దానియేలు 7:1-28

  • నాలుగు మృగాల గురించిన దర్శనం (1-8)

    • అహంకారపు చిన్న కొమ్ము పైకి రావడం (8)

  • మహా వృద్ధుడు న్యాయసభ మొదలుపెట్టడం (9-14)

    • మానవ కుమారుడు రాజుగా చేయబడడం (13, 14)

  • భావాన్ని దానియేలుకు తెలియ​జేయడం (15-28)

    • ఆ నాలుగు మృగాలు నలుగురు రాజులు (17)

    • పవిత్రులు రాజ్యాన్ని పొందుతారు (18)

    • పది కొమ్ములు లేదా పదిమంది రాజులు లేస్తారు (24)

7  బబులోను రాజైన బెల్షస్సరు పరిపాలన మొదటి సంవత్సరంలో, దానియేలు తన పడక మీద పడుకొనివుండగా ఒక కలను, దర్శనాల్ని చూశాడు.+ అతను ఆ కల గురించి, వాటిలో చూసినవాటి గురించి పూర్తిగా రాశాడు.+  దానియేలు ఇలా వివరించాడు: “రాత్రి వచ్చిన దర్శనాల్లో, నేను చూస్తుండగా ఇదిగో! ఆకాశం నుండి నాలుగు గాలులు పెద్ద సముద్రం మీద భీకరంగా వీస్తుండడం+ నాకు కనిపించింది.  అప్పుడు నాలుగు పెద్ద మృగాలు సముద్రంలో నుండి బయటికి వచ్చాయి, అవి ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఉన్నాయి.  “మొదటి మృగం సింహంలా+ ఉంది, దానికి గద్ద రెక్కల్లాంటి రెక్కలు+ ఉన్నాయి. నేను చూస్తుండగా దాని రెక్కలు పీకేయబడ్డాయి; అది భూమ్మీద నుండి పైకి ఎత్తబడి, మనిషిలా రెండు పాదాల మీద నిలబెట్టబడింది; దానికి మనిషి హృదయం ఇవ్వబడింది.  “తర్వాత ఇదిగో! ఎలుగుబంటిలా ఉన్న రెండో మృగాన్ని చూశాను.+ అది ఒక కాలును లేపింది, దాని పళ్ల మధ్య మూడు పక్కటెముకలు ఉన్నాయి; ‘లే, ఎక్కువ మాంసం తిను’+ అని దానికి చెప్పబడింది.  “ఆ తర్వాత నేను చూస్తుండగా ఇదిగో! చిరుతపులి లాంటి మరో మృగం+ కనిపించింది; కానీ దాని వీపుకు పక్షి రెక్కల లాంటి నాలుగు రెక్కలు ఉన్నాయి. ఆ మృగానికి నాలుగు తలలు ఉన్నాయి;+ పరిపాలించే అధికారం దానికి ఇవ్వబడింది.  “తర్వాత, రాత్రి వచ్చిన దర్శనాల్లో నేను చూస్తుండగా, నాలుగో మృగం కనిపించింది; అది ఘోరంగా, భయంకరంగా, ఎంతో బలంగా ఉంది; దానికి పెద్దపెద్ద ఇనుప పళ్లు ఉన్నాయి. అది అన్నిటినీ మింగేస్తూ, నలగ్గొడుతూ ఉంది, మిగిలినదాన్ని తన పాదాల కింద తొక్కేసింది.+ అది ముందు కనిపించిన మృగాలన్నిటికన్నా వేరుగా ఉంది; దానికి పది కొమ్ములు ఉన్నాయి.  నేను ఆ కొమ్ముల్ని గమనిస్తుండగా, ఇదిగో! మరో చిన్న కొమ్ము+ వాటి మధ్యలో నుండి పైకి వచ్చింది, దాని ఎదుట నుండి ఆ మొదటి కొమ్ముల్లో మూడు కొమ్ములు పీకేయబడ్డాయి. ఆ కొమ్ముకు మనిషి కళ్లలాంటి కళ్లు, అహంకారంగా మాట్లాడే* నోరు ఉన్నాయి.+  “నేను చూస్తుండగా సింహాసనాలు వేయబడ్డాయి, మహా వృద్ధుడు+ కూర్చున్నాడు.+ ఆయన వస్త్రాలు మంచులా తెల్లగా ఉన్నాయి, ఆయన తలవెంట్రుకలు స్వచ్ఛమైన ఉన్నిలా ఉన్నాయి. అగ్ని జ్వాలలే ఆయన సింహాసనం, మండే అగ్ని దాని చక్రాలు.+ 10  ఆయన ఎదుట నుండి అగ్ని ప్రవాహం ప్రవహిస్తూ ఉంది.+ వేవేలమంది ఆయనకు పరిచారం చేస్తూ ఉన్నారు, కోట్లమంది ఆయన ఎదుట నిలబడివున్నారు.+ న్యాయసభ+ మొదలైంది, గ్రంథాలు తెరవబడ్డాయి. 11  “చిన్న కొమ్ము మాట్లాడే అహంకార మాటల* కారణంగా నేను చూస్తూ ఉన్నాను. ఆ మృగం చంపబడి, దాని శరీరం మండే అగ్నిలో పడేయబడి నాశనం చేయబడే వరకు నేను చూస్తూనే ఉన్నాను. 12  అయితే మిగతా మృగాల విషయానికొస్తే, పరిపాలించే అధికారం వాటి నుండి తీసేయబడింది; అవి ఒక సమయం, ఒక కాలం పాటు బ్రతికుండడానికి అనుమతించబడ్డాయి. 