్వాతిశయంగా, అహంభావంగా భావించేలా చేయడం ద్వారా సాతాను తరచూ వారిని మోసగిస్తాడన్నది నిజం. (2 కొరింథీయులు 11:3) కానీ దుర్భలుల ఆత్మాభిమానాన్ని అణగద్రొక్కడంలో కూడా అతడు ఆనందిస్తాడు. (యోహాను 7:47-49; 8:13, 44) ప్రత్యేకించి ఈ “అంత్యదినములలో” అతడలా చేస్తున్నాడన్నది వాస్తవం. నేడు చాలామంది సహజ ‘అనురాగంలేని’ కుటుంబాల్లో పెరిగి పెద్దవుతున్నారు. మరి కొందరు క్రూరులను, స్వార్థపరులను, మూర్ఖులను నిరంతరం ఎదుర్కొంటున్నారు. (2 తిమోతి 3:1-5) అనేక సంవత్సరాలపాటు దుర్వ్యవహారానికి, జాత్యహంకారానికి, ద్వేషానికి గురైనవారు తాము విలువలేనివారమని లేదా ప్రేమార్హులం కాదని భావిస్తుండవచ్చు.
3 మీలో అలాంటి ప్రతికూల భావాలున్నట్లు మీకు అనిపిస్తే నిరాశచెందకండి. మనలో చాలామందిమి అప్పుడప్పుడు మనల్ని మనమే అకారణంగా నిందించుకుంటూ ఉంటాము. కానీ దేవుని వాక్యం “తప్పు దిద్దుటకును,” ‘దుర్గములను పడద్రోయడానికి’ రూపించబడిందని గుర్తుంచుకోండి. (2 తిమోతి 3:16; 2 కొరింథీయులు 10:4) బైబిలు ఇలా చెబుతోంది: “దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆ యా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము.” (1 యోహాను 3:19) యెహోవా ప్రేమ గురించి ‘మన హృదయములను సమ్మతి పరచుకోవడానికి’ లేఖనాలు మనకు సహాయంచేసే నాలుగు విధానాలను మనం పరిశీలిద్దాం.
యెహోవా మిమ్మల్ని విలువైనవారిగా పరిగణిస్తాడు
4, 5.యెహోవా దృష్టిలో మనం విలువైనవారమేనని యేసు ఉపమానమెలా చూపిస్తోంది?
4 మొదటిది, తన సేవకుల్లో ప్రతీ ఒక్కరిని దేవుడు విలువైనవారిగా చూస్తాడని బైబిలు సూటిగా బోధిస్తోంది. ఉదాహరణకు, యేసు ఇలా చెప్పాడు: “రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలనుపడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.” (మత్తయి 10:29-31) యేసు మొదటి శతాబ్దపు శ్రోతలకు ఆ మాటల భావమేమిటో పరిశీలించండి.
5 ఎవరైనా పిచ్చుకను ఎందుకు కొంటారని మనం ఆశ్చర్యపోవచ్చు. కానీ యేసు కాలంలో ఆహారం కోసం అమ్మబడే పక్షుల్లో పిచ్చుక కారుచౌకగా అమ్మబడేది. అల్పవిలువగల కాసుకు రెండు పిచ్చుకలు లభించేవని గమనించండి. అయితే ఆ వ్యక్తి రెండు కాసులు వెచ్చించడానికి సిద్ధపడితే అతనికి నాలుగు కాదు ఐదు పిచ్చుకలు లభించేవని యేసు ఆ తర్వాత అన్నాడు. అదనంగా ఇవ్వబడే పిచ్చుకకు విలువే లేదన్నట్లుగా ఇవ్వబడేది. బహుశా అలాంటి ప్రాణులు మనుష్యుల దృష్టిలో విలువలేనివిగా ఉండవచ్చు, కానీ సృష్టికర్త వాటినెలా దృష్టించాడు? యేసు ఇలా అన్నాడు: “వాటిలో ఒకటైనను [అదనంగా ఇవ్వబడేది కూడా] దేవునియెదుట మరువబడదు.” (లూకా 12:6, 7) ఇప్పుడు యేసు మాటల భావాన్ని మనం చూడనారంభించవచ్చు. ఒక పిచ్చుకకే యెహోవా అంత విలువిస్తే, మరి మానవుడెంత విలువైనవాడో గదా! యేసు వివరించినట్లుగా, మన గురించి యెహోవాకు సర్వం తెలుసు. అంతెందుకు, మన తల వెంట్రుకలు సైతం లెక్కించబడ్డాయి.
