రూతు 2:1-23

  • బోయజు పొలంలో రూతు పరిగె ​ఏరుకోవడం (1-3)

  • రూతు, బోయజు కలుసుకోవడం (4-16)

  • బోయజు చూపించిన దయ గురించి రూతు నయోమికి చెప్పడం (17-23)

2  నయోమికి తన భర్త తరఫు బంధువు ఒకతను ఉన్నాడు; అతను చాలా ధనవంతుడు; అతని పేరు బోయజు,+ అతను ఎలీమెలెకు వంశానికి చెందినవాడు.  మోయాబీయురాలైన రూతు నయోమితో, “దయచేసి నన్ను పొలాల్లోకి వెళ్లనివ్వు. నేను వెళ్లి నా మీద దయ చూపించేవాళ్ల వెనక పరిగె ఏరుకుంటాను”+ అంది. అప్పుడు నయోమి, “సరే అమ్మా,* వెళ్లు” అంది.  దాంతో ఆమె పొలాల్లోకి వెళ్లి కోత కోసేవాళ్ల వెనక పరిగె ఏరుకోవడం మొదలుపెట్టింది. అనుకోకుండా ఆమె ఎలీమెలెకు+ వంశానికి చెందిన బోయజు+ పొలంలోకి వచ్చింది.  సరిగ్గా అప్పుడే బోయజు బేత్లెహేము నుండి వచ్చి, కోత కోసేవాళ్లతో “యెహోవా మీకు తోడుండాలి” అన్నాడు. అందుకు వాళ్లు, “యెహోవా నిన్ను దీవించాలి” అన్నారు.  తర్వాత బోయజు కోత కోసేవాళ్ల మీద అధికారిగా ఉన్న యువకుడిని, “ఆ అమ్మాయి ఎవరి తాలూకా?” అని అడిగాడు.  అందుకు ఆ యువకుడు ఇలా జవాబిచ్చాడు: “ఆ అమ్మాయి మోయాబీయురాలు.+ ఆమె నయోమితోపాటు మోయాబు ప్రాంతం నుండి వచ్చింది.+  ఆమె, ‘నేను పరిగె ఏరుకోవచ్చా?+ కోత కోసేవాళ్లు వదిలేసిన ధాన్యపు వెన్నుల్ని* పోగేసుకోవచ్చా?’ అని నన్ను అడిగింది. ఆమె పొద్దున వచ్చినప్పటి నుండి పనిచేస్తూనే ఉంది. ఇప్పుడే కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి నీడపట్టున* కూర్చుంది.”  అప్పుడు బోయజు రూతుతో ఇలా అన్నాడు: “అమ్మా,* నా మాట విను. పరిగె ఏరుకోవడానికి వేరే పొలానికి వెళ్లకు, ఇంకెక్కడికీ వెళ్లకు; నా పొలంలో పనిచేసే అమ్మాయిలతోనే ఉండు.+  వాళ్లు ఎక్కడ కోత కోస్తున్నారో చూస్తూ, వాళ్లతోపాటే వెళ్లు. నిన్ను ఇబ్బంది పెట్టొద్దని* నా దగ్గర పనిచేసే అబ్బాయిలకు చెప్పాను. నీకు దాహం వేసినప్పుడు కుండల దగ్గరికెళ్లి ఆ అబ్బాయిలు చేదిన నీళ్లు తాగు.” 10  దాంతో ఆమె నేలమీద పడి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో, “నేను నీ దృష్టిలో ఎందుకు దయ పొందానో, పరదేశినైన+ నా గురించి నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావో తెలుసుకోవచ్చా?” అంది. 11  బోయజు ఆమెతో ఇలా అన్నాడు: “నీ భర్త చనిపోయిన తర్వాత నువ్వు నీ అత్త కోసం చేసిన దానంతటి గురించి నేను విన్నాను. అలాగే నువ్వు నీ తండ్రిని, తల్లిని, నీ బంధువుల దేశాన్ని విడిచి నీకు ఇంతకుముందు తెలియని ప్రజల దగ్గరికి రావడం గురించి కూడా నేను విన్నాను.+ 12  నువ్వు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇవ్వాలి,+ నువ్వు ఎవరి రెక్కల కిందైతే ఆశ్రయం పొందడానికి వచ్చావో ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా+ నీకు తగిన జీతాన్ని* ఇవ్వాలి.” 