లేవీయకాండం 5:1-19
5 “ ‘జరిగిన ఒక తప్పు గురించి సాక్ష్యం చెప్పమనే పిలుపు* వచ్చినప్పుడు, ఆ తప్పు విషయంలో సాక్షిగా ఉన్న, లేదా దాన్ని చూసిన, లేదా దాని గురించి తెలిసిన ఒక వ్యక్తి దాని గురించి చెప్పకుండా పాపం చేస్తే,+ అతను తన తప్పుకు లెక్క అప్పజెప్పాల్సి ఉంటుంది.
2 “ ‘లేదా ఒక వ్యక్తి అపవిత్రమైన దేన్నైనా అంటే అపవిత్రమైన అడవి జంతువు కళేబరాన్ని గానీ, అపవిత్రమైన సాధు జంతువు కళేబరాన్ని గానీ, గుంపులుగుంపులుగా తిరిగే అపవిత్రమైన చిన్నచిన్న ప్రాణుల్లో ఒకదాని కళేబరాన్ని గానీ ముట్టుకుంటే+ అతను అపవిత్రుడౌతాడు, అతను ఆ విషయాన్ని గ్రహించకపోయినా అపరాధి అవుతాడు.
3 లేదా ఒక వ్యక్తి తనను అపవిత్రుణ్ణి చేసే దేన్నైనా తెలియక ముట్టుకొనివుంటే,+ తర్వాత ఆ విషయం అతనికి తెలిస్తే, అతను అపరాధి అవుతాడు.
4 “ ‘లేదా ఒక వ్యక్తి మంచే గానీ, చెడే గానీ, దేన్నైనా చేస్తానని తనకు తెలియకుండానే అనాలోచితంగా ఒట్టు వేసి, తాను అనాలోచితంగా ఒట్టు వేశానని ఆ తర్వాత గ్రహిస్తే, అతను అపరాధి అవుతాడు.*+
5 “ ‘ఒకవేళ అతను వీటిలో దేని విషయంలోనైనా అపరాధి అయితే, అతను ఏ రకంగా పాపం చేశాడో ఒప్పుకోవాలి.+
6 అంతేకాదు, తాను చేసిన పాపాన్ని బట్టి అతను యెహోవా దగ్గరికి అపరాధ పరిహారార్థ బలిని తీసుకురావాలి.+ అతను తన మందలోని ఆడదాన్ని, అంటే ఆడ గొర్రెపిల్లను గానీ, ఆడ మేకపిల్లను గానీ పాపపరిహారార్థ బలిగా తీసుకురావాలి. అప్పుడు యాజకుడు అతని కోసం అతని పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు.
7 “ ‘ఒకవేళ గొర్రెను అర్పించేంత స్తోమత అతనికి లేకపోతే, అతను తన పాపాన్ని బట్టి అపరాధ పరిహారార్థ బలిగా రెండు గువ్వల్ని గానీ రెండు పావురం పిల్లల్ని గానీ యెహోవా దగ్గరికి తీసుకురావాలి.+ ఒకటి పాపపరిహారార్థ బలి కోసం, ఇంకొకటి దహనబలి కోసం.+
8 అతను వాటిని యాజకుని దగ్గరికి తీసుకురావాలి. యాజకుడు మొదట ఒకదాన్ని పాపపరిహారార్థ బలిగా అర్పిస్తాడు. అతను దాని తల విడిపోకుండా గొంతు దగ్గర తుంచుతాడు.
9 అతను ఆ పాపపరిహారార్థ బలి రక్తంలో కొంత తీసుకొని బలిపీఠానికి ఒకవైపున చిమ్ముతాడు, మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగుభాగాన ఒలికిస్తాడు.+ ఇది పాపపరిహారార్థ బలి.