6.మన తల వెంట్రుకలు సైతం లెక్కించబడ్డాయని చెప్పినప్పుడు యేసు వాస్తవమే చెబుతున్నాడని మనమెందుకు ఖచ్చితంగా నమ్మవచ్చు?
6 మన వెంట్రుకలు లెక్కించబడ్డాయా? యేసు ఈ విషయంలో అవాస్తవికంగా ఉన్నాడని కొందరు అనుకోవచ్చు. కానీ పునరుత్థాన నిరీక్షణ గురించి ఒక్కసారి ఆలోచించండి. మనల్ని పునఃసృష్టించడానికి యెహోవా మన గురించి ఎంత క్షుణ్ణంగా తెలుసుకొనివుండాలో కదా! ఆయన మనల్నెంత విలువైనవారిగా పరిగణిస్తాడంటే, సంశ్లిష్టమైన మన జన్యు నియమావళి, మన అనేక సంవత్సరాల జ్ఞాపకాలు, అనుభవాలతోసహా ప్రతీ విషయాన్ని ఆయన గుర్తుంచుకుంటాడు. a దీంతో పోలిస్తే మన వెంట్రుకలను లెక్కించడం చాలా స్వల్పం, మనిషి తలపై సగటున దాదాపు 1,00,000 వెంట్రుకలుంటాయి.
యెహోవా మనలో ఏమి చూస్తాడు?
7, 8.(ఎ)మానవ హృదయాలను పరిశోధించినప్పుడు యెహోవా చూసి సంతోషించే కొన్ని లక్షణాలు ఏవి? (బి) యెహోవా విలువైనవిగా పరిగణించేవాటిలో మనం చేయగల కొన్ని పనులు ఏవి?
7 రెండవది, యెహోవా తన సేవకుల్లో విలువైనదిగా పరిగణించేది ఏమిటో బైబిలు మనకు బోధిస్తోంది. సరళంగా చెప్పాలంటే, మన మంచి లక్షణాలను, మనం చేసే ప్రయత్నాలను చూసి ఆయన ఆనందిస్తాడు. దావీదు రాజు తన కుమారుడైన సొలొమోనుకు ఇలా చెప్పాడు: “యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు.” (1 దినవృత్తాంతములు 28:9) ఈ ద్వేషభరిత, హింసాయుత లోకంలో శతకోట్ల మానవ హృదయాలను యెహోవా పరిశోధిస్తుండగా, సమాధానాన్ని, సత్యాన్ని, నీతిని ప్రేమించే హృదయం తారసపడినప్పుడు ఆయనెంత సంతోషిస్తాడో గదా! యెహోవాపట్ల నిండు ప్రేమతో ఆయన గురించి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ పరిజ్ఞానాన్ని ఇతరులతో పంచుకొంటున్న హృదయాన్ని ఆయన చూసినప్పుడు ఏమి జరుగుతుంది? తన గురించి ఇతరులకు చెప్పేవారిని తాను గుర్తుంచుకుంటానని యెహోవా మనకు సెలవిస్తున్నాడు. “యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము” సైతం ఆయన దగ్గరుంది. (మలాకీ 3:16) అలాంటి లక్షణాలు ఆయనకు ప్రశస్తమైనవి.
8 యెహోవా విలువైనవిగా పరిగణించే కొన్ని మంచి లక్షణాలు ఏవి? ఆయన కుమారుడైన యేసుక్రీస్తును అనుకరించడానికి మనం చేసే కృషి నిశ్చయంగా అందులో ఒకటి. (1 పేతురు 2:21) దేవుడు విలువైనవని పరిగణించే వాటిలో తన రాజ్య సువార్త ప్రకటించడం ఒక ప్రాముఖ్యమైన పని. రోమీయులు 10:15లో మనమిలా చదువుతాం: “సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి.” మన పాదాలు ‘సుందరంగా’ లేదా అందంగా ఉన్నట్లు మనం సాధారణంగా ఆలోచించము. కానీ అవి సువార్త ప్రకటించడానికి యెహోవా సేవకులుచేసే ప్రయత్నాలకు ప్రతీకగా ఉన్నాయి. అలాంటి ప్రయత్నాలన్నీ ఆయన కన్నులకు అందమైనవీ, ప్రశస్తమైనవే.—మత్తయి 24:14; 28:19, 20.
