నిర్గమకాండం 32:1-35
32 ఈలోగా, మోషే పర్వతం మీద నుండి కిందికి రావడానికి చాలా సమయం తీసుకుంటున్నాడని ప్రజలు గమనించారు.+ కాబట్టి వాళ్లు అహరోను చుట్టూ చేరి ఇలా అన్నారు: “నువ్వు లేచి, మాకు ముందుగా వెళ్లడానికి మా కోసం ఒక దేవుణ్ణి తయారుచేయి.+ ఎందుకంటే, ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని బయటికి నడిపించిన ఈ మోషేకు ఏమైందో మాకు తెలీదు.”
2 అప్పుడు అహరోను వాళ్లతో ఇలా అన్నాడు: “మీ భార్యల చెవులకు, మీ కుమారుల చెవులకు, కూతుళ్ల చెవులకు ఉన్న బంగారు పోగుల్ని+ తీసి వాటిని నా దగ్గరికి తీసుకురండి.”
3 దాంతో ప్రజలందరూ తమ చెవులకు ఉన్న బంగారు పోగుల్ని తీసేసి వాటిని అహరోను దగ్గరికి తీసుకురావడం మొదలుపెట్టారు.
4 అతను వాటిని తీసుకొని, ఆ బంగారాన్ని పోతపోసి, ఉలితో చెక్కి ఒక దూడ విగ్రహాన్ని తయారుచేశాడు.+ అప్పుడు వాళ్లు, “ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశం నుండి నిన్ను బయటికి నడిపించిన నీ దేవుడు ఇదే” అని అనడం మొదలుపెట్టారు.+
5 అహరోను అది చూసినప్పుడు, దాని ముందు ఒక బలిపీఠం కట్టాడు. తర్వాత అహరోను, “రేపు యెహోవాకు పండుగ ఉంటుంది” అని ప్రకటన చేశాడు.
6 కాబట్టి వాళ్లు తర్వాతి రోజు ఉదయాన్నే లేచి దహనబలులు, సమాధాన బలులు అర్పించడం మొదలుపెట్టారు. తర్వాత ఆ ప్రజలు తిని తాగడానికి కూర్చున్నారు. ఆ తర్వాత వాళ్లు లేచి జల్సాగా సమయం గడపడం మొదలుపెట్టారు.+
7 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు కిందికి వెళ్లు, ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి నువ్వు బయటికి నడిపించిన నీ ప్రజలు చెడిపోయారు.+
8 నేను వాళ్లకు ఆజ్ఞాపించిన మార్గం నుండి వాళ్లు ఇట్టే పక్కకుమళ్లారు.+ వాళ్లు తమకోసం ఒక దూడ విగ్రహాన్ని* చేసుకున్నారు; దానికి వంగి నమస్కరిస్తూ, బలులు అర్పిస్తూ, ‘ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశం నుండి నిన్ను బయటికి నడిపించిన నీ దేవుడు ఇదే’ అని అంటూ ఉన్నారు.”
9 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: “వాళ్లు తలబిరుసు ప్రజలని+ నేను గమనించాను.
