యోహానుకు ఇచ్చిన ప్రకటన 12:1-17
12 ఆ తర్వాత పరలోకంలో ఒక గొప్ప సూచన కనిపించింది. ఒక స్త్రీ+ సూర్యుణ్ణి ధరించి ఉంది, ఆమె పాదాల కింద చంద్రుడు ఉన్నాడు, ఆమె తల మీద 12 నక్షత్రాల కిరీటం ఉంది.
2 ఆమె గర్భవతి. బిడ్డను కనే సమయం దగ్గరపడడంతో ఆమె పురిటినొప్పుల వల్ల కేకలు పెడుతోంది.
3 పరలోకంలో ఇంకొక సూచన కనిపించింది. ఇదిగో! ఏడు తలలు, పది కొమ్ములు ఉన్న ఎర్రని మహాసర్పం+ కనిపించింది. దాని తలల మీద ఏడు కిరీటాలు ఉన్నాయి.
4 దాని తోక ఆకాశ నక్షత్రాల్లో+ మూడో భాగాన్ని ఈడ్చి భూమ్మీద పడేసింది.+ ఆ స్త్రీ బిడ్డను కనగానే ఆ బిడ్డను మింగేయాలని మహాసర్పం ఆమె ముందు అలాగే నిలబడి ఉంది.
5 ఆ స్త్రీ ఒక మగబిడ్డను+ కన్నది. ఆయన ఇనుప దండంతో అన్నిదేశాల్ని పరిపాలిస్తాడు.+ వెంటనే ఆ బిడ్డను సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుని దగ్గరికి తీసుకెళ్లారు.
6 అప్పుడు ఆ స్త్రీ ఎడారికి* పారిపోయింది. అక్కడ దేవుడు ఆమె కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేశాడు. అక్కడ ఆమె 1,260 రోజులు పోషించబడుతుంది.+
7 అప్పుడు పరలోకంలో యుద్ధం మొదలైంది. మిఖాయేలు,*+ ఆయన దూతలు మహాసర్పంతో యుద్ధం చేశారు. మహాసర్పం, దాని దూతలు కూడా యుద్ధం చేశారు
8 కానీ ఓడిపోయారు.* కాబట్టి పరలోకంలో వాళ్లకు ఇక స్థలం లేకుండా పోయింది.
9 దాంతో ఆ మహాసర్పం కిందికి పడేయబడింది. అది మొదటి సర్పం.+ దానికి అపవాది,+ సాతాను+ అనే పేర్లు ఉన్నాయి. అతను లోకమంతటినీ మోసం చేస్తున్నాడు.+ అతను భూమ్మీద పడేయబడ్డాడు,+ అతని దూతలు కూడా అతనితోపాటు పడేయబడ్డారు.
10 అప్పుడు పరలోకంలో ఒక పెద్ద స్వరం ఇలా చెప్పడం నేను విన్నాను:
“ఇప్పుడు రక్షణ,+ శక్తి, రాజ్యం మన దేవునివి అయ్యాయి. అధికారం ఆయన క్రీస్తుకు వచ్చింది. ఎందుకంటే, మన దేవుని ముందు రాత్రింబగళ్లు మన సహోదరుల్ని నిందించేవాడు+ కిందికి పడేయబడ్డాడు!
11 వాళ్లు గొర్రెపిల్ల రక్తం వల్ల, తాము ప్రకటించిన సందేశం వల్ల+ అతన్ని జయించారు.+ చనిపోవాల్సి వచ్చినా వాళ్లు తమ ప్రాణాల్ని* లెక్కచేయలేదు.+
12 కాబట్టి పరలోకమా, పరలోక నివాసులారా, సంతోషించండి! అయితే భూమీ, సముద్రమా, మీకు శ్రమ.+ ఎందుకంటే అపవాది తనకు కొంచెం సమయమే ఉందని తెలిసి+ చాలా కోపంతో మీ దగ్గరికి దిగివచ్చాడు.”
13 ఆ మహాసర్పం తాను భూమ్మీదికి పడేయబడ్డానని+ తెలుసుకున్నప్పుడు, మగబిడ్డను కన్న స్త్రీని+ హింసించింది.
14 అయితే ఆ స్త్రీ ఎడారిలో ఉన్న తన స్థలానికి ఎగిరిపోయేలా, పెద్ద గద్దరెక్కలు+ రెండు ఆమెకు ఇవ్వబడ్డాయి. అక్కడ సర్పానికి+ దూరంగా ఆమె ఒక కాలం, రెండు కాలాలు, అర్ధ కాలం*+ పోషించబడాలి.
15 సర్పం ఆ స్త్రీని ముంచేయాలని తన నోటితో ఆమె వెనక నీళ్లను నదిలా వెళ్లగక్కింది.
16 అయితే భూమి ఆమెకు సహాయం చేసింది. భూమి నోరు తెరిచి, మహాసర్పం తన నోటితో వెళ్లగక్కిన నదిని మింగేసింది.
17 దాంతో మహాసర్పానికి ఆ స్త్రీ మీద చాలా కోపం వచ్చింది. కాబట్టి దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ యేసు గురించి సాక్ష్యమివ్వడానికి+ నియమించబడిన ఆమె సంతానంలో* మిగిలినవాళ్లతో యుద్ధం చేయడానికి+ అది బయల్దేరింది.
అధస్సూచీలు
^ “దేవుని వంటి వాడు ఎవడు?” అని అర్థం.
^ లేదా “కానీ అది [అంటే, ఆ మహాసర్పం] ఓడిపోయింది” అయ్యుంటుంది.
^ అంటే, మూడున్నర కాలాలు.
^ అక్ష., “విత్తనంలో.”