9, 10.(ఎ)వివిధ కష్టాల్లో సైతం మనం చూపే సహనాన్ని యెహోవా విలువైనదిగా పరిగణిస్తాడని మనమెందుకు హామీతో ఉండవచ్చు? (బి) యెహోవా తన నమ్మకమైన సేవకుల గురించి ఎలాంటి ప్రతికూల భావాలను ఎప్పటికీ లెక్కలోకి తీసుకోడు?
9 యెహోవా మన సహనాన్ని కూడా విలువైనదిగా పరిగణిస్తాడు. (మత్తయి 24:13) యెహోవాకు మీరు వెన్నుచూపాలన్నదే సాతాను కోరిక అని గుర్తుంచుకోండి. యెహోవాపట్ల మీరు యథార్థంగావున్న ప్రతీ రోజు సాతాను నిందలకు జవాబివ్వడానికి ఆయనకు మీరు సహాయం చేసిన మరో రోజుగా ఉంటుంది. (సామెతలు 27:11) కొన్నిసార్లు సహనం అంత సులభం కాదు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళన, ఇతర అడ్డంకులు గడిచే ప్రతీ రోజును ఒక పరీక్షగా చేయవచ్చు. కోరుకున్నవి లభించకపోవడం నిరుత్సాహపరిచేదిగా ఉండవచ్చు. (సామెతలు 13:12) అలాంటి సవాళ్ల మధ్య చూపే సహనం యెహోవాకు ప్రశస్తమైనది. అందుకే దావీదు రాజు తన కన్నీటిని “బుడ్డిలో” దాచమని యెహోవాను అడుగుతూ నమ్మకంగా ఇలా అన్నాడు, “అవి నీ కవిలెలో కనబడును గదా?” (కీర్తన 56:8) అవును, యెహోవాపట్ల మన విశ్వాస్యతను కాపాడుకోవడంలో మనం సహించే కన్నీటిని, బాధనంతటినీ ఆయన విలువైనవిగా ఎంచుతూ, వాటిని గుర్తుంచుకుంటాడు. అవి కూడా ఆయన దృష్టికి ప్రశస్తమైనవే.
పరీక్షలు ఎదురైనప్పుడు మనం చూపే సహనాన్ని యెహోవా విలువైనదిగా పరిగణిస్తాడు
10 అయితే స్వీయ నిందారోపక హృదయం దేవుని దృష్టికి మనం విలువైన వారమనే రుజువును నిరోధించవచ్చు. ‘నాకంటే ఆదర్శవంతమైన వారు చాలామంది ఉన్నారు. నన్ను వారితో పోల్చి చూసినప్పుడు యెహోవా ఎంత నిరుత్సాహపడతాడో!’ అని అది ఎప్పుడూ సొదపెడుతుండవచ్చు. యెహోవా అలా పోల్చిచూడడు; అంతేకాదు ఆయన తన ఆలోచనలో కఠినంగా లేదా నిష్ఠూరంగా ఉండడు. (గలతీయులు 6:4) ఆయన అతి సూక్ష్మంగా మన హృదయాలను చదివి, అందులోవున్న చీమ తలకాయంత మంచిని ఆయన విలువైనదిగా పరిగణిస్తాడు.
యెహోవా చెడునుండి మంచిని వేరు చేస్తాడు
11.అబీయా విషయంలో యెహోవా వ్యవహరించిన తీరునుబట్టి ఆయన గురించి మనమేమి నేర్చుకోవచ్చు?
11 మూడవది, యెహోవా మనలను పరిశోధిస్తున్నప్పుడు ఆయన జాగ్రత్తగా మంచిని వేరుచేసి చూస్తాడు. ఉదాహరణకు, యరొబాము మతభ్రష్ట రాజవంశాన్నంతటినీ నిర్మూలించాలని యెహోవా ఆజ్ఞాపించినప్పుడు, రాజు కుమారుల్లో ఒకడైన అబీయాను మాత్రమే గౌరవప్రదంగా సమాధిచేయాలని ఆయన ఆదేశించాడు. ఎందుకు? “యెహోవా యరొబాము సంబంధులలో ఇతనియందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొనెను.” (1 రాజులు 14:1, 10-13) నిజానికి, యెహోవా ఆ పిల్లవాని హృదయాన్ని పరిశోధించి అతనిలో ‘అనుకూలమైన దాన్ని కనుగొన్నాడు.’ ఆ మంచిదేదో ఎంత చిన్నదైనా లేక స్వల్పమైనదైనా దానిని తన వాక్యంలో పేర్కొనదగినంత విలువైనదిగా యెహోవా చూశాడు. మతభ్రష్ట కుటుంబంలో ఆ ఒక్క వ్యక్తిపట్ల సముచితమైనంత మేరకు కనికరం చూపిస్తూ ఆయన తగిన ప్రతిఫలం కూడా ఇచ్చాడు.