10 నాకు వాళ్లమీద చాలా కోపంగా ఉంది, కాబట్టి వాళ్లను సమూలంగా నాశనం చేయనివ్వు, వాళ్లకు బదులుగా నిన్ను గొప్ప జనంగా చేయనివ్వు.”+
11 తర్వాత మోషే తన దేవుడైన యెహోవాను ఇలా వేడుకున్నాడు:+ “యెహోవా, గొప్ప శక్తితో, బలమైన చేతితో ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చిన నీ ప్రజల మీద నువ్వు అంత కోపం చూపించడం దేనికి?+
12 ఐగుప్తీయులు, ‘ఆయన దురాలోచనలతోనే వాళ్లను బయటికి నడిపించాడు. వాళ్లను పర్వతాల్లో చంపాలని, భూమ్మీద లేకుండా వాళ్లను సమూలంగా నాశనం చేయాలని ఆయన అనుకున్నాడు’ అని ఎందుకు చెప్పుకోవాలి?+ కాబట్టి నీ కోపాగ్నిని తీసేసుకొని, నీ ప్రజల మీదికి ఈ విపత్తు తీసుకురావాలనే నీ నిర్ణయం గురించి ఇంకొకసారి ఆలోచించు.*
13 నువ్వు నీ మీద ఒట్టేసుకొని, ‘నేను నీ సంతానాన్ని* ఆకాశ నక్షత్రాలంతమంది అయ్యేలా చేస్తాను;+ నీ సంతానానికి* ఇవ్వాలని నిర్ణయించిన ఈ దేశమంతటినీ నేను వాళ్లకు ఇస్తాను. అది వాళ్లకు శాశ్వతమైన ఆస్తి అవుతుంది’ అని నీ సేవకులైన అబ్రాహాముకు, ఇస్సాకుకు, ఇశ్రాయేలుకు చెప్పావు. వాళ్లను జ్ఞాపకం చేసుకో.”+
14 కాబట్టి యెహోవా తన ప్రజల మీదికి తీసుకొస్తానని చెప్పిన విపత్తు గురించి ఇంకొకసారి ఆలోచించసాగాడు.*+
15 తర్వాత మోషే వెనక్కి తిరిగి, సాక్ష్యంగా ఉండే రెండు రాతి పలకల్ని+ తన చేతుల్లో తీసుకొని ఆ పర్వతం మీద నుండి కిందికి దిగాడు.+ ఆ రాతి పలకలు రెండు వైపులా చెక్కబడ్డాయి; వాటి ముందువైపూ, వెనకవైపూ మాటలు రాయబడివున్నాయి.
16 ఆ రాతి పలకల్ని దేవుడే తయారుచేశాడు, వాటి మీదున్న రాతల్ని దేవుడే ఆ పలకల మీద చెక్కాడు.+
17 ప్రజల అరుపులు, ఆ శబ్దం యెహోషువకు వినిపించినప్పుడు అతను మోషేతో, “పాలెంలో యుద్ధ ధ్వని వినిపిస్తోంది” అన్నాడు.
18 అయితే మోషే ఇలా అన్నాడు:
“అది విజయోత్సాహంతో* పాడే పాటల శబ్దం కాదు,ఓటమి వల్ల విలపిస్తున్న శబ్దం కూడా కాదు;నాకు వినిపిస్తున్న శబ్దం వేరే రకమైన పాటల శబ్దం.”
19 మోషే పాలెం దగ్గరికి వచ్చి ఆ దూడను,+ వాళ్ల నాట్యాల్ని చూడగానే అతనికి విపరీతమైన కోపమొచ్చింది; దాంతో అతను తన చేతుల్లో ఉన్న రాతి పలకల్ని విసిరేసి, పర్వతం అడుగుభాగాన వాటిని పగలగొట్టాడు.+
20 అతను వాళ్లు చేసుకున్న దూడ విగ్రహాన్ని తీసుకొని, దాన్ని అగ్నిలో కాల్చేసి, దాన్ని పిండిపిండి చేశాడు;+ తర్వాత దాన్ని నీళ్ల మీద చల్లి, ఇశ్రాయేలీయులతో ఆ నీళ్లు తాగించాడు.+
21 తర్వాత మోషే అహరోనును, “నువ్వు ఈ ప్రజల మీదికి గొప్ప పాపం తీసుకొచ్చేలా వాళ్లు నీకు ఏం చేశారు?” అని అడిగాడు.
22 అప్పుడు అహరోను ఇలా అన్నాడు: “నా ప్రభువా, కోపగించుకోకు. ఈ ప్రజలు ఎప్పుడూ చెడు చేయడం వైపే మొగ్గుచూపుతారని నీకు బాగా తెలుసు.+
23 వాళ్లు నాతో, ‘మాకు ముందుగా వెళ్లడానికి మా కోసం ఒక దేవుణ్ణి తయారుచేయి. ఎందుకంటే, ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని బయటికి నడిపించిన ఈ మోషేకు ఏమైందో మాకు తెలీదు’ అన్నారు.+
24 దాంతో నేను, ‘ఎవరి దగ్గరైతే బంగారం ఉందో వాళ్లు దాన్ని తీసేసి నాకు ఇవ్వాలి’ అన్నాను. దాన్ని నేను మంటలో వేసినప్పుడు ఈ దూడ బయటికి వచ్చింది.”
