యెషయా 40:1-31
40 “ఓదార్చండి, నా ప్రజల్ని ఓదార్చండి” అని మీ దేవుడు అంటున్నాడు.+
2 “యెరూషలేముకు ఊరట కలిగేలా మాట్లాడండి,ఆమె సైనిక సేవ పూర్తైందని,ఆమె దోషానికి పరిహారం దొరికిందని+ ఆమెకు ప్రకటించండి.
తన పాపాలన్నిటిని బట్టి ఆమె యెహోవా చేతి నుండి పూర్తి శిక్ష* పొందింది.”+
3 ఎడారిలో ఒక వ్యక్తి* ఇలా అరుస్తున్నాడు:
“యెహోవా మార్గాన్ని సిద్ధం చేయండి!+
మన దేవుని కోసం ఎడారి గుండా తిన్నని రాజమార్గాన్ని+ ఏర్పాటు చేయండి.+
4 ప్రతీ లోయ ఎత్తు చేయబడాలి,ప్రతీ పర్వతం, ప్రతీ కొండ అణచబడాలి.
గరుకైన నేల చదును చేయబడాలి,ఎత్తుపల్లాలు ఉన్న నేల లోయ మైదానంగా చేయబడాలి.+
5 యెహోవా మహిమ వెల్లడి చేయబడుతుంది,+మనుషులంతా దాన్ని చూస్తారు,+ఎందుకంటే, ఆ మాట యెహోవా నోటి నుండి వచ్చింది.”
6 వినండి! ఒకతను, “చాటించండి!” అని అంటున్నాడు;
ఇంకొకతను, “ఏమని చాటించాలి?” అని అడుగుతున్నాడు.
“మనుషులంతా పచ్చగడ్డి లాంటివాళ్లే.
వాళ్ల విశ్వసనీయ ప్రేమంతా గడ్డి పువ్వు లాంటిదే.+
7 యెహోవా తన ఊపిరిని* ఊదినప్పుడుపచ్చగడ్డి ఎండిపోతుంది,దాని పువ్వు వాడిపోతుంది.+
నిజంగా ప్రజలు కేవలం పచ్చగడ్డి లాంటివాళ్లే.
8 పచ్చగడ్డి ఎండిపోతుంది,దాని పువ్వు వాడిపోతుంది,కానీ మన దేవుని వాక్యం ఎప్పటికీ నిలిచివుంటుంది.”+
9 సీయోనుకు శుభవార్త తెస్తున్న ఓ స్త్రీ,ఎత్తైన పర్వతం మీదికి ఎక్కివెళ్లు,
యెరూషలేముకు శుభవార్త తెస్తున్న ఓ స్త్రీ,+నీ స్వరాన్ని బిగ్గరగా వినిపించు,
నీ స్వరాన్ని పెంచు, భయపడకు.
“ఇదిగో, నీ దేవుడు ఇక్కడ ఉన్నాడు” అని యూదా నగరాలకు ప్రకటించు.+
10 ఇదిగో! సర్వోన్నత ప్రభువైన యెహోవా తన శక్తితో వస్తాడు,ఆయన బాహువు ఆయన తరఫున పరిపాలిస్తుంది.+
ఇదిగో! ఆయనిచ్చే ప్రతిఫలం ఆయన దగ్గరే ఉంది,ఆయనిచ్చే జీతం ఆయన ముందే ఉంది.+
11 గొర్రెల కాపరిలా ఆయన తన మంద బాగోగులు చూసుకుంటాడు.*+
గొర్రెపిల్లల్ని ఆయన తన బాహువుతో సమకూరుస్తాడు,వాటిని తన గుండెల మీద మోస్తాడు.
పాలిచ్చే వాటిని ఆయన నిదానంగా నడిపిస్తాడు.+
12 తన దోసిట్లో జలాల్ని కొలిచింది ఎవరు?+తన జేనతో* ఆకాశం కొలతలు తీసుకుంది ఎవరు?
భూమ్మీది మట్టిని కొలపాత్రలోకి పోగుచేసింది ఎవరు?+త్రాసులో పర్వతాల్ని,
తూకంలో కొండల్ని తూచింది ఎవరు?
13 యెహోవా చురుకైన శక్తిని* కొలిచింది* ఎవరు?ఆయనకు సలహాదారుడిగా ఉండి ఎవరు ఆయనకు ఉపదేశించగలరు?+
14 అవగాహన కోసం ఆయన ఎవర్ని సంప్రదించాడు?న్యాయ మార్గాన్ని ఎవరు ఆయనకు బోధించగలరు?జ్ఞానాన్ని ఆయనకు ఎవరు నేర్పగలరు?నిజమైన అవగాహన మార్గాన్ని ఆయనకెవరు చూపించగలరు?+
15 ఇదిగో! దేశాలు చేద నుండి జారే నీటిబొట్టులా ఉన్నాయి,అవి త్రాసు మీది దుమ్ము పొరలా ఉన్నాయి.+
ఇదిగో! సన్నని ధూళిని లేపినట్టు ఆయన ద్వీపాల్ని లేపుతాడు.
16 నిప్పు మండుతూ ఉండడానికి లెబానోను కూడా సరిపోదు,*దహనబలి కోసం దాని అడవి జంతువులు సరిపోవు.