12, 13.(ఎ)మనం పాపం చేసినప్పుడు సైతం యెహోవా మనలో మంచికోసమే చూస్తాడని యెహోషాపాతు రాజు విషయం ఎలా చూపిస్తోంది? (బి) మన సత్క్రియలు, మంచి లక్షణాల విషయానికొచ్చినప్పుడు, యెహోవా ప్రేమగల తండ్రిగా ఎలా ప్రవర్తిస్తాడు?
12 మరింత విశేషమైన ఉదాహరణను మంచివాడైన యెహోషాపాతు రాజు విషయంలో చూడవచ్చు. ఆ రాజు ఒకానొక తెలివితక్కువ పనిచేసినప్పుడు, యెహోవా ప్రవక్త అతనితో ఇలా చెప్పాడు: “యెహోవా సన్నిధినుండి కోపము నీమీదికి వచ్చును.” అదెంత గంభీరమైన విషయమో గదా! అయితే యెహోవా సందేశం అంతటితో ఆగిపోలేదు. అది ఇంకా ఇలావుంది: “అయితే . . . నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి.” (2 దినవృత్తాంతములు 19:1-3) కాబట్టి యెహోవా నీతియుక్తమైన ఆగ్రహం యెహోషాపాతులోని మంచిని చూడకుండా మరుగుచేయలేదు. అపరిపూర్ణ మానవులకు అదెంత భిన్నమో గదా! ఇతరులనుబట్టి మనం కలతచెందినప్పుడు వారిలో మంచిని మనం చూడలేకపోవచ్చు. మనం పాపం చేసినప్పుడు కలిగే నిరుత్సాహం, సిగ్గు, అపరాధ భావాలవల్ల మనలోని మంచి మనకు మరుగైపోవచ్చు. అయితే మన పాపాల విషయమై పశ్చాత్తాపపడి వాటిని తిరిగి చేయకుండా ఉండడానికి మనం కృషిచేస్తే యెహోవా మనలను క్షమిస్తాడని మరచిపోకండి.
13 యెహోవా మిమ్మల్ని పరిశోధిస్తున్నప్పుడు గనిలో బంగారం తవ్వుతున్న వ్యక్తి పనికిరాని రాళ్లను పక్కకు నెట్టేసినట్లుగా ఆయన మీలోని పాపాలను ప్రక్కకు నెట్టివేస్తాడు. మీ సద్గుణాలు, మంచిపనుల సంగతేమిటి? అవును, ఆ “బంగారు ముద్దలనే” ఆయన దగ్గరుంచుకుంటాడు. ప్రేమగల తల్లిదండ్రులు తమ పిల్లలు వేసిన బొమ్మలను లేదా వారి పాఠశాల ప్రాజెక్టులను పిల్లలు మరచిపోయిన తర్వాత కూడా కొన్నిసార్లైతే దశాబ్దాలపాటు దాచిపెట్టుకోవడం మీరెప్పుడైనా గమనించారా? యెహోవా అత్యంత ప్రేమగల తండ్రి. మనమాయనకు నమ్మకంగా ఉన్నంతకాలం, ఆయన మన సత్క్రియలను, మంచి లక్షణాలను ఎన్నడూ మరచిపోడు. నిజానికి, వాటిని మరచిపోవడాన్ని ఆయన అన్యాయంగా దృష్టిస్తాడు, ఆయనెన్నడూ అన్యాయస్థునిగా ఉండడు. (హెబ్రీయులు 6:10) ఆయన మరోవిధంగా కూడా మనలను పరిశోధిస్తాడు.
14, 15.(ఎ)మన అపరిపూర్ణతలు మనలోని మంచిని యెహోవా చూడకుండా ఎందుకు ఎన్నటికీ మరుగు చేయలేవు? ఉదహరించండి. (బి) యెహోవా మనలో చూసే సద్గుణాలతో ఏమి చేస్తాడు, నమ్మకస్థులైన తన ప్రజలను ఆయనెలా దృష్టిస్తాడు?