25 ఆ ప్రజలు అదుపులేకుండా ప్రవర్తించడం మోషే గమనించాడు; వాళ్లు అలా అదుపులేకుండా ప్రవర్తించేలా అహరోను వాళ్లను వదిలేశాడు. దానివల్ల, వాళ్లు తమ శత్రువుల ముందు అవమానం కొనితెచ్చుకున్నారు.
26 తర్వాత మోషే పాలెం ద్వారం దగ్గర నిలబడి, “మీలో యెహోవా పక్షాన ఉన్నవాళ్లు నా దగ్గరికి రండి!”+ అన్నాడు. దాంతో లేవీయులంతా అతని చుట్టూ చేరారు.
27 అప్పుడు అతను వాళ్లతో ఇలా అన్నాడు: “ ‘మీలో ప్రతీ ఒక్కరు తమ కత్తిని ధరించి, ఒక ద్వారం నుండి ఇంకో ద్వారానికి వెళ్తూ పాలెమంతటా తిరిగి తన సహోదరుణ్ణి, తన పొరుగువాణ్ణి, తన సన్నిహిత స్నేహితుణ్ణి చంపాలి’+ అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పాడు.”
28 ఆ లేవీయులు మోషే చెప్పినట్టు చేశారు. కాబట్టి ఆ రోజు దాదాపు 3,000 మంది పురుషులు చంపబడ్డారు.
29 తర్వాత మోషే ఇలా చెప్పాడు: “ఈ రోజు యెహోవా కోసం మిమ్మల్ని మీరు ప్రత్యేకపర్చుకోండి, ఎందుకంటే మీలో ప్రతీ ఒక్కరు తన సొంత కుమారుడికి, తన సొంత సహోదరుడికి వ్యతిరేకంగా పోరాడారు;+ ఈ రోజు ఆయన మిమ్మల్ని దీవిస్తాడు.”+
30 ఆ తర్వాతి రోజే మోషే ప్రజలతో, “మీరు చాలా పెద్ద పాపం చేశారు, ఇప్పుడు నేను యెహోవా దగ్గరికి ఎక్కివెళ్లి మీ పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలనేమో చూస్తాను” అన్నాడు.+
31 కాబట్టి మోషే తిరిగి యెహోవా దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు: “ఈ ప్రజలు నిజంగా చాలా పెద్ద పాపం చేశారు! వాళ్లు బంగారంతో ఒక దేవుణ్ణి తయారు చేసుకున్నారు.+
32 అయితే ఇప్పుడు నీకిష్టమైతే వాళ్ల పాపాన్ని మన్నించు;+ లేకపోతే, నువ్వు రాసిన నీ పుస్తకంలో నుండి దయచేసి నా పేరు తుడిచేయి.”+
33 కానీ యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఎవరైతే నాకు వ్యతిరేకంగా పాపం చేశారో అతని పేరునే నా పుస్తకంలో నుండి తుడిచేస్తాను.
34 ఇప్పుడు నువ్వు వెళ్లి, నేను నీతో చెప్పిన చోటికి వాళ్లను నడిపించు. ఇదిగో! నీకు ముందుగా నా దూత వెళ్తాడు.+ నేను లెక్క అడిగే రోజున, వాళ్లు చేసిన పాపానికి వాళ్లకు శిక్ష విధిస్తాను.”
35 తర్వాత, ప్రజలు చేసుకున్న దూడను బట్టి, అంటే అహరోను చేసిన దూడను బట్టి, యెహోవా వాళ్ల మీదికి తెగులు రప్పించడం మొదలుపెట్టాడు.
అధస్సూచీలు
^ లేదా “పోత విగ్రహాన్ని.”
^ లేదా “మనసు మార్చుకో.”
^ అక్ష., “విత్తనాన్ని.”
^ అక్ష., “విత్తనానికి.”
^ లేదా “మనసు మార్చుకున్నాడు.”
^ లేదా “పరాక్రమ కార్యం గురించి.”