17 దేశాలన్నీ ఆయన ముందు ఉనికిలో లేనట్టే ఉన్నాయి;+ఆయన వాటిని శూన్యంగా, వ్యర్థమైనవిగా ఎంచుతాడు.+
18 మీరు దేవుణ్ణి ఎవరితో పోల్చగలరు?+
ఆయన దేనిలా ఉన్నాడని చెప్పగలరు?+
19 చేతిపనివాడు విగ్రహాన్ని పోతపోస్తాడు,కంసాలి దానికి బంగారు రేకు తొడుగుతాడు,+తర్వాత వెండి గొలుసులు చేస్తాడు.
20 అతను కానుక కోసం ఒక చెట్టును ఎంచుకుంటాడు,+కుళ్లిపోని చెట్టును అతను ఎంచుకుంటాడు.
ఒరిగిపోకుండా ఉండే చెక్కుడు విగ్రహం తయారుచేయడానికిఅతను నైపుణ్యంగల చేతిపనివాడి కోసం వెతుకుతాడు.+
21 నీకు తెలీదా?
నువ్వు వినలేదా?
మొదటినుండి ఎవరూ నీకు చెప్పలేదా?
భూమి పునాదులు వేయబడినప్పటి నుండి నీకది అర్థంకాలేదా?+
22 దేవుడు భూగోళానికి* పైన నివసిస్తున్నాడు,+దాని నివాసులు మిడతల్లా* ఉన్నారు.
పలుచని తెరను విప్పినట్టు ఆయన ఆకాశాన్ని విప్పుతున్నాడు,నివసించడం కోసం డేరాను చాపినట్టు దాన్ని చాపుతాడు.+
23 ఉన్నతాధికారుల్ని ఆయన కిందికి దించుతాడు,భూమ్మీది న్యాయమూర్తుల్ని* వ్యర్థమైన వాళ్లుగా చేస్తాడు.
24 వాళ్లు ఇంకా సరిగ్గా నాటబడలేదు,ఇంకా సరిగ్గా విత్తబడలేదు,వాళ్ల కాండం ఇంకా భూమిలో వేరు తన్నలేదు,వాళ్లమీద ఊదగానే వాళ్లు ఎండిపోతారు,కొయ్యకాలు* గాలికి ఎగిరిపోయినట్టు వాళ్లు ఎగిరిపోతారు.+
25 “నన్ను ఎవరితో పోలుస్తారు, నేను ఎవరితో సమానమని చెప్తారు?” అని పవిత్రుడైన దేవుడు అడుగుతున్నాడు.
26 “మీ కళ్లు పైకెత్తి ఆకాశాన్ని చూడండి.
వీటిని ఎవరు సృష్టించారు?+
వాటిలో ఒక్కోదాన్ని లెక్కపెడుతూ వాటి సైన్యాన్ని బయటికి తీసుకొస్తున్న దేవుడే కదా;ఆయన వాటన్నిటినీ పేరు పెట్టి పిలుస్తాడు.+
ఆయనకు అపారమైన శక్తి,* సంభ్రమాశ్చర్యాలు పుట్టించే బలం ఉన్నాయి+ కాబట్టివాటిలో ఒక్కటి కూడా తప్పిపోదు.
27 యాకోబూ, నువ్వెందుకు ఇలా అంటున్నావు?ఇశ్రాయేలూ, ‘నా మార్గం యెహోవాకు కనిపించదు,దేవుని వల్ల నాకు న్యాయం జరగదు’ అని నువ్వెందుకు అంటున్నావు?+
28 నీకు తెలీదా? నువ్వు వినలేదా?
భూమి అంచుల్ని సృష్టించిన యెహోవా ఎప్పటికీ దేవుడే.+
ఆయన ఎప్పుడూ సొమ్మసిల్లడు, అలసిపోడు.+
ఆయన అవగాహనను శోధించడం సాధ్యంకాదు.+
29 అలసిపోయిన వాళ్లకు ఆయన శక్తినిస్తాడు,బలం* లేనివాళ్లకు పూర్తి బలాన్ని ఇస్తాడు.+
30 బాలురు సొమ్మసిల్లుతారు, అలసిపోతారు,యువకులు తొట్రిల్లి పడిపోతారు.
31 అయితే యెహోవా మీద ఆశపెట్టుకున్న వాళ్లు కొత్త బలం పొందుతారు.
గద్దలా రెక్కలు చాపి వాళ్లు పైకి ఎగురుతారు.+
అలసిపోకుండా పరుగెత్తుతారు;సొమ్మసిల్లకుండా నడుచుకుంటూ వెళ్తారు.”+
అధస్సూచీలు
^ లేదా “రెండంతలు.”
^ అక్ష., “వ్యక్తి స్వరం.”
^ పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
^ లేదా “మందను కాస్తాడు.”
^ అరచేతిని చాచినప్పుడు బొటన వేలి కొన నుండి చిటికెన వేలి కొన వరకు ఉండే దూరం. అనుబంధం B14 చూడండి.
^ లేదా “మనసును.” పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
^ లేదా “అర్థం చేసుకుంది” అయ్యుంటుంది.
^ లేదా “కావల్సినన్ని కట్టెలు సరఫరా చేయలేదు.”
^ లేదా “గుండ్రటి భూమికి.”
^ లేదా “గొల్లభామల్లా.”
^ లేదా “పరిపాలకుల్ని.”
^ పంట కోసిన తర్వాత నేలమీద మిగిలే కాడల దుబ్బు.
^ లేదా “చలనశక్తి.”
^ లేదా “చలనశక్తి.”