13  అందుకామె, “నా ప్రభువా, నీ దయ నా మీద ఇలాగే ఉండనివ్వు. ఎందుకంటే నేను నీ సేవకురాలిని కూడా కాదు, అయినా నువ్వు నన్ను ఓదార్చావు, నీ మాటలతో నీ సేవకురాలికి అభయమిచ్చావు” అని అంది. 14  భోజన సమయమప్పుడు బోయజు ఆమెతో, “ఇక్కడికి వచ్చి భోజనం చేయి, నీ రొట్టె ముక్కను పుల్లటి ద్రాక్షారసంలో ముంచుకో” అన్నాడు. దాంతో ఆమె కోత కోసేవాళ్ల పక్కన కూర్చుంది. అప్పుడతను ఆమెకు కొంత వేయించిన ధాన్యాన్ని ఇచ్చాడు, ఆమె కడుపునిండా తింది, కొంత మిగిలింది కూడా. 15  ఆమె పరిగె ఏరుకోవడానికి+ లేచినప్పుడు బోయజు తన దగ్గర పనిచేసే అబ్బాయిలకు ఇలా ఆజ్ఞాపించాడు: “ఆమెను ధాన్యపు వెన్నుల* మధ్య కూడా పరిగె ఏరుకోనివ్వండి, ఆమెను ఇబ్బంది పెట్టకండి.+ 16  అంతేకాదు, మీరు పనల్లో నుండి కొన్ని వెన్నుల్ని తీసి ఆమె ఏరుకోవడానికి వదిలేయండి, ఆమెకు అడ్డు చెప్పకండి.” 17  ఆమె సాయంత్రం వరకు పొలంలో పరిగె ఏరుకుంటూనే ఉంది.+ ఆమె తాను ఏరుకున్న వెన్నుల్ని దుల్లగొట్టినప్పుడు, దాదాపు ఒక ఈఫా* బార్లీ గింజలు వచ్చాయి. 18  ఆమె వాటిని తీసుకుని నగరంలోకి వెళ్లింది. ఆమె ఏరుకొని తెచ్చిన గింజల్ని ఆమె అత్త చూసింది. రూతు తాను కడుపునిండా తిన్న తర్వాత మిగిలిన ఆహారాన్ని+ కూడా తీసి అత్తకు ఇచ్చింది. 19  అప్పుడు నయోమి ఆమెతో, “ఇవాళ నువ్వు ఎక్కడ పరిగె ఏరుకున్నావు? ఎక్కడ పనిచేశావు? నీ మీద దయ చూపించిన వ్యక్తి దీవించబడాలి”+ అంది. దాంతో ఆమె తాను ఎవరి పొలంలో పనిచేసిందో తన అత్తకు చెప్తూ, “నేను ఇవాళ బోయజు అనే అతని పొలంలో పని చేశాను” అంది. 20  అప్పుడు నయోమి తన కోడలితో, “బ్రతికి ఉన్నవాళ్ల పట్ల, చనిపోయినవాళ్ల పట్ల తన విశ్వసనీయ ప్రేమ చూపించడం మానని యెహోవా అతన్ని దీవించాలి”+ అంది. ఆమె ఇంకా ఇలా అంది: “బోయజు మన బంధువు.+ అతను మనల్ని తిరిగి కొనగల వ్యక్తుల్లో ఒకడు.”*+ 21  అప్పుడు మోయాబీయురాలైన రూతు ఇలా అంది: “అతను, ‘నా పంట మొత్తం కోత కోసేవరకు నా పనివాళ్లతోనే ఉండు’ అని కూడా నాతో అన్నాడు.”+ 22  నయోమి తన కోడలు రూతుతో, “అమ్మా,* నువ్వు వేరే పొలంలోకి వెళ్లి వేధింపులకు లోనయ్యే కన్నా అతని పనమ్మాయిలతో కలిసి పనిచేయడమే మంచిది” అంది. 23  కాబట్టి ఆమె బార్లీ కోత,+ గోధుమల కోత ముగిసే వరకు బోయజు దగ్గర పనిచేసే అమ్మాయిలతోనే ఉండి పరిగె ఏరుకుంది. ఆమె తన అత్తతోపాటే నివసిస్తూ ఉంది.+

అధస్సూచీలు

అక్ష., “నా కూతురా.”
లేదా “పనల్ని” అయ్యుంటుంది.
లేదా “మంచె కింద; పందిరి కింద.”
అక్ష., “నా కూతురా.”
లేదా “ముట్టొద్దని.”
లేదా “పూర్తి ప్రతిఫలాన్ని.”
లేదా “పనల” అయ్యుంటుంది.
దాదాపు 22 లీటర్లు (13 కిలోలు). అనుబంధం B14 చూడండి.
లేదా “తిరిగి కొనే (విడిపించే) హక్కు ఉన్న మన బంధువుల్లో ఒకడు.”
అక్ష., “నా కూతురా.”