13  “రాత్రి వచ్చిన దర్శనాల్లో, నేను చూస్తుండగా ఇదిగో! మానవ కుమారునిలా ఉన్న ఒకాయన+ ఆకాశ మేఘాలతో వస్తున్నాడు; ఆయన మహా వృద్ధుని+ దగ్గరికి వెళ్లడానికి అనుమతించబడి, ఆయన ముందుకు తీసుకురాబడ్డాడు. 14  వివిధ దేశాల, భాషల ప్రజలందరూ ఆయన్ని సేవించేలా+ పరిపాలన,+ ఘనత,+ ఒక రాజ్యం ఆయనకు ఇవ్వబడ్డాయి. ఆయన పరిపాలన శాశ్వతంగా ఉంటుంది, అది ఎప్పటికీ అంతం కాదు; ఆయన రాజ్యం ఎప్పటికీ నాశనం కాదు.+ 15  “దానియేలునైన నేను చూసిన దర్శనాలు నన్ను భయపెట్టాయి కాబట్టి నేను కలవరపడ్డాను. 16  నేను దాని అసలు భావం ఏంటో అడగడానికి అక్కడ నిలబడివున్నవాళ్లలో ఒకరి దగ్గరికి వెళ్లాను. అతను నాకు సమాధానం చెప్పి, వాటి భావం తెలియజేశాడు. 17  “ ‘పెద్దగా ఉన్న ఆ నాలుగు మృగాలు భూమ్మీద నుండి లేచే నలుగురు రాజులు.+ 18  అయితే మహోన్నత దేవుని పవిత్రులు+ రాజ్యాన్ని పొందుతారు;+ ఆ రాజ్యం నిరంతరం, అవును యుగయుగాలు వాళ్ల సొంతమౌతుంది.’+ 19  “అప్పుడు, నేను నాలుగో మృగం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకున్నాను; అది ఇతర మృగాలన్నిటికన్నా వేరుగా ఉంది, అది ఇనుప పళ్లతో, రాగి గోళ్లతో ఎంతో భయంకరంగా ఉంది; అది అన్నిటినీ మింగేస్తూ, నలగ్గొడుతూ, మిగిలినదాన్ని తన పాదాల కింద తొక్కుతూ ఉంది;+ 20  అలాగే దాని తల మీదున్న పది కొమ్ముల గురించి, పైకి వచ్చిన ఏ కొమ్ము ఎదుట మూడు కొమ్ములు పడిపోయాయో ఆ మరో కొమ్ము గురించి నేను తెలుసుకోవాలనుకున్నాను. ఆ కొమ్ముకు కళ్లూ, అహంకారంగా మాట్లాడే* నోరూ ఉన్నాయి, అది మిగతా కొమ్ములకన్నా పెద్దగా ఉంది. 21  “నేను చూస్తుండగా ఆ కొమ్ము పవిత్రులతో యుద్ధం చేసి, వాళ్ల మీద విజయం సాధిస్తూ ఉంది.+ 22  మహా వృద్ధుడు వచ్చి మహోన్నత దేవుని పవిత్రులకు+ అనుకూలంగా తీర్పు తీర్చే వరకు అలా జరిగింది, పవిత్రులు రాజ్యాన్ని పొందే+ నియమిత సమయం వచ్చింది. 23  “అతను నాకు ఇలా చెప్పాడు: ‘నాలుగో మృగం, భూమ్మీదికి రాబోయే నాలుగో రాజ్యం. అది మిగతా రాజ్యాలన్నిటికన్నా వేరుగా ఉంటుంది. అది భూమంతటినీ మింగేసి, దాన్ని కాళ్లతో తొక్కి నలగ్గొడుతుంది.+ 24  పది కొమ్ములు, ఆ రాజ్యంలో నుండి లేచే పదిమంది రాజులు; వాళ్ల తర్వాత ఇంకో రాజు లేస్తాడు, అతను ముందున్న రాజులకన్నా వేరుగా ఉంటాడు, అతను ముగ్గురు రాజుల్ని లోబర్చుకుంటాడు. 25  అతను సర్వోన్నతునికి వ్యతిరేకంగా మాట్లాడతాడు,+ మహోన్నత దేవుని పవిత్రుల్ని వేధిస్తూ ఉంటాడు. అతను సమయాల్ని, చట్టాన్ని మార్చాలని అనుకుంటాడు; వాళ్లు ఒక కాలం, కాలాలు, అర్ధ కాలం* అతని చేతికి అప్పగించబడతారు.+ 26  అయితే న్యాయసభ మొదలైంది; అతన్ని నిర్మూలించి పూర్తిగా నాశనం చేయడానికి వాళ్లు అతని పరిపాలనా అధికారాన్ని తీసేశారు. 27  “ ‘రాజ్యం, పరిపాలన, ఆకాశమంతటి కింద ఉన్న రాజ్యాల వైభవం మహోన్నత దేవుని పవిత్రులకు ఇవ్వబడింది.+ వాళ్ల రాజ్యం శాశ్వతమైనది;+ రాజ్యాలన్నీ వాళ్లను సేవిస్తాయి, వాళ్లకు లోబడతాయి.’ 28  “విషయం ఇంతటితో సమాప్తమైంది. దానియేలునైన నా విషయానికొస్తే, నా ఆలోచనలు నన్ను ఎంతో భయపెట్టాయి కాబట్టి నా ముఖం పాలిపోయింది;* అయితే నేను ఆ విషయాన్ని నా హృదయంలోనే ఉంచుకున్నాను.”

అధస్సూచీలు

లేదా “గొప్పలు చెప్పుకునే.”
లేదా “గొప్పలు చెప్పుకోవడం.”
లేదా “గొప్పలు చెప్పుకునే.”
అంటే, మూడున్నర కాలాలు.
లేదా “నా రూపం మారిపోయింది.”