యోహానుకు ఇచ్చిన ప్రకటన 20:1-15
20 అప్పుడు పరలోకం నుండి ఒక దేవదూత కిందికి దిగిరావడం నేను చూశాను. ఆయన చేతిలో అగాధపు తాళంచెవి,+ పెద్ద గొలుసు ఉన్నాయి.
2 ఆయన ఆ మహాసర్పాన్ని+ పట్టుకొని 1,000 సంవత్సరాల పాటు బంధించాడు. అదే మొదటి సర్పం,+ అపవాది,+ సాతాను.+
3 ఆ దేవదూత అతన్ని అగాధంలో+ పడేసి, దాన్ని మూసేసి, ముద్రవేశాడు. ఆ 1,000 సంవత్సరాలు ముగిసేవరకు అతను దేశాల్ని ఇక మోసం చేయకుండా ఉండాలని అలా చేశాడు. ఆ తర్వాత అతను కొంతకాలం విడుదల చేయబడాలి.+
4 తర్వాత నేను సింహాసనాల్ని చూశాను. వాటిమీద కూర్చున్న వాళ్లు తీర్పుతీర్చే అధికారం పొందారు. అవును, యేసు గురించి సాక్ష్యమిచ్చినందుకు, దేవుని గురించి ప్రకటించినందుకు చంపబడిన* వాళ్ల రక్తాన్ని;* అలాగే క్రూరమృగాన్ని గానీ దాని ప్రతిమను గానీ పూజించకుండా, తమ నొసటిమీద, చేతిమీద గుర్తు వేయించుకోకుండా ఉన్నవాళ్లను నేను చూశాను.+ వాళ్లు బ్రతికి, క్రీస్తుతోపాటు 1,000 సంవత్సరాలు రాజులుగా పరిపాలించారు.+
5 (చనిపోయిన వాళ్లలో మిగిలినవాళ్లు+ ఆ 1,000 సంవత్సరాలు పూర్తయ్యేవరకు బ్రతకలేదు.) ఇది మొదటి పునరుత్థానం.+
6 ఈ మొదటి పునరుత్థానంలో బ్రతికేవాళ్లు సంతోషంగా ఉంటారు,+ వీళ్లు పవిత్రులు. వీళ్ల మీద రెండో మరణానికి+ అధికారం లేదు.+ వీళ్లు దేవునికి, క్రీస్తుకు యాజకులుగా+ ఉంటారు, క్రీస్తుతో కలిసి 1,000 సంవత్సరాలు రాజులుగా పరిపాలిస్తారు.+
7 ఆ 1,000 సంవత్సరాలు పూర్తవ్వగానే చెరలో నుండి సాతాను విడుదల చేయబడతాడు.
8 అప్పుడు అతను భూమి నలుమూలలా ఉన్న దేశాల్ని, అంటే గోగును, మాగోగును మోసం చేసి యుద్ధం కోసం సమకూర్చడానికి బయల్దేరతాడు. వాళ్ల సంఖ్య సముద్రపు ఇసుక రేణువులంత ఉంది.
9 వాళ్లు భూమంతటా విస్తరించి పవిత్రుల శిబిరాన్ని, దేవుడు ప్రేమించే నగరాన్ని చుట్టుముట్టారు. అయితే పరలోకం నుండి అగ్ని దిగివచ్చి వాళ్లను కాల్చేసింది.+
10 వాళ్లను మోసం చేస్తున్న అపవాది అగ్నిగంధకాల సరస్సులో పడేయబడ్డాడు. అప్పటికే అందులో క్రూరమృగం, అబద్ధ ప్రవక్త ఉన్నారు. వాళ్లు రాత్రింబగళ్లు, యుగయుగాలు బాధించబడతారు.*
11 అప్పుడు తెల్లగా ఉన్న ఒక పెద్ద సింహాసనాన్ని, దానిమీద కూర్చొని ఉన్న దేవుణ్ణి+ నేను చూశాను. భూమ్యాకాశాలు ఆయన ముందు నుండి పారిపోయాయి,+ వాటికి ఎక్కడా స్థలం దొరకలేదు.
12 గొప్పవాళ్లే గానీ, సామాన్యులే గానీ చనిపోయిన వాళ్లందరూ ఆ సింహాసనం ముందు నిలబడి ఉండడం నేను చూశాను. అప్పుడు గ్రంథపు చుట్టలు విప్పబడ్డాయి. అయితే ఇంకో గ్రంథపు చుట్ట విప్పబడింది, అది జీవగ్రంథం.+ చనిపోయినవాళ్లు గ్రంథపు చుట్టల్లో రాసివున్న వాటి ప్రకారం తమతమ పనుల్ని బట్టి తీర్పు పొందారు.+
13 సముద్రం దానిలో ఉన్న మృతుల్ని అప్పగించింది. మరణం, సమాధి* వాటిలో ఉన్న మృతుల్ని అప్పగించాయి. వాళ్లలో ప్రతీ ఒక్కరు తమతమ పనుల్ని బట్టి తీర్పు పొందారు.+
14 మరణం, సమాధి* అగ్ని సరస్సులో పడేయబడ్డాయి.+ ఈ అగ్ని సరస్సు రెండో మరణాన్ని సూచిస్తుంది.+
15 అంతేకాదు, ఎవరి పేర్లయితే జీవగ్రంథంలో లేవో వాళ్లు అగ్ని సరస్సులో పడేయబడ్డారు.