మత్తయి సువార్త 24:1-51
24 యేసు ఆలయం నుండి వెళ్లిపోతుండగా, ఆయన శిష్యులు ఆలయ కట్టడాలు చూపించడానికి ఆయన దగ్గరికి వచ్చారు.
2 అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా? నేను నిజంగా మీతో చెప్తున్నాను, రాయి మీద రాయి అనేదే లేకుండా ఇవి పడగొట్టబడతాయి.”+
3 ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఏకాంతంగా ఆయన దగ్గరికి వచ్చి, “ఇవి ఎప్పుడు జరుగుతాయి? నీ ప్రత్యక్షతకు,*+ ఈ వ్యవస్థ* ముగింపుకు సూచన ఏమిటి? మాతో చెప్పు” అని అడిగారు.+
4 అప్పుడు యేసు వాళ్లకు ఇలా చెప్పాడు: “ఎవరూ మిమ్మల్ని తప్పుదారి పట్టించకుండా చూసుకోండి.+
5 ఎందుకంటే చాలామంది నా పేరుతో వచ్చి, ‘నేనే క్రీస్తును’ అని చెప్పుకుంటూ ఎంతోమందిని తప్పుదారి పట్టిస్తారు.
6 మీరు యుద్ధాల గురించి, యుద్ధ వార్తల గురించి వింటారు. అప్పుడు మీరు కంగారుపడకుండా చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ జరగాలి, కానీ అంతం అప్పుడే రాదు.+
7 “ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి.+ ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో ఆహారకొరతలు,+ భూకంపాలు వస్తాయి.+
8 ఇవన్నీ పురిటినొప్పుల లాంటి వేదనలకు ఆరంభం.
9 “అప్పుడు ప్రజలు మిమ్మల్ని హింసించి,+ చంపుతారు.+ మీరు నా శిష్యులుగా ఉన్నందుకు అన్నిదేశాల ప్రజలు మిమ్మల్ని ద్వేషిస్తారు.+
10 అంతేకాదు చాలామంది దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతారు; ఒకరినొకరు అప్పగించుకుంటారు, ద్వేషించుకుంటారు.
11 చాలామంది అబద్ధ ప్రవక్తలు పుట్టుకొచ్చి, ఎంతోమందిని తప్పుదారి పట్టిస్తారు;+
12 చెడుతనం పెరిగిపోవడం వల్ల ఎక్కువమంది ప్రేమ చల్లారిపోతుంది.
13 కానీ అంతం వరకు సహించినవాళ్లే* రక్షించబడతారు.+
14 అన్నిదేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా,* ఈ రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడుతుంది.+ ఆ తర్వాత అంతం వస్తుంది.
15 “కాబట్టి దానియేలు ప్రవక్త చెప్పినట్టు, నాశనాన్ని కలగజేసే అసహ్యమైన వస్తువు పవిత్ర స్థలంలో ఉండడం మీరు చూసినప్పుడు+ (చదివే వ్యక్తి వివేచన ఉపయోగించాలి),
16 యూదయలో ఉన్నవాళ్లు కొండలకు పారిపోవడం మొదలుపెట్టాలి.
17 డాబా మీదున్న వ్యక్తి ఇంట్లో నుండి వస్తువులు తెచ్చుకోవడానికి కిందికి దిగకూడదు.
18 పొలంలో ఉన్న వ్యక్తి తన పైవస్త్రం తెచ్చుకోవడానికి వెనక్కి రాకూడదు.
19 ఆ రోజుల్లో గర్భిణులకు, పాలిచ్చే స్త్రీలకు శ్రమ!
20 మీరు చలికాలంలోనో, విశ్రాంతి రోజునో పారిపోవాల్సి రాకూడదని ప్రార్థిస్తూ ఉండండి;
21 ఎందుకంటే, అప్పుడు మహాశ్రమ వస్తుంది.+ లోకం పుట్టిన దగ్గర నుండి ఇప్పటివరకు అలాంటి శ్రమ రాలేదు, మళ్లీ రాదు కూడా.+
22 నిజానికి, ఆ రోజులు తగ్గించబడకపోతే ఒక్కరు కూడా తప్పించుకోలేరు; అయితే, ఎంచుకోబడినవాళ్ల కోసం ఆ రోజులు తగ్గించబడతాయి.+
23 “ఎవరైనా మీతో, ‘ఇదిగో! క్రీస్తు ఇక్కడ ఉన్నాడు,’ ‘అదిగో! అక్కడ ఉన్నాడు’ అని అంటే నమ్మకండి.
24 ఎందుకంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు+ పుట్టుకొచ్చి సాధ్యమైతే ఎంచుకోబడినవాళ్లను కూడా మోసం చేయడానికి గొప్పగొప్ప సూచనలు, అద్భుతాలు చేస్తారు.+
25 ఇదిగో! నేను మిమ్మల్ని ముందే హెచ్చరిస్తున్నాను.
26 కాబట్టి ప్రజలు మీతో, ‘ఇదిగో! ఆయన ఎడారిలో ఉన్నాడు’ అని అంటే అక్కడికి వెళ్లకండి; ‘ఇదిగో! ఆయన రహస్య స్థలంలో ఉన్నాడు’ అంటే నమ్మకండి.
27 ఆకాశంలో మెరుపు తూర్పు దిక్కున మొదలై పడమటి దిక్కు వరకు మెరిసినట్టే మానవ కుమారుడి ప్రత్యక్షత* కూడా ఉంటుంది.