14 యెహోవా మన అపరిపూర్ణతల కంటే మనలో ఉన్న కార్యసాధక శక్తినే ఎక్కువగా చూస్తాడు. స్పష్టంగా చెప్పాలంటే, కళాభిమానులు బాగా పాడైపోయిన వర్ణచిత్రాలను ఇతర కళాఖండాలను పునరుద్ధరించడానికి ఎంత ప్రయత్నమైనా చేస్తారు. ఉదాహరణకు, ఇంగ్లాండులోని లండన్‌లో ఒక నేషనల్ గ్యాలరీలో 3 కోట్ల డాలర్ల విలువగల, లియోనార్డో డా విన్సీ వేసిన ఒక చిత్రాన్ని ఎవరో తుపాకితో కాల్చడంతో ఆ చిత్రం పాడైపోయింది కాబట్టి దాన్ని తీసివేయండని ఎవరూ సూచించలేదు. దాదాపు 500 సంవత్సరాల పురాతనమైన కళాఖండాన్ని పునరుద్ధరించడానికి వెంటనే పని ప్రారంభమైంది. ఎందుకు? ఎందుకంటే కళాభిమానుల దృష్టిలో అది అమూల్యమైనది. మరి కేవలం సుద్దతో, బొగ్గుతో గీసిన ఒక చిత్రంకంటే మీరు ఎంతో విలువైనవారు కాదా? వారసత్వంగా వచ్చిన అపరిపూర్ణత కారణంగా మీకెంత చెరుపు జరిగినా దేవుని దృష్టిలో మీరు నిస్సందేహంగా అమూల్యమైన వారే. (కీర్తన 72:12-14) నైపుణ్యతగల మానవ కుటుంబ సృష్టికర్తయైన యెహోవా దేవుడు, తన ప్రేమగల శ్రద్ధకు ప్రతిస్పందించే వారందరినీ పరిపూర్ణతకు పునరుద్ధరించడానికి అవసరమైనదంతా చేస్తాడు.—అపొస్తలుల కార్యములు 3:21; రోమీయులు 8:20-22.
15 అవును, మనలో మనం చూసుకోలేని మంచిని యెహోవా మనలో చూస్తాడు. మనమాయన సేవ చేస్తుండగా, చివరకు మనం పరిపూర్ణతకు ఎదిగేవరకు ఆయన ఆ మంచి వృద్ధయ్యేలా చేస్తాడు. సాతాను లోకం మనలను ఎలా చూసినప్పటికీ, యెహోవా తన సేవకులను ప్రియమైన వారిగా పరిగణిస్తాడు.—హగ్గయి 2:7.
యెహోవా తన ప్రేమను కార్యరూపంలో ప్రదర్శిస్తాడు
16.మనపట్ల యెహోవాకున్న ప్రేమకు అతిగొప్ప రుజువేమిటి, ఇది మనకు వ్యక్తిగతంగా ఇవ్వబడుతున్న బహుమానమని మనకెలా తెలుసు?
16 నాల్గవది, మనపట్ల తన ప్రేమను నిరూపించుకోవడానికి యెహోవా ఎంతో చేశాడు. మనం విలువలేనివారమనే లేదా ప్రేమార్హులం కాదనే సాతాను అబద్ధానికి క్రీస్తు విమోచన క్రయధన బలి నిశ్చయంగా అతి ఘాటైన జవాబు. యేసు హింసా కొయ్యపై అనుభవించిన వేదనకరమైన మరణం, అంతకంటే ఎక్కువగా యెహోవా తన ప్రియ కుమారుని మరణం చూసి పొందిన వ్యధ, మనపట్ల వారికున్న ప్రేమకు రుజువని మనమెన్నడూ మరచిపోకూడదు. విచారకరంగా, చాలామంది ఇది తమ కోసం ఇవ్వబడిన వ్యక్తిగత బహుమానమని నమ్మడాన్ని కష్టంగా భావిస్తారు. తాము అందుకు అనర్హులమని భావిస్తారు. అయితే అపొస్తలుడైన పౌలు క్రీస్తు అనుచరుల హింసకునిగా ఉండేవాడనే సంగతి మరచిపోకూడదు. అయినప్పటికీ ఆయనిలా వ్రాశాడు: ‘దేవుని కుమారుడు నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొన్నాడు.’—గలతీయులు 1:13; 2:20.
