రెండో కొరింథీయులు 6:1-18
6 దేవుని తోటిపనివాళ్లమైన మేము+ మిమ్మల్ని వేడుకుంటున్నాం, దేవుని అపారదయను పొందిన మీరు దాని ఉద్దేశాన్ని మర్చిపోకండి.+
2 ఎందుకంటే, “అనుకూల సమయంలో నీ మొర విన్నాను, రక్షణ రోజున నీకు సహాయం చేశాను”+ అని దేవుడు చెప్తున్నాడు. ఇదిగో! ఇదే చాలా అనుకూలమైన సమయం. ఇదిగో! ఇదే రక్షణ రోజు.
3 మా పరిచర్యను తప్పుబట్టే అవకాశం ఏమాత్రం ఇవ్వకూడదని, మేము ఎవ్వరికీ ఏ విషయంలోనూ ఎలాంటి ఆటంకం కలిగించట్లేదు;+
4 బదులుగా, అన్నివిధాలా మమ్మల్ని మేము దేవుని పరిచారకులుగా సిఫారసు చేసుకుంటున్నాం:+ మేము ఎంతో సహించాం; శ్రమల్ని, ఇబ్బందుల్ని, కష్టాల్ని ఎదుర్కొన్నాం;+
5 దెబ్బలు తిన్నాం, చెరసాలల్లో ఉన్నాం,+ అల్లరిమూకల్ని ఎదుర్కొన్నాం, కష్టపడి పనిచేశాం, నిద్రలేని రాత్రులు గడిపాం, కొన్నిసార్లు పస్తులున్నాం;+
6 స్వచ్ఛమైన జీవితం గడుపుతున్నాం, జ్ఞానం ప్రకారం నడుచుకుంటున్నాం, ఓర్పునూ+ దయనూ చూపిస్తున్నాం, పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం నడుచుకుంటున్నాం, వేషధారణలేని ప్రేమ+ చూపిస్తున్నాం,
7 నిజం మాట్లాడుతున్నాం, దేవుని శక్తి మీద ఆధారపడుతున్నాం;+ కుడిచేతితో,* ఎడమచేతితో* నీతి ఆయుధాలు+ పట్టుకున్నాం;
8 కొందరు మమ్మల్ని గౌరవిస్తున్నారు, కొందరు అవమానిస్తున్నారు; కొందరు మా గురించి చెడుగా మాట్లాడుతున్నారు, కొందరు మంచిగా మాట్లాడుతున్నారు. ప్రజలు మమ్మల్ని మోసగాళ్లుగా ఎంచుతున్నారు, కానీ మేము నిజమే మాట్లాడుతున్నాం;
9 తెలియనివాళ్లుగా చూస్తున్నారు, కానీ మేము బాగా తెలిసినవాళ్లమే; చనిపోతున్నవాళ్లుగా* ఎంచుతున్నారు, కానీ ఇదిగో! బ్రతికే ఉన్నాం;+ శిక్షించబడినవాళ్లుగా* చూస్తున్నారు, కానీ మేము చనిపోలేదు;+
10 దుఃఖంలో ఉన్నవాళ్లుగా ఎంచుతున్నారు, కానీ మేము ఎప్పుడూ సంతోషంగానే ఉన్నాం; పేదవాళ్లుగా ఎంచుతున్నారు, కానీ చాలామందిని ధనవంతులుగా చేస్తున్నాం; ఏమీ లేనివాళ్లుగా ఎంచుతున్నారు, కానీ మా దగ్గర అన్నీ ఉన్నాయి.+
11 కొరింథీయులారా, మేము దాపరికం లేకుండా మాట్లాడుతున్నాం, మీ కోసం మా హృదయాల్ని విశాలం చేసుకున్నాం.
12 మీ మీద ప్రేమ* చూపించే విషయంలో మేము ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు,+ కానీ మీరు మాత్రం మా మీద ప్రేమ* చూపించే విషయంలో హద్దులు పెట్టుకున్నారు.
13 అందుకే, మీరు నా పిల్లలు అనుకొని చెప్తున్నాను, మీరు కూడా మీ హృదయాల్ని విశాలం చేసుకోండి.+
14 అవిశ్వాసులతో జతకట్టకండి.*+ నీతికి, అవినీతికి పొత్తు ఉంటుందా?+ వెలుగుకు, చీకటికి సంబంధం ఉంటుందా?+
15 క్రీస్తుకు, బెలియాలుకు* పొంతన ఉంటుందా?+ విశ్వాసికి,* అవిశ్వాసికి పోలిక* ఉంటుందా?+
16 దేవుని ఆలయంలో విగ్రహాలకు చోటు ఉంటుందా?+ మనం జీవంగల దేవుని ఆలయంగా ఉన్నాం;+ ఎందుకంటే దేవుడు ఇలా చెప్పాడు: “నేను వాళ్ల మధ్య నివసిస్తాను,+ వాళ్ల మధ్య నడుస్తాను, నేను వాళ్ల దేవుడిగా ఉంటాను, వాళ్లు నా ప్రజలుగా ఉంటారు.”+
17 “ ‘అందుకే, మీరు వాళ్ల మధ్య నుండి బయటికి వచ్చేసి, వేరుగా ఉండండి,’ ‘అపవిత్రమైనదాన్ని ముట్టకండి,’+ అని యెహోవా* చెప్తున్నాడు”; “ ‘అప్పుడు, నేను మిమ్మల్ని స్వీకరిస్తాను.’ ”+
18 “ ‘నేను మీకు తండ్రిని అవుతాను,+ మీరు నాకు కుమారులు, కూతుళ్లు అవుతారు’+ అని సర్వశక్తిమంతుడైన యెహోవా* చెప్తున్నాడు.”
అధస్సూచీలు
^ బహుశా రక్షించుకోవడానికి కావచ్చు.
^ బహుశా దాడి చేయడానికి కావచ్చు.
^ లేదా “మరణానికి అర్హులుగా.”
^ లేదా “క్రమశిక్షణలో పెట్టబడినవాళ్లుగా.”
^ లేదా “వాత్సల్యం.”
^ లేదా “వాత్సల్యం.”
^ లేదా “ఎగుడుదిగుడు కాడి కిందికి వెళ్లకండి.”
^ లేదా “భాగం.”
^ లేదా “నమ్మకమైన వ్యక్తికి.”
^ “పనికిమాలిన” అనే అర్థమున్న హీబ్రూ పదం నుండి వచ్చింది. సాతానును సూచిస్తోంది.
^ అనుబంధం A5 చూడండి.
^ అనుబంధం A5 చూడండి.