28 శవం ఎక్కడ ఉంటే గద్దలు అక్కడ పోగౌతాయి.+
29 “ఆ రోజుల శ్రమ ముగిసిన వెంటనే సూర్యుడు చీకటిమయమౌతాడు,+ చంద్రుడు తన వెలుగు ఇవ్వడు, నక్షత్రాలు ఆకాశం నుండి రాలిపోతాయి, ఆకాశంలోని శక్తులు కదిలించబడతాయి.+
30 అప్పుడు మానవ కుమారుడి సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూమ్మీదున్న అన్నిదేశాల* ప్రజలు దుఃఖంతో గుండెలు బాదుకుంటారు;+ మానవ కుమారుడు శక్తితో, గొప్ప మహిమతో ఆకాశ మేఘాల మీద రావడం వాళ్లు చూస్తారు.+
31 ఆయన గొప్ప బాకా శబ్దంతో తన దూతల్ని పంపిస్తాడు. ఆ దూతలు ఆయన ఎంచుకున్న వాళ్లను* ఆకాశం ఈ చివర నుండి ఆ చివర వరకు నాలుగు దిక్కుల నుండి సమకూరుస్తారు.+
32 “అంజూర చెట్టు ఉదాహరణను* గమనించండి. ఆ చెట్టు కొమ్మలు పచ్చగా, లేతగా తయారై చిగురించగానే ఎండాకాలం దగ్గరపడిందని మీకు తెలుస్తుంది.+
33 అదేవిధంగా, ఇవన్నీ జరగడం మీరు చూసినప్పుడు ఆయన దగ్గర్లోనే అంటే గుమ్మం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి.+
34 నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఇవన్నీ జరిగే వరకు ఈ తరం అస్సలు గతించిపోదు.
35 ఆకాశం, భూమి గతించిపోతాయి కానీ నా మాటలు ఎప్పటికీ నిలిచివుంటాయి.+
36 “ఆ రోజు గురించి, ఆ గంట గురించి ఎవ్వరికీ తెలీదు.+ పరలోకంలోని దూతలకు గానీ, కుమారుడికి గానీ తెలీదు; తండ్రికి మాత్రమే తెలుసు.+
37 మానవ కుమారుడి ప్రత్యక్షత* నోవహు రోజుల్లాగే ఉంటుంది.+
38 జలప్రళయానికి ముందున్న కాలంలో ప్రజలు తింటూ, తాగుతూ, పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నారు; నోవహు ఓడలోకి వెళ్లే రోజు వరకు వాళ్లు అలాగే చేశారు.+
39 జలప్రళయం వచ్చి వాళ్లందర్నీ కొట్టుకొనిపోయే వరకు+ వాళ్లు ఏమీ పట్టించుకోలేదు. మానవ కుమారుడి ప్రత్యక్షత కూడా అలాగే ఉంటుంది.
40 అప్పుడు ఇద్దరు మనుషులు పొలంలో ఉంటారు; ఒకరు తీసుకెళ్లబడతారు, ఇంకొకరు వదిలేయబడతారు.
41 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటారు; ఒకామె తీసుకెళ్లబడుతుంది, ఇంకొకామె వదిలేయబడుతుంది.+
42 కాబట్టి అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే మీ ప్రభువు ఏ రోజు వస్తున్నాడో మీకు తెలీదు.+
43 “అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి, రాత్రి ఏ సమయంలో* దొంగ వస్తున్నాడో+ ఇంటి యజమానికి ముందే తెలిస్తే, అతను మెలకువగా ఉండి ఆ దొంగను ఇంట్లో చొరబడనివ్వడు.+
44 కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి.+ ఎందుకంటే, మీరు అనుకోని సమయంలో* మానవ కుమారుడు వస్తున్నాడు.
45 “తన ఇంట్లోని సేవకులకు తగిన సమయంలో ఆహారం పెట్టేలా యజమాని వాళ్లమీద నియమించిన నమ్మకమైన, బుద్ధిగల* దాసుడు నిజంగా ఎవరు?+
46 యజమాని వచ్చి ఆ దాసుడు అలా చేస్తూ ఉండడం చూస్తే, ఆ దాసుడు సంతోషంగా ఉంటాడు!+
47 నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఆయన ఆ దాసుణ్ణి తన ఆస్తి అంతటి మీద నియమిస్తాడు.
48 “కానీ ఒకవేళ ఆ దాసుడు చెడ్డవాడై, ‘నా యజమాని ఆలస్యం చేస్తున్నాడు’ అని తన హృదయంలో అనుకొని+
49 తన తోటి దాసుల్ని కొడుతూ, తాగుబోతులతో కలిసి తింటూ తాగుతూ ఉంటే,
50 ఆ దాసుడు ఎదురుచూడని రోజున అతనికి తెలియని సమయంలో* యజమాని వచ్చి+
51 అతన్ని అతి కఠినంగా శిక్షిస్తాడు, వేషధారుల మధ్య అతన్ని ఉంచుతాడు. అక్కడే అతను ఏడుస్తూ, పళ్లు కొరుక్కుంటూ ఉంటాడు.+
అధస్సూచీలు
^ లేదా “సహించేవాళ్లే.”
^ లేదా “అన్నిదేశాల ప్రజలు వినేలా.”
^ అక్ష., “అన్ని గోత్రాల.”
^ లేదా “తనవాళ్లను.”
^ లేదా “ఉపమానాన్ని.”
^ అక్ష., “ఏ జామున.”
^ అక్ష., “గంటలో.”
^ లేదా “తెలివిగల.”
^ అక్ష., “గంటలో.”