యోహానుకు ఇచ్చిన ప్రకటన 4:1-11
4 ఆ తర్వాత నేను చూసినప్పుడు పరలోకంలో తెరిచివున్న ఒక తలుపు కనిపించింది. నేను మొదట విన్న స్వరం బాకా శబ్దంలా ఉంది. అది నాతో, “ఇక్కడికి ఎక్కి రా, జరగాల్సిన సంగతుల్ని నీకు చూపిస్తాను” అంది.
2 వెంటనే దేవుని పవిత్రశక్తి నా మీదికి వచ్చింది. ఇదిగో, పరలోకంలో ఒక సింహాసనాన్ని చూశాను, దానిమీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు.+
3 ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి రూపం సూర్యకాంతపు రాయిలా,+ కెంపులా* ఉంది. సింహాసనం చుట్టూ మరకతం లాంటి ఇంద్రధనుస్సు ఉంది.+
4 ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. వాటిమీద 24 మంది పెద్దలు+ కూర్చొని ఉండడం చూశాను. వాళ్లు తెల్లని వస్త్రాలు వేసుకొని ఉన్నారు. వాళ్ల తలల మీద బంగారు కిరీటాలు ఉన్నాయి.
5 సింహాసనం నుండి మెరుపులు,+ స్వరాలు, ఉరుములు+ వస్తున్నాయి. సింహాసనం ముందు మండుతున్న ఏడు పెద్ద దీపాలు ఉన్నాయి. అవి దేవుని ఏడు శక్తుల్ని సూచిస్తున్నాయి.+
6 సింహాసనం ముందు గాజు లాంటి, స్ఫటికం లాంటి సముద్రం+ ఉంది.
మధ్యలో, సింహాసనం ఉన్న చోట,* సింహాసనం చుట్టూ నాలుగు జీవులు+ ఉన్నాయి. వాటి ముందుభాగం, వెనుకభాగం కళ్లతో నిండిపోయాయి.
7 మొదటి జీవి సింహంలా+ ఉంది, రెండో జీవి ఎద్దులా+ ఉంది, మూడో జీవి+ ముఖం మనిషి ముఖంలా ఉంది, నాలుగో జీవి+ ఎగిరే గద్దలా+ ఉంది.
8 ఆ నాలుగు జీవుల్లో ప్రతీ దానికి ఆరు రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కల నిండా కళ్లు ఉన్నాయి.+ ఆ జీవులు రాత్రింబగళ్లు ఇలా అంటూనే ఉన్నాయి: “సర్వశక్తిమంతుడు, ఇప్పుడూ గతంలోనూ ఉన్నవాడు, రాబోతున్నవాడు+ అయిన యెహోవా* దేవుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు.”+
9 సింహాసనం మీద కూర్చున్న, యుగయుగాలు జీవించే దేవునికి+ ఆ జీవులు మహిమ, ఘనత, కృతజ్ఞతలు చెల్లించే ప్రతీసారి
10 ఆ 24 మంది పెద్దలు+ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ముందు మోకరించి యుగయుగాలు జీవించే దేవుణ్ణి ఆరాధిస్తారు. వాళ్లు తమ కిరీటాల్ని ఆ సింహాసనం ముందు వేసి ఇలా అంటారు:
11 “యెహోవా* మా దేవా, నువ్వు అన్నిటినీ సృష్టించావు;+ నీ ఇష్టాన్ని బట్టే అవి ఉనికిలోకి వచ్చాయి, సృష్టించబడ్డాయి. కాబట్టి మహిమ,+ ఘనత,+ శక్తి+ పొందడానికి నువ్వు అర్హుడవు.”
అధస్సూచీలు
^ లేదా “అమూల్యమైన ఎర్రని రాయిలా.”
^ లేదా “సింహాసనంతో పాటు.”
^ అనుబంధం A5 చూడండి.
^ అనుబంధం A5 చూడండి.