అపొస్తలుల కార్యాలు 3:1-26
3 ఒకరోజు ప్రార్థన సమయమప్పుడు అంటే దాదాపు మధ్యాహ్నం మూడింటికి* పేతురు, యోహాను ఆలయానికి వెళ్తున్నారు.
2 అదే సమయంలో, పుట్టినప్పటి నుండి కుంటివాడిగా ఉన్న ఒక వ్యక్తిని కొంతమంది మోసుకెళ్తున్నారు. అతను ఆలయానికి వచ్చేవాళ్ల దగ్గర డబ్బులు అడుక్కునేలా, వాళ్లు అతన్ని ప్రతీరోజు ఆలయంలో సౌందర్యం అనే ద్వారం దగ్గర ఉంచేవాళ్లు.
3 అతను ఆలయంలోకి వెళ్లబోతున్న పేతురును, యోహానును చూసినప్పుడు, వాళ్లను డబ్బులు అడగడం మొదలుపెట్టాడు.
4 అప్పుడు పేతురు, యోహాను అతని వైపు సూటిగా చూశారు. పేతురు అతనితో, “మా వైపు చూడు” అన్నాడు.
5 కాబట్టి అతను వాళ్ల దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అనే ఆశతో వాళ్ల వైపే చూస్తూ ఉన్నాడు.
6 అయితే పేతురు, “వెండిబంగారాలు నా దగ్గర లేవు కానీ నా దగ్గర ఏది ఉందో అదే నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు పేరున చెప్తున్నాను, లేచి నడువు!” అన్నాడు.
7 ఆ మాట చెప్పి పేతురు అతని కుడిచెయ్యి పట్టుకొని పైకి లేపాడు. వెంటనే అతని పాదాలకు, చీలమండలకు బలం వచ్చింది.+
8 అతను వెంటనే లేచి, నడుస్తూ గెంతుతూ+ దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్లతోపాటు ఆలయంలోకి వెళ్లాడు.
9 అతను నడవడం, దేవుణ్ణి స్తుతించడం అక్కడున్న వాళ్లంతా చూశారు.
10 డబ్బులు అడుక్కోవడానికి ఆలయంలో సౌందర్య ద్వారం దగ్గర కూర్చునే వ్యక్తి అతనే అని వాళ్లు గుర్తుపట్టారు. అతనికి జరిగింది చూసి వాళ్లు ఎంతో ఆశ్చర్యంలో, సంతోషంలో మునిగిపోయారు.
11 అతను పేతురు యోహానుల చేతులు పట్టుకొని ఉండగానే, సొలొమోను మంటపంలో ఉన్న వీళ్ల దగ్గరికి+ ప్రజలందరూ ఎంతో ఆశ్చర్యంతో పరుగెత్తుకుంటూ వచ్చారు.
12 అది చూసి పేతురు వాళ్లతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలారా, దీని గురించి మీరెందుకు ఇంతగా ఆశ్చర్యపోతున్నారు? మేమేదో మా సొంత శక్తితోనో, దైవభక్తితోనో అతన్ని నడిచేలా చేసినట్టు ఎందుకు మా వైపు ఇలా కళ్లార్పకుండా చూస్తున్నారు?
13 మన పూర్వీకుల దేవుడు, అంటే అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు+ తన సేవకుడైన+ యేసును మహిమపర్చాడు.+ ఆ యేసును మీరు అప్పగించారు. పిలాతు ఆయన్ని విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినా మీరు ఆయన్ని వద్దనుకున్నారు.
14 అవును, పవిత్రుడూ నీతిమంతుడూ అయిన ఆయన్ని మీరు వద్దనుకున్నారు. బదులుగా నరహంతకుడైన ఒక వ్యక్తిని మీ కోసం విడుదల చేయమని పిలాతును అడిగారు.+
15 జీవాన్ని ఇవ్వడానికి నియమించబడిన ముఖ్య ప్రతినిధిని*+ మీరు చంపారు. అయితే దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడు, ఈ వాస్తవానికి మేము సాక్షులం.+
16 ఆయన పేరు ద్వారా, అంటే ఆయన పేరులో మాకున్న విశ్వాసాన్ని బట్టి మీరు చూస్తున్న, మీకు తెలిసిన ఈ వ్యక్తి బలపర్చబడ్డాడు. యేసు వల్ల మాకున్న విశ్వాసాన్ని బట్టి ఈ వ్యక్తి మీ అందరి కళ్లముందు పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యాడు.
17 సహోదరులారా, మీ నాయకుల్లాగే+ మీరు కూడా తెలియకే అలా చేశారని+ నాకు తెలుసు.
18 క్రీస్తు బాధలు పడతాడని దేవుడు తన ప్రవక్తలందరి ద్వారా ముందే ప్రకటించిన విషయాలు నెరవేరేలా దేవుడే దాన్ని అనుమతించాడు.+
19 “కాబట్టి మీరు పశ్చాత్తాపపడి+ దేవుని వైపు తిరగండి.+ అప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి,*+ యెహోవాయే* మీకు సేదదీర్పును ఇస్తాడు.*
20 మీ కోసం నియమించబడిన క్రీస్తును, అంటే యేసును పంపిస్తాడు.
21 అయితే, అన్నిటినీ చక్కదిద్దే* సమయాలు వస్తాయని గతంలో తన పవిత్ర ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పాడు; అప్పటివరకు యేసు పరలోకంలోనే ఉండాలి.
22 నిజానికి మోషే ఇలా చెప్పాడు: ‘మీ దేవుడైన యెహోవా* మీ కోసం మీ సహోదరుల్లో నుండి నాలాంటి ఒక ప్రవక్తను రప్పిస్తాడు.+ ఆయన మీకు చెప్పే ప్రతీది మీరు వినాలి.+
23 ఎవరైనా* ఆ ప్రవక్త చెప్పింది వినకపోతే అతను ప్రజల్లో ఉండకుండా పూర్తిగా నాశనం చేయబడతాడు.’+
24 మోషే మాత్రమే కాదు, సమూయేలు దగ్గర నుండి ప్రవక్తలందరూ ఈ రోజుల గురించి స్పష్టంగా ప్రకటించారు.+
25 మీరు ప్రవక్తల పిల్లలు, దేవుడు మీ పూర్వీకులతో చేసిన ఒప్పందానికి* వారసులు.+ దేవుడు అబ్రాహాముతో ఇలా చెప్పాడు: ‘నీ సంతానం* ద్వారా భూమ్మీదున్న అన్ని కుటుంబాలు దీవించబడతాయి.’+
26 దేవుడు తన సేవకుణ్ణి లేపిన తర్వాత, ఆయన్ని ముందుగా మీ దగ్గరికి పంపించాడు.+ మీలో ప్రతీ ఒక్కర్ని మీ చెడుపనుల నుండి పక్కకు మళ్లించి మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన అలా చేశాడు.”
అధస్సూచీలు
^ అక్ష., “తొమ్మిదో గంట అప్పుడు.”
^ లేదా “జీవాధిపతిని.”
^ లేదా “యెహోవా ముఖం నుండి విశ్రాంతి కాలాలు వస్తాయి.”
^ అనుబంధం A5 చూడండి.
^ అక్ష., “తుడిచేయబడతాయి.”
^ లేదా “పునరుద్ధరించే.”
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “ఏ ప్రాణి అయినా.”
^ లేదా “నిబంధనకు.”
^ అక్ష., “విత్తనం.”