10 అతను ఇంకో దాన్ని తీసుకొని ఎప్పుడూ అర్పించే పద్ధతిలోనే దహనబలి అర్పిస్తాడు;+ అతను చేసిన పాపానికి యాజకుడు అతని కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు, అప్పుడు అతను క్షమాపణ పొందుతాడు.+
11 “ ‘ఒకవేళ అతనికి రెండు గువ్వల్ని గానీ, రెండు పావురం పిల్లల్ని గానీ అర్పించేంత స్తోమత లేకపోతే, అతను తన పాపాన్ని బట్టి ఈఫాలో పదోవంతు*+ మెత్తని పిండిని పాపపరిహారార్థ బలిగా తీసుకురావాలి. అతను దానిలో నూనె కలపకూడదు, దాని మీద సాంబ్రాణి పెట్టకూడదు. ఎందుకంటే అది పాపపరిహారార్థ బలి.
12 అతను దాన్ని యాజకుని దగ్గరికి తీసుకొస్తాడు. ఆ యాజకుడు జ్ఞాపకార్థ* భాగంగా దానిలో నుండి పిడికెడు పిండిని తీసుకొని, బలిపీఠంపై యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణల మీద వేసి పొగ పైకిలేచేలా కాలుస్తాడు. ఇది పాపపరిహారార్థ బలి.
13 అతను వాటిలో ఏ పాపం చేసినా, అతను చేసిన పాపాన్ని బట్టి యాజకుడు అతని కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు, అప్పుడతను క్షమాపణ పొందుతాడు.+ ధాన్యార్పణలోలాగే, ఈ బలిలో కూడా మిగిలిన భాగం యాజకునికి చెందుతుంది.’ ”+
14 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు:
15 “యెహోవాకు చెందిన పవిత్రమైన వాటి విషయంలో ఎవరైనా అనుకోకుండా పాపం చేసి నమ్మకద్రోహానికి పాల్పడితే,+ అతను తన మందలో నుండి ఏ లోపంలేని పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా దగ్గరికి తీసుకురావాలి;+ దాని విలువ పవిత్ర స్థల షెకెల్* కొలమానం ప్రకారం వెండి షెకెల్లలో* నిర్ణయించబడుతుంది.+
16 పవిత్ర స్థలానికి వ్యతిరేకంగా తాను చేసిన పాపానికి అతను పరిహారం చెల్లిస్తాడు, అంతేకాదు దాని విలువలో ఐదోవంతును దానికి కలుపుతాడు.+ అతను దాన్ని యాజకునికి ఇస్తాడు. అప్పుడు యాజకుడు, అపరాధ పరిహారార్థ బలి కోసం తెచ్చిన పొట్టేలుతో అతని కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు,+ అతను క్షమాపణ పొందుతాడు.+
17 “ఒకవేళ ఎవరైనా, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో ఒకదాన్ని చేసి పాపం చేస్తే, ఆ విషయం అతనికి తెలియకపోయినా, అతను అపరాధి అవుతాడు, అతను తన తప్పుకు జవాబు చెప్పాల్సి ఉంటుంది.+
18 నిర్ణయించబడిన విలువ ప్రకారం, అతను తన మందలో నుండి ఏ లోపంలేని ఒక పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా యాజకుని దగ్గరికి తీసుకురావాలి.+ అతను అనుకోకుండా, తెలియక చేసిన తప్పుకు యాజకుడు అతని కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు, అతను క్షమాపణ పొందుతాడు.
19 ఇది అపరాధ పరిహారార్థ బలి. ఎందుకంటే, ఖచ్చితంగా అతను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసి అపరాధి అయ్యాడు.”
అధస్సూచీలు
^ అక్ష., “శాపంతో (ఒట్టుతో) కూడిన స్వరం.” ఇది బహుశా, తప్పు చేసిన వ్యక్తిని గానీ సాక్ష్యం చెప్పనందుకు సాక్షిని గానీ శపిస్తూ, జరిగిన తప్పు గురించి చేసే ఒక ప్రకటన అయ్యుండవచ్చు.
^ అతను తన ఒట్టును నెరవేర్చట్లేదని ఇది సూచిస్తుండవచ్చు.
^ అప్పట్లో ఈఫాలో పదోవంతు 2.2 లీటర్లతో (1.3 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
^ లేదా “ప్రాతినిధ్య.”
^ లేదా “పవిత్ర షెకెల్.”
^ అప్పట్లో ఒక షెకెల్ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.