యోబు 6:1-30
6 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:
2 “నా వేదన+ పూర్తిగా తూచబడితే బావుండు!నా ఆపదతో పాటు దాన్ని త్రాసులో ఉంచితే బావుండు!
3 అది సముద్రపు ఇసుక కన్నా బరువుగా ఉంది.
అందుకే నేను వెర్రిమాటలు* మాట్లాడాను.+
4 సర్వశక్తిమంతుని బాణాలు నాలోకి దూసుకెళ్లాయి,నా శరీరం వాటి విషాన్ని తాగుతోంది;+దేవుడు నా మీద దాడి చేస్తున్నాడు, నేను చాలా భయపడుతున్నాను.
5 గడ్డి ఉండగా అడవి గాడిద+ ఓండ్ర పెడుతుందా?మేత ఉండగా ఎద్దు రంకె వేస్తుందా?
6 రుచిలేని ఆహారాన్ని ఉప్పు కలపకుండా తింటారా?గుడ్డు సొనకు రుచి ఉంటుందా?
7 వాటిని ముట్టుకోవడం కూడా నాకు ఇష్టముండదు.
అవి నాకు కలుషితమైన ఆహారం లాంటివి.
8 నా విన్నపం నెరవేరితే బావుండు,దేవుడు నా కోరికను తీరిస్తే బావుండు!
9 నన్ను నలగ్గొట్టడం దేవునికి ఇష్టమవ్వాలి,ఆయన తన చెయ్యి చాపి నన్ను చంపేయాలి!+
10 చివరికి అది కూడా నాకు ఓదార్పునిస్తుంది;తీవ్రమైన బాధలో ఉన్నా నేను ఆనందంతో గంతులు వేస్తాను,ఎందుకంటే, పవిత్రుడైన దేవుని+ మాటల్ని నేను తిరస్కరించలేదు.
11 ఇంకా ఎదురుచూస్తూ ఉండే శక్తి నాకుందా?+
నా కోసం ఏం మంచి మిగిలివుందని నేనింకా బ్రతకాలి?
12 నా బలం రాళ్ల లాంటిదా?
నా శరీరం రాగితో చేయబడిందా?
13 ఎవరూ నాకు సహాయం చేయట్లేదు,మరి నాకు నేను ఏ విధంగా సహాయం చేసుకోగలను?
14 సాటిమనిషి పట్ల విశ్వసనీయ ప్రేమ చూపించకుండా ఉండేవాడు,+సర్వశక్తిమంతునికి భయపడడం కూడా మానేస్తాడు.+
15 నా స్నేహితులు* చలికాలపు వాగులా నమ్మదగని వాళ్లు,+వాళ్లు చలికాలంలో ప్రవహించి ఎండిపోయే కాలువల్లా ఉన్నారు.
16 అవి మంచు వల్ల నల్లబడతాయి,కరిగే మంచు వాటిలో దాగివుంటుంది.
17 అయితే వేసవికాలంలో అవి ఎండిపోయి లేకుండా పోతాయి;ఎండలు ఎక్కువైనప్పుడు ఇంకిపోతాయి.
18 అవి వంపులు తిరుగుతూ ప్రవహిస్తాయి;ఎడారిలోకి వెళ్లి కనుమరుగౌతాయి.
19 తేమా+ వర్తకులు వాటి కోసం చూస్తారు;షేబ+ ప్రయాణికులు* వాటి కోసం ఎదురుచూస్తారు.
20 వాటిని నమ్ముకున్నందుకు వాళ్లు సిగ్గుపడతారు;నిరాశపడడానికే వాళ్లు అక్కడికి వస్తారు.
21 మీరు కూడా నాకు అలానే ఉన్నారు;+నాకు వచ్చిన కష్టం ఎంత ఘోరమైనదో చూసి భయపడుతున్నారు.+
22 ‘నాకేమైనా ఇవ్వండి’ అని నేను మీతో అన్నానా?
లేదా మీ ఆస్తిలో నుండి నాకొక బహుమానం ఇవ్వమని అడిగానా?
23 శత్రువు చేతి నుండి నన్ను కాపాడమని గానీఅణచివేసేవాళ్ల నుండి రక్షించమని* గానీ అడిగానా?
24 నాకు ఉపదేశించండి, నేను మౌనంగా ఉంటాను;+నా తప్పేంటో తెలుసుకునేలా నాకు సహాయం చేయండి.
25 నిజాయితీగా మాట్లాడే మాటలు బాధపెట్టవు!+
కానీ మీ గద్దింపుల వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా?+
26 నా మాటల్ని సరిదిద్దాలని మీరు అనుకుంటున్నారా?అవి కృంగిపోయినవాడి మాటలు,+ గాలికి కొట్టుకుపోయే మాటలు.
27 మీరు అనాథల కోసం చీట్లు* వేస్తారు,+మీ సొంత స్నేహితుణ్ణే అమ్మేస్తారు!+
28 కాబట్టి ఇటు తిరిగి నా వైపు చూడండి,నేను మీతో అబద్ధాలు చెప్పను.
29 దయచేసి ఇంకోసారి ఆలోచించండి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి;అవును, ఇంకోసారి ఆలోచించండి, నేను ఇప్పటికీ నీతిమంతుణ్ణే.
30 నా నాలుక అన్యాయంగా మాట్లాడుతోందా?
నా అంగిలి తప్పును పసిగట్టలేదా?
అధస్సూచీలు
^ లేదా “దురుసుగా, ఆలోచించకుండా.”
^ అక్ష., “సొంత సహోదరులు.”
^ లేదా “సెబాయీయుల ప్రయాణికుల గుంపు.”
^ అక్ష., “విడిపించమని.”