దినవృత్తాంతాలు రెండో గ్రంథం 16:1-14

  • సిరియాతో ఆసా ఒప్పందం (1-6)

  • ఆసాను హనానీ మందలించడం (7-10)

  • ఆసా మరణం (11-14)

16  ఆసా పరిపాలనలోని 36వ సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజైన బయెషా+ యూదా మీదికి వచ్చి రామాను+ కట్టించడం* మొదలుపెట్టాడు. యూదా రాజైన ఆసా దగ్గర నుండి ఎవ్వరూ రాకుండా, అతని దగ్గరికి ఎవ్వరూ వెళ్లకుండా* చేయడానికి బయెషా అలా చేశాడు.+  అప్పుడు ఆసా యెహోవా మందిరంలోని ఖజానాల్లో, రాజభవనంలోని ఖజానాల్లో ఉన్న వెండిబంగారాల్ని తీసి+ దమస్కులో ఉంటున్న సిరియా రాజైన బెన్హదదుకు పంపించాడు;+ ఆసా అతనికి ఈ సందేశం పంపాడు:  “నాకూ నీకూ మధ్య, నా తండ్రికీ నీ తండ్రికీ మధ్య సంధి* ఉంది. నేను వెండిబంగారాల్ని పంపిస్తున్నాను. నువ్వు వచ్చి, ఇశ్రాయేలు రాజైన బయెషా నా దగ్గర నుండి వెళ్లిపోయేలా, అతనితో నువ్వు చేసుకున్న సంధిని* రద్దు చేసుకో.”  బెన్హదదు ఆసా రాజు మాటకు ఒప్పుకుని, తన సైన్యాధిపతుల్ని ఇశ్రాయేలు నగరాల మీదికి పంపించాడు. వాళ్లు ఈయోనును,+ దానును,+ ఆబేల్‌-మయీమును, నఫ్తాలి నగరాల్లోని గోదాములన్నిటినీ నాశనం చేశారు.+  బయెషా అది విన్న వెంటనే రామాను కట్టించడం* ఆపేశాడు.  ఆసా యూదావాళ్లందర్నీ తీసుకెళ్లాడు, వాళ్లు రామాను+ కట్టించడానికి బయెషా ఉపయోగించిన రాళ్లను, మ్రానుల్ని మోసుకెళ్లారు.+ రాజైన ఆసా వాటితో గెబాను,+ మిస్పాను+ కట్టించాడు.*  అప్పుడు దీర్ఘదర్శి హనానీ,+ యూదా రాజైన ఆసా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “నువ్వు నీ దేవుడైన యెహోవా మీద ఆధారపడకుండా, సిరియా రాజు మీద ఆధారపడ్డావు* కాబట్టి, సిరియా రాజు సైన్యం నీ చేతిలో నుండి తప్పించుకుంది.+  ఇతియోపీయుల దగ్గర, లిబియావాళ్ల దగ్గర ఎన్నో రథాలు, గుర్రపురౌతులు గల గొప్ప సైన్యం ఉంది కదా? అయినా నువ్వు యెహోవా మీద ఆధారపడ్డావు కాబట్టి ఆయన వాళ్లను నీ చేతికి అప్పగించాడు.+  ఎవరి హృదయమైతే తన పట్ల సంపూర్ణంగా* ఉంటుందో వాళ్ల తరఫున తన బలం* చూపించడానికి+ యెహోవా కళ్లు భూమంతటా సంచరిస్తూ ఉన్నాయి.+ నువ్వు ఈ విషయంలో మూర్ఖంగా ప్రవర్తించావు; ఇప్పటినుండి నీ మీద యుద్ధాలు జరుగుతాయి.”+ 10  అయితే, దీర్ఘదర్శి చెప్పిన ఆ మాటల్ని బట్టి ఆసా నొచ్చుకొని, అతని మీద బాగా కోప్పడి చెరసాలలో* వేయించాడు. అదే సమయంలో ఆసా మిగతా ప్రజల్ని కూడా అణచివేయడం మొదలుపెట్టాడు. 11  ఆసా చరిత్ర మొదటి నుండి చివరి వరకు యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాయబడివుంది.+ 12  ఆసా పరిపాలనలోని 39వ సంవత్సరంలో అతనికి పాదాల్లో ఒక జబ్బు వచ్చింది. చివరికి అది బాగా ముదిరిపోయింది; అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా అతను యెహోవా సహాయం కోసం కాకుండా వైద్యుల సహాయం కోసం వెదికాడు. 13  తర్వాత ఆసా చనిపోయాడు;*+ అతను తన పరిపాలనలోని 41వ సంవత్సరంలో చనిపోయాడు. 14  అప్పుడు అతన్ని, దావీదు నగరంలో+ అతను తన కోసం తొలిపించుకున్న గొప్ప సమాధిలో పాతిపెట్టారు. సాంబ్రాణి తైలం, అలాగే రకరకాల సుగంధ ద్రవ్యాలతో కలిపి చేసిన ఒక ప్రత్యేకమైన లేపనంతో నింపబడిన పాడె మీద అతన్ని ఉంచారు.+ అంతేకాదు, అతని గౌరవార్థం ఒక గొప్ప మంటను వేశారు.*

అధస్సూచీలు

లేదా “పటిష్ఠం చేయడం; తిరిగి కట్టించడం.”
లేదా “ఆసా ప్రాంతం నుండి ఎవ్వరూ బయటికి రాకుండా, ఎవ్వరూ అందులోకి వెళ్లకుండా.”
లేదా “ఒప్పందం.”
లేదా “ఒప్పందాన్ని.”
లేదా “పటిష్ఠం చేయడం; తిరిగి కట్టించడం.”
లేదా “పటిష్ఠం చేశాడు; తిరిగి కట్టించాడు.”
అక్ష., “ఆనుకున్నావు.”
లేదా “మద్దతు.”
లేదా “పూర్తిగా అంకితమై.”
అక్ష., “బొండ గృహంలో.”
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”
ఆసా మృతదేహాన్ని కాదుగానీ సుగంధ ద్రవ్యాల్ని కాల్చారని స్పష్టమౌతోంది.