17.యెహోవా వేటి మూలంగా మనలను తనవైపు తన కుమారునివైపు ఆకర్షిస్తున్నాడు?
17 క్రీసు బలి ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవడానికి ఒక్కొక్కరికి సహాయపడడం ద్వారా యెహోవా మనపట్ల తనకు ఉన్న ప్రేమను రుజువుచేస్తున్నాడు. యేసు ఇలా అన్నాడు: “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు.” (యోహాను 6:44) అవును, యెహోవా మనలను వ్యక్తిగతంగా తన కుమారుని దగ్గరకు, నిత్యజీవ నిరీక్షణా దిశకు ఆకర్షిస్తున్నాడు. ఎలా? వ్యక్తిగతంగా మనదగ్గరకు వచ్చే ప్రకటనా పని ద్వారా, మనకు పరిమితులు, అపరిపూర్ణతలు ఉన్నప్పటికీ మనం ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించి అన్వయించుకోవడానికి మనకు సహాయం చేసేందుకు తానుపయోగిస్తున్న తన పరిశుద్ధాత్మ ద్వారా యెహోవా మనలను ఆకర్షిస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయుల విషయంలో చెప్పినట్లుగానే యెహోవా మన విషయంలోనూ ఇలా చెప్పగలడు: “శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.”—యిర్మీయా 31:3.
18, 19.(ఎ)యెహోవా మనపట్ల తన ప్రేమను ఎలాంటి అత్యంత సన్నిహిత విధానంలో ప్రదర్శిస్తున్నాడు, దీని గురించి ఆయన వ్యక్తిగతంగా తానే శ్రద్ధవహిస్తాడని ఏది చూపిస్తోంది? (బి) యెహోవా తదనుభూతితో వింటాడని దేవుని వాక్యం మనకెలా హామీ ఇస్తోంది?
18 బహుశా ప్రార్థన ఆధిక్యత ద్వారా మనం అత్యంత సన్నిహితంగా యెహోవా ప్రేమను అనుభవిస్తాము. దేవునికి “యెడతెగక ప్రార్థనచేయుడి” అని మనలో ప్రతీ ఒక్కరిని బైబిలు ఆహ్వానిస్తోంది. (1 థెస్సలొనీకయులు 5:17) ఆయన వింటాడు. ఆయన “ప్రార్థన ఆలకించువా[డు]” అని కూడా పిలువబడ్డాడు. (కీర్తన 65:2) ఆయన ఈ పని వేరే ఎవ్వరికీ, తన సొంత కుమారునికి కూడా అప్పగించలేదు. ఒక్కసారి ఆలోచించండి: ప్రార్థనద్వారా తనను ధైర్యంగా సమీపించమని విశ్వ సృష్టికర్తే మనకు ఉద్బోధిస్తున్నాడు. ఆలకించడంలో ఆయన ఎలాంటి వాడు? ఉదాసీనంగా, ఉద్వేగరహితంగా, పట్టింపులేనివానిగా ఉంటాడా? అలా ఎంతమాత్రమూ ఉండడు.
19 యెహోవా తదనుభూతిగలవాడు. తదనుభూతి అంటే ఏమిటి? నమ్మకమైన ఒక వృద్ధ క్రైస్తవుడు ఇలా చెప్పాడు: “తదనుభూతి అంటే మీ వేదనను నా హృదయంలో అనుభవించడం.” మన బాధ ద్వారా యెహోవా నిజంగా ప్రభావితుడవుతాడా? ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయుల బాధల గురించి మనమిలా చదువుతాము: “వారి యావద్బాధలో ఆయన బాధనొందెను.” (యెషయా 63:9) యెహోవా వారి ఇక్కట్లను కేవలం చూడడమే కాదు; ఆయన ఆ ప్రజలపట్ల తదనుభూతి కలిగివున్నాడు. యెహోవా ఎంత తీవ్రంగా బాధపడతాడనేది, ఆయన తన సేవకులతో పలికిన ఈ మాటల్లో స్పష్టమవుతుంది: ‘మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు.’ b (జెకర్యా 2:8) అదెంత బాధ కలిగిస్తుందో గదా! అవును, యెహోవా మన కోసం బాధపడతాడు. మనకు బాధ కలిగితే ఆయన కూడా బాధపడతాడు.
20.రోమీయులు 12:3లో కనబడే ఉపదేశానికి మనం లోబడాలంటే సమతుల్యంలేని ఎలాంటి ఆలోచనను మనం విసర్జించాలి?
20 మానసిక సమతుల్యతగల ఏ క్రైస్తవుడూ దేవునికి తన ప్రజలపట్ల ఉన్న ప్రేమకు, ఉన్నతాభిప్రాయానికి రుజువును గర్వం లేదా అహంకారం కలిగివుండడానికి ఒక సాకుగా ఉపయోగించడు. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “తన్ను తాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, తాను స్వస్థబుద్ధిగల వాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.” (రోమీయులు 12:3) ఇదే వచనాన్ని మరో అనువాదమిలా చెబుతోంది: “మిమ్మల్ని గురించి మీరు ఉన్నదాని కంటే గొప్పగా భావించకండి. సక్రమంగా ఉండి . . . మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి.” (ఈజీ-టు-రీడ్ వర్షన్) కాబట్టి మన పరలోక తండ్రి ప్రేమలో మనం సంపూర్ణ ఆప్యాయతను అనుభవిస్తూ, స్వస్థబుద్ధి కలిగివుండి మనం మన కృషి ఫలితంగా దేవుని ప్రేమను సంపాదించుకోలేమనీ, అందుకు అర్హులం కాదనీ గుర్తుంచుకుందాం.—లూకా 17:10.
21.మనం ఎలాంటి సాతాను సంబంధ అబద్ధాలను నిరంతరం అడ్డుకోవాలి, మనం ఎలాంటి బైబిలు సత్యంతో మన హృదయాలను ఎల్లప్పుడూ భద్రంగా ఉంచుకోవాలి?
21 మనం విలువలేనివారమనే లేదా ప్రేమకు అర్హులం కాదనే అబద్ధంతోపాటు, సాతాను అబద్ధాలన్నింటిని తిప్పికొట్టడానికి మనలో ప్రతీ ఒక్కరం శక్తివంచన లేకుండా కృషిచేద్దాం. మిమ్మల్ని మీరు దేవుని అపార ప్రేమకు సైతం లొంగని అతి కష్టమైన సమస్యగా దృష్టించుకోవాలని, లేదా మీ మంచి పనులు సర్వం చూడగల ఆయన దృష్టికి ఏ మాత్రం కనబడనంత సూక్ష్మంగా ఉన్నాయని లేదా మీ పాపాలు తన కుమారుని మరణం కూడా కప్పలేనంత విస్తారంగా ఉన్నాయని మీ జీవితానుభవాలు మీకు నేర్పించివుంటే మీకు అబద్ధమే బోధించబడింది. హృదయపూర్వకంగా అలాంటి అబద్ధాలను పక్కకు నెట్టివేయండి. పౌలు ప్రేరేపిత మాటల్లో వ్యక్తం చేయబడిన ఈ సత్యంతో మన హృదయాలను ఎల్లప్పుడూ భద్రంగా ఉంచుకుందాం: “మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.”—రోమీయులు 8:38.
a బైబిలు పునరుత్థాన నిరీక్షణను పదేపదే యెహోవా జ్ఞాపకశక్తితో ముడిపెడుతోంది. నమ్మకస్థుడైన యోబు యెహోవాతో ఇలా అన్నాడు: ‘నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరుచున్నాను.’ (యోబు 14:13) ‘జ్ఞాపకార్థ సమాధుల్లో’ ఉన్నవారందరి పునరుత్థానం గురించి యేసు మాట్లాడాడు. అది సముచితమే, ఎందుకంటే యెహోవా తాను పునరుత్థానం చేయనుద్దేశించిన మృతులను సంపూర్ణంగా జ్ఞాపకముంచుకుంటాడు.—యోహాను 5:28, 29, NW.
b ఇక్కడ కొన్ని భాషాంతరాలు, దేవుని ప్రజలను ముట్టినవాడు దేవుని కనుగుడ్డు కాదుగానీ తన సొంత కనుగుడ్డును లేదా ఇశ్రాయేలీయుల కనుగుడ్డును ముట్టినవాడనే భావాన్నిస్తున్నాయి. ఈ వాక్యభాగం అసంబద్ధమని తలంచిన కొందరు శాస్త్రులు ఈ తప్పును ప్రవేశపెట్టి తదనుగుణంగా సవరించారు. పొరపాటున వారుచేసిన ప్రయత్నం యెహోవా వ్యక్తిగత తదనుభూతి తీవ్రతను మరుగుచేసింది.